పిల్లలకు ఎండ తగలాల్సిందే..!

ఆంధ్రజ్యోతి(25-07-2019): పిల్లల్లో విటమిన్‌-డి లోపం పెద్ద సమస్యగా మారుతోంది. మైదానాల్లో ఆటలు ఆడటం తగ్గిపోయాక ఈ సమస్య మరింత పెరిగింది. పిల్లలు ఎక్కువ సమయం తరగతి గదుల్లోనే ఉండడం, ఎండలో తగినంత సమయం గడపకపోవడం వల్ల వారిలో డి- విటమిన్‌ లోపిస్తోంది. అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్లాన్‌ వేసింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ, ఆటపాటల పీరియడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలను ఆరుబయటే నిర్వహించాలన్నది దాని సారాంశం. లక్నోలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిర్ణయాన్ని ముందుగా అమలు చేస్తున్నారు.

 
విటమిన్‌ డి లోపం వల్ల వచ్చే రికెట్స్‌ వ్యాధిని (ఎముకలు సున్నితంగా మారడం, ఎముకలు వంకర్లు పోవడం) నివారించేందుకు ఎండలోనే అసెంబ్లీ, డ్రిల్‌ పీరియడ్‌ నిర్వహించాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంఎచ్‌ఆర్డీ) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మధ్యే ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా విటమిన్ల మాదిరిగా కూరగాయలు, పండ్లు, ఆహారంలో విటమిన్‌ డి అంతగా లభించదు. సూర్యరశ్మి ద్వారానే ఈ విటమిన్‌ అందుతుంది. కాబట్టి తరగతులు లేనప్పుడు పిల్లల్ని కొద్దిసేపు ఎండలో ఆడుకోనివ్వడం, సాయంత్రం వేళ విద్యార్థులు ఆటలు ఆడేలా చూడటం ద్వారా పిల్లల్లో విటమిన్‌-డి సమస్య తలెత్తకుండా చేయడం ద్వారా సమస్యను అధిగమించనున్నారు. సరిపడా విటమిన్‌ డి అంది, వారి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఈ విషయం మీద అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.