పిల్లలు మెరికల్లా మారాలంటే

27-10-2016,ఆంధ్రజ్యోతి:పిల్లల్లో దాగి ఉండే ఎమోషనల్‌, సోషల్‌, ఇంటలెక్చువల్‌ స్కిల్స్‌ శరీర కండరాల్లాంటివి. వాటికి వ్యాయామ్నానందించి శక్తిమంతంగా మార్చటం లేదా పట్టించుకోకుండా వదిలేసి అసమర్ధులుగా తయారు చేయటం తల్లిదండ్రుల చేతుల్లో పనే! కాబట్టి పిల్లలు మెరికల్లా తయారవటం కోసం వాళ్ల పట్ల పేరెంట్స్‌ ఎలా ప్రవర్తించాలంటే?

పిల్లలతో మాట్లాడాలి: ప్రపంచవ్యాప్తంగా పిల్లల మీద చేపట్టిన పరిశోధనల్లో మూడేళ్ల వయసుకే 88 - 98% పదజాలాన్ని వాళ్ల తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటున్నారని తేలింది. దీన్నిబట్టి మనం పిల్లలతో ఎంత ఎక్కువగా మాట్లాడితే వాళ్ల భావ వ్యక్తీకరణ, సంభాషించే నైపుణ్యాలు అంతలా పెరుగుతాయని అర్థమవుతోంది. కాబట్టి పిల్లలతో వీలైనంత ఎక్కువ మాట్లాడాలి.
 
ఆటలాడనివ్వాలి: ఫిన్‌లాండ్‌లోని స్కూళ్లలో ప్రతి 45 నిమిషాల క్లాసు తర్వాత 15 నిమిషాల బ్రేక్‌ ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు వాళ్లకిష్టమైన ఆటలు ఆడతారు. ఇలా ఆటలకు సమయాన్నివ్వడం వల్ల పిల్లల్లో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, రీజనింగ్‌, మెమొరీ మొదలైన ఎగ్జిక్యూటివ్‌ ఫంక్షనల్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. కాబట్టి పిల్లలను ఆటలవకు వదలాలి.
 
పిల్లల టీవి టైమ్‌: ప్రతి పిల్లాడు టీవీ ద్వారా సంవత్సరానికి 20 వేల ప్రకటనలు చూస్తాడు. వీటిలో 34% ప్రకటనలు తీపి పదార్థాలవే! వీటికి ఆకర్షితులవటం ఒక నష్టమైతే మెదడులోని విజువల్‌ పార్ట్‌ దెబ్చతిని క్రియేటివిటీ నాశనమవటం టీవీ చూడటం వల్ల కలిగే మరో ప్రధాన నష్టం. కాబట్టి రోజు మొత్తంలో అరగంటకు మించి టీవీలకు సమయాన్నివ్వకూడదు.
 
అందరూ ఆర్టిస్టులే: కిండర్‌గార్టెన్‌లో ఉన్నప్పుడు మీలో బొమ్మలు ఎవరు బాగా వేస్తారు? అని టీచర్‌ అడగ్గానే అందరూ చేతులెత్తేవాళ్లు. మూడో తరగతిలో ఆ చేతుల సంఖ్య తగ్గి పదో తరగతికి వచ్చేసరికి ఒకటో రెంటికో పరిమితమైపోతోంది. క్రియేటర్‌గా తయారయ్యే మెలకువలు అలవడటానికి క్రియేటివిటీ ప్రదర్శించే వీలుండటం ఎంతో అవసరం.
 
సరదాగా.. సంతోషంగా: తల్లిదండ్రులు పిల్లలతో ఆడాలి, పాడాలి. తరచుగా స్నేహపూర్వకమైన నవ్వుతో పలకరించాలి. అవసరమైతే వాళ్లతో కలిసి డాన్స్‌ చేయాలి. ఎగరాలి, పరిగెత్తాలి. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఇవన్నీ ఎంతో అవసరం. పెద్దలమనే అహంభావం ఏమాత్రం పనికిరాదు.