పిల్లలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే...

 ప్రశ్న: పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
- సుదర్శన్‌, విజయవాడ
 
సమాధానం: పిల్లలకు మనం చిన్నతనంలోనే మంచి ఆహారపు అలవాట్లను పరిచయం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. బడి వయసు పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వాలి. ఉదయం ఓ కప్పు పాలు, గుడ్డు, ఇడ్లీ, దోసె లాంటివి మంచిది. మధ్యాహ్నం ఆకుకూరలు, పప్పు, కొద్దిపాటి అన్నంతో భోజనం పెట్టండి. సాయంత్రం స్నాక్స్‌గా పళ్ళు, బఠాణీలు, సెనగలు, వేరుశెనగ పప్పు, మరమరాలు, అటుకులు ఇవ్వాలి. నూనెలో వేయించిన చిరుతిళ్ళు, బిస్కెట్లు, చాక్‌లెట్లు, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ ... లాంటివి నెలలో ఒకటి రెండు సార్లకు పరిమితం చేయాలి. రాత్రి తేలికగా ఉండే అన్నం లేదా చపాతీతో కొంత కూర, పెరుగు లేదా మజ్జిగ మంచిది. కావాలంటే ఈ సమయంలో మరొక పండు కూడా తినేలా చూడవచ్చు. పదేళ్ల వయసు పిల్లలకు రోజులో కనీసం రెండు గంటల సేపు ఆడుకునే అవకాశం ఉండాలి. ఒకే దగ్గర కూర్చుని టీవీ చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం... కాకుండా ఆరుబయట ఆటలాడేలా ప్రోత్సహించాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. నిద్రకు పది నిమిషాల ముందు ఓ గ్లాసు పాలు ఇస్తే సరిపోతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర చాలా అవసరం. కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూడాలి. 

 

డా.లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutriful you.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)