‘ఎందుకలా ఏడుస్తారూ’.. అంటే!

01-08-2018: కొంతమంది పిల్లలు అయినదానికీ, కానిదానికీ అదేపనిగా ఏడుస్తుంటారు. ‘ఏమైందీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి?’ అంటూ ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పరు. ఎంత గుచ్చి గుచ్చి అడిగినా ప్రతిదానికీ అడ్డంగా తల ఊపడమే తప్ప నోట్లోంచి ఒక్క మాటా రాదు. ఆ తర్వాత తలిదండ్రులకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. చెడామడా తిట్టడమో, దబాదిబా బాదడమో చేస్తారు. దాంతో పిల్లల ఏడుపు ఇంకా రెట్టింపవుతుంది. 

పిల్లలు ఇలా ఎందుకు ఏడుస్తారూ అంటే దానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో శారీరకంగా, మానసికంగా విపరీతంగా అలసిపోవడం కూడా ఒక కారణమే. స్కూలు - ట్యూషన్‌......ట్యూషన్‌ - స్కూలు అంతా రంగుల రాట్నమేగా? ఆదివారం రోజున కూడా కొందరు పిల్లలు మరుసటి రోజు స్కూలు విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా వారి శరీరమూ, మనసూ ఎడతెగకుండా అలసిపోతుంటాయి. ఆ అలసట అలా పెరిగి పెరిగి తట్టుకోలేక చివరికి ఏడుపు మొదలెడతారు. ఈ మాటంటే కొందరు పేరెంట్స్‌ ‘‘మిగతా పిల్లలెవరూ పడని కష్టాలు వీడొక్కడే పడుతున్నాడా?’’ అంటూ ప్రశ్నించవచ్చు. కానీ, పిల్లలందరి శక్తిసామర్థ్యాలు ఒకేలా ఉండవు కదా! మిగతా పిల్లల మాట ఎలా ఉన్నా, శారీరకంగా కాస్త బలహీనంగా ఉన్న పిల్లలు మిగతా పిల్లలకన్నా తొందరగా అలసిపోతుంటారు. అక్కడికీ మొండిగా, ఎంతో నిబ్బరంగా ఆ పనులన్నీ నెట్టుకు వస్తూనే ఉంటారు. కానీ, ఒకానొక దశలో ఆ నిబ్బరమంతా జారిపోయి, బావురుమని ఏడ్చేస్తారు.
 
అలాంటి పిల్లలను చీవాట్లు పెట్టకుండా తలిదండ్రులు వాళ్ల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. అందులో ప్రథమంగా, వాళ్ల శక్తి సామర్థ్యాలను పెంచే ప్రయత్నాలు చేయాలి. అంతకన్నా ముందు వారికి ఆకలి సరిగా ఉంటోందా? లేదా? గమనించాలి. దానికి గల కారణాలేమిటో, దాన్ని అధిగమించే మార్గమేమిటో కనుక్కుని పాటించాలి. ఆకలి పెరిగిన తర్వాత సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు, పండ్ల రసాలు, సూప్స్‌ తరుచూ అందించాలి. వీటివల్ల విటమిన్‌లోపాలు, లవణాల లోపాలు ఏమైనా ఉన్నా తీరిపోతాయి. దీనివల్ల చదువు సంబంధమైన ఒత్తిడిని తట్టుకునే శక్తి కొంత పెరుగుతుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మానసిక ఒత్తిడిని అధిగమించే మాటలు చెప్పాలి.
 
ముఖ్యంగా, ‘‘నువ్వు ఎంత కష్టపడి చదువుతున్నావో మాకు తెలియనిది కాదు. అయితే ఈ కష్టమే నీకొక అందమైన భవిష్యత్తును ఇస్తుంది. ప్రపంచంలో ఉన్నత స్థానాన్ని అందుకున్న వాళ్లంతా, ఈ కష్టాలన్నీ పడినవాళ్లే. అందువల్ల పైకి రావాలనుకునే ఎవరికైనా ఈ కష్టం తప్పదు. నీకూ తప్పదు’’ అంటూ వారిని సముదాయిస్తూనే, వారిలో స్పూర్తి నింపాలి. ఇలా వారి శారీరక దారుఢ్యాన్నీ, మనోబలాన్నీ పెంచడంతో వాళ్లల్లో నిబ్బరం పెరుగుతుంది. పిల్లల్లో సుడి తిరుగుతున్న వేదన హరించుకుపోయి ఏడుపు తగ్గిపోతుంది. ఆ క్రమంలో వాళ్లలో కష్టపడేతత్వం కూడా పెరుగుతుంది.