అశ్రద్ధ చేయొద్దు!

పిల్లల చదువుల మీద ఓ కన్నేయాలి!
పెద్దల అవసరాలు మరోకంట కనిపెట్టాలి!
శ్రీవారి పనులు చక్కబెట్టాలి!
వీటికి అదనంగా, వృత్తినీ సమర్ధంగా నెట్టుకురావాలి!
ఈ బాధ్యతలన్నీ ఒడుపుగా నిర్వహించే మహిళలు...
తమ ఆరోగ్యాన్ని కూడా అంతే చాకచక్యంగా కాపాడుకోవాలి!

04-03-2019: మహిళల జీవితకాలంలో వారి శరీరాలు ఎన్నో ఒడిదొడుకులకు లోనవుతాయి. హార్మోన్ల అవకతవకలు, ప్రసవాలు, మెనోపాజ్‌... ఇలా వేర్వేరు దశలను దాటుకెళ్లే క్రమంలో మహిళలు శారీరక, మానసిక అసమతౌల్యాలకు గురవడం సహజం. అయితే ఈ పరిస్థితులకు, అంతకంతకీ వేగం పెరిగిపోతున్న జీవనశైలుల ప్రభావం కూడా తోడై మహిళల ఆరోగ్యం మరింత తేలికగా కుంటుపడుతోంది. ఇలా జరగకుండా, జీవితంలోని ప్రతి దశనూ మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా ఆస్వాదించాలంటే కొన్ని తెలివైన ఆరోగ్య మెలకువలు పాటించాలి. అవేంటంటే....

వ్యాయామం జీవితంలో భాగం కావాలి!
ఉదయాన్నే వాకింగ్‌, జిమ్‌లో చమటలు కక్కించడం, లేదా ఇంట్లోనే యోగాభ్యాసం చేయడం... దైనందిన జీవితానికి ఎలాంటి వ్యాయామాన్ని జోడించినా స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసాల్‌ అదుపులో ఉంటుంది. వ్యాయామం శరీరంతోపాటు మనసునూ చురుకుగా ఉంచుతుంది. కాబట్టి ఉదయం అల్పాహారానికి ముందు కనీసం 30 నిమిషాలపాటు గుండె వేగాన్ని పెంచే వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. రాత్రంతా కడుపు ఖాళీగా ఉంచి, ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల, రోజులో మరే ఇతర సమయాల్లో చేసే వ్యాయామం కన్నా కొవ్వు 20% అధికంగా కరుగుతుందని పరిశోధనల్లో రుజువైంది.
 
విటమిన్‌ డి, క్యాల్షియం లోపం!
వరుస ప్రసవాలు, గర్భిణిగా ఉన్న సమయంలో, పిల్లలకు పాలిచ్చేటప్పుడు తగినంత విటమిన్‌ డి, క్యాల్షియం తీసుకోకపోవడం వల్ల మహిళల్లో ఈ పోషక లోపాలు తలెత్తుతూ ఉంటాయి. వీటికితోడు కాలుష్యం కారణంగా సూర్యరశ్మి శరీరానికి సరిపడా అందకపోవడం, పోషకాహారలోపం వల్ల కూడా ఈ పోషకాల లోపం ఏర్పడుతుంది. కాబట్టి ఈ లోపాన్ని అధిగమించడానికి వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవచ్చు. మహిళలకు రోజుకు 800 నుంచి 1500 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. వయసు పైబడేకొద్దీ ఎముకలు గుల్లబారకుండా తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తుల ద్వారా ఈ మోతాదులో క్యాల్షియం అందేలా చూసుకోవాలి. క్యాల్షియం లోపం వల్ల మెనోపాజ్‌ దశలో ఎముకలు గుల్లబారి ఆస్టియోపొరోసిస్‌ సమస్య ఎదురవుతుంది. కీళ్ల సమస్యలూ వేధిస్తాయి. ఈ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించడం కోసం ఎముకల సాంద్రతను కనిపెట్టే ‘బోన్‌ డెన్సిటీ టెస్ట్‌’ చేయించుకోవాలి.
 
థైరాయిడ్‌ గండం!
థైరారుడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగితే హైపర్‌ థైరాయిడ్‌, తగ్గితే హైపోథైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మీద మహిళలు నిరంతరం ఓ కన్నేసి ఉంచాలి. అకారణంగా నిరాశానిస్పృహలు ఆవరించినా, బరువు పెరుగుతున్నా, తగ్గుతున్నా, నిస్సత్తువగా ఉంటున్నా, చర్మం పొడిబారినా, గొంతు వాపు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని కలిసి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరం మేరకు మందులు వాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే థైరాయిడ్‌ సమస్య ఉన్నా, నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు.
 
కంటి నిండా నిద్ర...
నిద్రలేమి వల్ల బరువు పెరుగుతారు, ఒత్తిడి ఎక్కువవుతుంది, డిప్రెషన్‌ దాడి చేస్తుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. రోజులో ఎదుర్కొన్న ఒత్తిడులు తొలగి, మరుసటి రోజుకి మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలంటే కంటి నిండా నిద్ర అత్యవసరం. ఇందుకోసం నిద్రను ఆటంకపరిచే అంశాలను పడకగది బయటే వదిలేయడం అలవాటు చేసుకోవాలి. నిద్రించే ప్రదేశం ప్రశాంతంగా, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు ఆందోళన పెంచే విషయాల గురించి ఆలోచించకూడదు. రాతిళ్లు నిద్రపోయే ముందు సినిమాలు చూడకూడదు.
 
ఆహారం మానేయొద్దు!
ఆఫీసుకు పరుగులెత్తే తొందరలో ఉదయం అల్పాహారం మానేసే మహిళలు ఎక్కువ. కొంతమంది మహిళలు మధ్యాహ్నం ఆఫీసు మీటింగులతో బిజీగా ఉండి, భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఆహారానికి సమయం కేటాయించాలి. ఒకేసారి మూడు పెద్ద భోజనాలు కాకుండా, రోజు మొత్తంలో 5 లేదా 6 స్వల్ప పరిమాణాల్లో తినడం ఆరోగ్యకరం. మరీ ముఖ్యంగా వ్యాయామం తదనంతరం,
కండరాలు శక్తి పుంజుకోవడం కోసం తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి.
 
ఈ అంశాలపై దృష్టి పెట్టండి!
వారానికి ఒకసారి బరువు చూసుకుంటూ, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 23 దాటకుండా చూసుకోండి.
ఇంటి పనులతో కేలరీలు ఖర్చవవు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటైనా వ్యాయామం చేయాలి.
హై కేలరీ కార్బొహైడ్రేట్లు, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ తగ్గించి, పీచు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
రజస్వల అయిన వయసు నుంచే రొమ్ములు స్వీయపరీక్ష పరీక్ష చేసుకుంటూ, గడ్డ ఉందని అనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి.
ఈ పరీక్షలతో ఆరోగ్యరక్షణ!
వ్యాధులను ముందుగానే పసిగట్టే వీలున్న ఈ పరీక్షలు వయసులవారీగా చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని నిక్షేపంగా కాపాడుకోవచ్చు!
18వ ఏడులో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి బ్లడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి.
20వ ఏట నుంచి ప్రతి ఐదేళ్లకోసారి కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకుంటూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే నియంత్రించవచ్చు. ఇదే వయసునుంచి మొదలుపెట్టి 40 ఏళ్లకు చేరుకునేవరకూ ప్రతి మూడేళ్లకోసారి క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామ్‌, మామోగ్రామ్‌ స్ర్కీనింగ్‌ చేయించుకుంటూ ఉంటే రొమ్ము కేన్సర్‌ను నియంత్రించవచ్చు.
21వ ఏళ్ల నుంచి ప్రతి రెండేళ్లకోసారి పాప్‌స్మియర్‌, పెల్విక్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షతో కణాల మార్పులను కనిపెట్టి సర్విక్స్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలను ముందుగానే కనిపెట్టవచ్చు.
45 ఏళ్ల వయసునుంచి ప్రతి మూడేళ్లకూ బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌ చేయంచుకుంటూ ఉంటే, ప్రీ డయాబెటిస్‌ను గుర్తించవచ్చు.
50 ఏళ్ల మహిళల్లో మెనోపాజ్‌ వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. కాబట్టి ఆస్టియో
పొరోసిస్‌ను గుర్తించటం కోసం ఏడాదికోసారి బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ చేయించుకుంటూ ఉండాలి.
 లైంగిక జీవితం ప్రారంభింబిన ప్రతి మహిళా 1 - 2 ఏళ్ల నుంచి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షతో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించవచ్చు.
- డాక్టర్‌ సాహిత్య బమ్మిడి,
కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌,
కేర్‌ హాస్పిటల్స్‌,
హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.