మోకాలి నొప్పినుంచి ఉపశమనం

ఆంధ్రజ్యోతి(17-10-2016): ఒకప్పుడు మోకాలి నొప్పులు నలభై ఏళ్ల తర్వాత వచ్చేవి. ఇప్పుడలా కాదు థర్టీప్ల్‌సలోనే ఈ సమస్య వస్తోంది. దీన్ని తగ్గించాలంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటమే ఉత్తమం.

 మోకాలి సమస్యలతో బాధపడేవారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది మరీ ఎక్కువైందని సర్వేలు చెబుతున్నాయి. తీసుకునే ఆహారం, లైఫ్‌స్టయిల్‌, బరువు పెరగటం, వ్యాయామం లేకపోవటం వల్ల ఈ సమస్య ఎక్కువుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

సరైన ఆహారం తీసుకోవాలి: న్యూట్రిషన్‌ ఫుడ్‌ తినటం అలవాటు చేసుకోవాలి. ఇష్టమొచ్చినట్లు బయటిఫుడ్‌ను లాగించటం వల్ల బరువు పెరుగుతారు. తద్వారా మోకాలి సమస్యలు మొదలవుతాయి. అందుకే శరీరానికి తగినట్లు పోషకాహారం తినటంతో పాటు విటమిన్‌- డి ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఎముకల్లో ధృడత్వం వస్తుంది. దీనివల్ల మోకాలి నొప్పులు ఇబ్బందిపెట్టవు.
 
బరువు తగ్గాలి: అనవసరమైన బరువు ఉండటం వల్ల మోకాలి నొప్పుల్ని కోరికొని తెచ్చుకున్నట్లే. అందుకే సాధ్యమైనంత వరకూ బరువు తగ్గాలి. సరైన వ్యాయామం చేయాలి. వాకింగ్‌, ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. అలాగని విపరీతంగా వ్యాయామాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని గమనించాలి. అందుకే సరైన వ్యాయామంతో హైట్‌కి తగిన బరువును మెయిన్‌టైన్‌ చేస్తే మోకాలి సమస్యలురావు.
 
హైహీల్స్‌ వాడకూడదు: హైహీల్స్‌ వాడే మహిళలు ఎక్కువవుతున్నారు. కొన్నిగంటలపాటు హైహీల్స్‌ వాడేవారికి మడమల నొప్పులు త్వరగా తలెత్తుతాయి. ఆ తర్వాత మోకాలి నొప్పులు వస్తాయి. అందుకే థర్టీప్ల్‌సలోని మహిళలు ఎముకల డాక్టర్ల దగ్గరకు వచ్చినపుడు ‘హైహీల్స్‌ను వాడొద్దు’ అని వారు సలహా ఇస్తున్నారు.