ప్రసవానంతరం ప్రశాంతంగా...

04-03-2019: శిశువుకు జన్మనివ్వడం అనేది కేవలం శారీరక విషయమేమీ కాదు. అది స్త్రీ మనసును అమితంగా ప్రభావితం చేసే అంశం. సహజంగా ప్రసవం అనేది ఎక్కువ మందిలో ఆనందోద్వేగాన్ని నింపుతుంది. కానీ కొంత మందిలో అది కొన్ని మానసిక సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఈ ప్రసవానంతర సమస్యలు (పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌) ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణంతో బయటపడుతుంటాయి. ఈ కారణంగా కొందరు తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు గల కారణాలేమిటో ఇప్పటి వరకూ అంత స్పష్టంగా తెలియదు గానీ, ప్రసవించగానే ప్రొజెస్టరాన్‌ హోర్మోన్‌ నిల్వలు భారీగా పడిపోవడం ఒక ప్రధాన కారణం అన్నది ఎండోక్రినాలజిస్టుల అభిప్రాయం. అయితే బిడ్డకు చనుబాలు ఇస్తున్నప్పుడు ప్రొలాక్టిన్‌ విడుదల కావడంతో ఆమె మనసు శాంతించే అవకాశాలు ఉంటాయి. మందులు లేకుండానే రుగ్మత నుంచి బయటపడేలా చేసే ఒక సహజ మార్గమిది. అయితే ఈ ప్రయోజనం అందరికీ ఉండదు. మిగతా కొందరిలో వివిధ ప్రతికూల లక్షణాలు కనిపిస్తాయి.
 
వాటిల్లో ఆకలి తగ్గిపోవడం, నిద్రలేమి, ఏకాగ్రతా లోపాలు, ఆత్యన్యూనతా భావం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మానసిక వైద్యులు యాంటీ-డిప్రెషంట్లు, ట్రాంక్విలైజర్లు సూచిస్తుంటారు. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరమైన ఆందోళన, అసహనం, ఒళ్లంతా చెమటలు పట్టడం, మగతగా ఉండడం, గుండెదడ, కండరాలు బిగుసుకుపోవడం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ స్థితిలో మానసిక వైద్యచికిత్సలు అవసరమైతే కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించాలి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా కొన్ని విధులు నిర్వహించాలి. ముఖ్యంగా....
మెలో ఉన్న లక్షణాలన్నీ ప్రసవానంతర రోజుల్లో అందరిలోనూ కనిపించేవేనని చెప్పాలి. అదే సమయంలో అవన్నీ తాత్కాలికమేనని, శరీరం కాస్త శక్తి పుంజుకోగానే అన్నీ సర్దుకుంటాయని కూడా చెప్పాలి.
భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులు ప్రతి విషయంలోనూ చేదోడుగా ఉండాలి. అలా ఉన్నవారిలో ఈ సమస్యలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రత్యేకించి పాప ఆలనాపాలనా అంతా తల్లిపైనే వదిలేయకుండా, ఇంట్లో వాల్లే అవన్నీ చూసుకోవాలి.
పిల్లల పోషణలో బాగా అనుభవం ఉన్న మహిళలు సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆమెతో ఉండే ఏర్పాట్లు చేయాలి. ఈ స్థితిలో దూర ప్రయాణం గానీ, కొత్త ఉద్యోగాలకు లేదా కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లడంగానీ చేయకూడదు. విశ్రాంతి సమయాన్ని బాగా పెంచాలి. ఆ సమయంలో పిల్లలు ఆమెను ఇబ్బంది పెట్టకుండా చూడాలి.
ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. రిలాక్స్‌ అయ్యే అవకాశాలు పెంచడంతో పాటు, ఆమె తన ఆత్మీయులను కలిసే అవకాశం కలిగించాలి.
ఒక శిశు వైద్యుడు, ఒక మానసిక వైద్య నిపుణుడు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి.
- డాక్టర్‌ సుజాతా రాజమణి
ఫ్యామిలీ సైకాలజిస్ట్‌,
కిమ్స్‌ హాస్పిటల్‌
హైదరాబాద్‌