ఆగిపోవడానికి అటూ... ఇటూ!

అక్టోబర్‌ 18 వరల్డ్‌ మెనోపాజ్‌ డే

15-10-2018: నెలసరి పట్ల మహిళలకు నిర్లక్ష్యం ఎక్కువే! మరీ ముఖ్యంగా మధ్యవయసులో క్రమం తప్పి, నెమ్మదించి, కనుమరుగైతే ‘నడి వయస్కుల్లో ఇది సహజమేలే!’ అని నిట్టూర్చి ఊరుకుంటారు తప్ప, మెనోపాజ్‌తో శరీరం లోలోపల జరిగే ప్రతికూల మార్పుల మీద దృష్టి పెట్టరు. కానీ మెనోపాజ్‌, అది తెచ్చిపెట్టే ఇబ్బందులు, దీర్ఘకాలంలో బాధించే సమస్యల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి!

అత్యంత సహజమూ, అనివార్యమే కావచ్చు. కానీ, మెనోపాజ్‌కు సంబంధించి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోకపోతే అది పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది.
 
మెనోపాజ్‌ అంటే...
దాదాపు 35 ఏళ్లపాటు సాగే రుతుక్రమానికి ఇది చివరి దశ. సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయసులో మెనోపాజ్‌ వస్తుంది. మామూలుగా అయితే, వరుసగా 12 నెలల పాటు బహిష్టులు రాకపోతే మెనోపాజ్‌ వచ్చినట్లు అనుకోవచ్చు. ఈ దశలో స్త్రీ తన శరీరంలో, మనసులో వచ్చే మార్పులు, రాగల ఇబ్బందులు, వ్యాధుల గురించి తెలుసుకోవాలి.
 
మెనోపాజ్‌ కారణాలేమిటి?
స్త్రీ అండాశయంలో అనేక లక్షల అండాలు ఉంటాయి. అయితే స్త్రీ మొత్తం జీవిత కాలంలో సుమారు 450నుంచి 500 అండాలు మాత్రమే పూర్తిగా పరణతి చెంది బహిష్టు వేళల్లో విడుదల అవుతుంటాయి. అదే క్రమంలో అండం విడుదలను నియంత్రించే ఈస్ట్రోజన్‌, ప్రొజిస్టిరాన్‌ హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ పరిణామంతో అండాల సంఖ్య తగ్గిపోయి, హార్మోన్లను సరిపడా ఉత్పత్తి జరగక, అండం విడుదల అవక రుతుచక్రం ఆగిపోతుంది.
 
ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌
ఏ స్త్రీకైనా 40 ఏళ్ల తర్వాత మెనోపాజ్‌ వస్తే అది సహజ పరిణామమే. అయితే కొంతమందికి అంతకన్నా ముందే మెనోపాజ్‌ వచ్చేస్తుంది. క్రోమోజోమ్స్‌ లోపాలు, జన్యుసంబంఽధిత సమస్యలు, థైరాయిడ్‌ వ్యాధి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ మొదలవుతుంది. మరికొందరిలో సర్జరీ ద్వారా అండాశయాన్ని తొలగించడం వల్ల గానీ, కీమోథెరపీ లేదా రేడియోథెరపీల వల్ల గానీ, ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ రావచ్చు. ఆ తర్వాత పలురకాల శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి.
 
పోస్ట్‌ మెనోపాజ్‌
బహిష్టులు ఆగిపోయిన ఈ దశలో కొందరిలో వేడి ఆవిరులు, మూత్ర, జననాంగ సమస్యలు గుండె జబ్బులు, ఎముకల వ్యాధులు, భావోద్వేగ సమస్యలు ఉంటాయి.
 
మూత్ర వ్యవస్థలో....
ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గిపోయిన ఫలితంగా మూత్రద్వారం చుట్టూ ఉన్న కణజాలం పలచబారుతుంది. పెల్విక్‌ కండరాలు బలహీనపడతాయి. మూత్రనియంత్రణ పోవడంతో తుమ్మినా, దగ్గినా, నవ్వినా తెలియకుండానే మూత్రం పడిపోతుంది. తరుచూ మూత్ర వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు పుల్లని పండ్లకు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కవ బరువు ఉంటే తగ్గాలి. జననాంగాల బయటి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మలమూత్రాలు నియంత్రణలో లేనప్పుడు వాటిని నియంత్రించేందుకు కండరాల్ని బిగపట్టి, వదులు చేసే కెగెల్‌ వ్యాయామాలు చేయాలి.
 
జననాంగ వ్యవస్థలో...
జననాంగం లోపలి పొర చదునుగా, పలచగా మారుతుంది. సాగేగుణం తగ్గిపోతుంది. స్రావాలు తగ్గిపోయి పొడిబారుతుంది. దురద, మంట ఉంటాయి. ఫలితంగా ఇన్పెక్షన్లు ఎక్కువవుతాయి. రతిలో నొప్పి వస్తుంది. జననాంగంలో కలిగే పలురకాల ఈ మార్పుల వల్ల తీవ్రమైన అలసట, మూడ్‌మార్పులు, మానసిక ఆందోళనలు, భయాల వల్ల లైంగిక వాంఛ తగ్గిపోవచ్చు. రతిలో నొప్పిగా ఉంటే, జననాంగంలో తడి పెంచేందుకు వెజైనల్‌ మాయిశ్చరైజర్‌ లేదా లూబ్రికెంట్‌ వాడాలి. ఈస్ట్రోజన్‌ ఆయింట్‌మెంట్‌ ఉపయోగిస్తే, జననాంగంలోని పొడితనం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్‌, డిశ్చార్జ్‌ సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రతించాలి.
 
ఇతర సమస్యలు
జీవక్రియల్లో కలిగే మార్పుల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ కొవ్వు పెరిగి గుండెపోటు, పక్షవాతం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం, అస్తవ్యస్తంగా కొట్టుకోవడం ఉంటాయి.
మెనోపాజ్‌ తర్వాత 5 ఏళ్లల్లో ఎముకల్లోని క్యాల్షియం బయటికి వెళుతుంది దాంతో ఎముకలు బలహీనపడి, చిన్న ఒత్తిడికే విరిగిపోతాయి.
చర్మం సాగే గుణం కోల్పోయి, ముడతలు పడుతుంది.
పళ్లు ఊడిపోవడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
కండరాల నొప్పి, కండరాలు పట్టేయడం ఉండవచ్చు.
ఈస్ట్రోజన్‌ తగ్గి, ఆండ్రోజన్‌ ఉత్పత్తి పెరగడంతో జుత్తు రాలిపోవడంతో పాటు ముఖం మీద అవాంఛిత రోమాలు పెరుగుతాయి.
స్ర్కీనింగ్‌ పరీక్షలు
డాక్టర్‌ను సంప్రతించి అవసరమైన అన్ని పరీక్షలూ చేయించాలి. డాక్టర్‌
సూచించిన విధంగా హార్మోన్‌ థెరపీ తీసుకుంటే, మెనోపాజ్‌ వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి.
 
హెచ్‌ఆర్‌టి థెరపీ
హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ మెనోపాజ్‌ సమస్యలను తగ్గిస్తుంది. కేవలం
ఈస్ట్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ కలిపి, లేదా కేవలం ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లతో కూడిన నోటి మాత్రలతో చికిత్స సాగుతుంది. ఈ మాత్రలు వైద్యులు
సూచించినంతకాలం, వారు సూచించిన మోతాదుల్లోనే వాడాలి.
 
మెనోపాజ్‌- వివిధ దశలు
మెనోపాజ్‌కు ముందు వెనుక ఉండే ఒక దశను ‘పెరిమెనోపాజ్‌’ అంటారు. మెనోపాజ్‌ రావడానికి కొన్ని ఏళ్లముందే మొదలయ్యే ఈ దశలో అండాశయంలో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది అండాల విడుదల ఆగిపోయి, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి వేగంగా త గ్గిపోయే దాకా అంటే మెనోపాజ్‌ తర్వాత ఒకటి రెండేళ్ల దాకా ఈ పెరిమెనోపాజ్‌ కొనసాగుతుంది. ఈ దశలో బహిష్టులు క్రమం తప్పుతాయి. రుతుస్రావ పరిమాణం ఎక్కువగానో, తక్కువగానో కావడం, మామూలుగా కన్నా, ఎక్కువ రోజులు కావడమో, లేదా తక్కువ రోజులు కావడమో జరుగుతూ ఉంటుంది.
 
ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గితే...
ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం వల్ల ఒక్కోసారి, రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు అస్థిరంగా మారి, హఠాత్తుగా, శరీరం పై భాగంలో, ఛాతీ నుంచి మెడలోకి, ముఖంలోకి, ఆ తర్వాత శరీరం పై భాగమంతా వేడి ఆవిర్లు పాకుతాయి. ఆ వెంటనే ముచ్చెమటలు పోసి చలి వేస్తుంది. అవి నాలుగు నిమిషాల దాకా ఉంటాయి. కొంత మందికి రోజుకు రెండు 2-3 సార్లు, మరికొందరికి గంటకు 3-4 సార్లు అలా రావచ్చు. కొందరికి అకస్మాత్తుగా రాత్రిపూట అలా వచ్చి నిద్రాభంగం కలగవచ్చు.
 
నివారణగా...
ఒత్తిళ్లను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కాఫీ, టీ, మద్యం, పొగతాగడం, కారం, మసాలా, వేడిపదార్థాలకు దూరంగా ఉండాలి. తేలికగా, వదులుగా ఉండే దుస్తులను ధరించడం, బెడ్‌ రూమ్‌ వేడిగా ఉండకుండా చూసుకోవడం, శ్వాస వ్యాయామాల్ని చేయాలి. వేడి ఆవిరులు వస్తున్నాయని అనుమానం కలగగానే నిమిషానికి 6-8 సార్లు ఊపిరి తీసుకుని వదలాలి. ధ్యానం, సెల్ఫ్‌ హిప్నోసిస్‌ వంటివి కూడా చేస్తే మరింత ప్రయోజనకరం. రోజూ తప్పనిసరిగా నడక, ఈత, సైకిల్‌ తొక్కడం లాంటి వ్యాయామాలు చేయాలి. సోయా, బ్లాక్‌ హాష్‌ లాంటి వృక్ష సంబంధ ఉత్పత్తులు హాట్‌ ఫ్లాష్‌ సమస్యను తగ్గించవచ్చు. హార్మోన్‌ థెరపీ కూడా సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.

డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌,
శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌