వీళ్లల్లో ఎముకలు బలంగా ఉండవు

ఆంధ్రజ్యోతి(20-10-15): ఫాస్ట్‌ఫుడ్‌ తినే పిల్లల్లో  ఎముకలు బలహీనపడతాయట. అందులోనూ సూపర్‌మార్కెట్లు, ఫాస్ట్‌ఫుడ్‌లు దగ్గరగా ఉన్న ఇళ్లల్లోని పిల్లలకు చిన్నతనంలోనే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందట. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు ఈ స్టడీని నిర్వహించారు. ఫాస్ట్‌ ఫుడ్‌ తినే పిల్లల బోన్‌ మినరల్‌ డెన్సిటీని అధ్యయనకారులు పరీక్షించారు. 1,107 మంది పిల్లలను ఈ స్టడీలో అధ్యయనం చేశారు. పుట్టినప్పుడు వాళ్ల బోన్‌ మినరల్‌ కంటెంట్‌, బోన్‌ మినరల్‌ డెన్సిటీని పరిశీలించారు. తర్వాత నాలుగైదు సంవత్సరాల వయసు  పిల్లల్లో కూడా వీటిని పరీక్షించారు.  ఈ డేటాను పిల్లల ఇంటికి దగ్గరలో ఉండే  సూపర్‌మార్కెట్స్‌, హెల్త్‌సోర్సు, ఫాస్ట్‌ఫుడ్‌ అవుట్‌లెట్స్‌ డేటాతో పోల్చి చూశారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్స్‌, సూపర్‌మార్కెట్స్‌  అందుబాటులో ఉన్న  ప్రాంతాల్లోని చిన్నపిల్లల్లో బోన్‌ మినరల్‌ డెన్సిటీ, బోన్‌మినరల్‌ కంటెంట్‌ బాగా తక్కువగా ఉన్నాయని తేలింది. ఇలాంటి చోట్ల ఉన్న నాలుగు, ఐదు సంవత్సరాల పిల్లల్లో బోన్‌ మినరల్‌ డెన్సిటీ, బోన్‌ మినరల్‌ కంటెంట్‌ ఎక్కువగా లేవు. అదే హెల్దీ స్పెషాలిటీ స్టోర్స్‌ ఉన్న చోట్లల్లో ఉంటున్న నాలుగు, ఐదు సంవత్సరాల వయసున్న పిల్లల్లో బిఎండి బాగా ఉందని వెల్లడైంది. ఆరోగ్యవంతమైన డైట్‌ తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. ఇందుకోసం ప్రొటీన్లు, విటమిన్‌-డి, కాల్షియం, పళ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారానికి ఫోకస్‌ అయిన  పిల్లల్లో బోన్‌ మినరల్‌ డెన్సీటీ బాగా ఉంటుందన్న విషయం స్పష్టమైంది. హెల్తీ ఫుడ్స్‌ ఉన్న  చోట్ల నివసిస్తున్న తల్లులు తమ పిల్లలకు ఆరోగ్యవంతమైన డైట్‌ను పెట్టే అవకాశం కూడా బాగా ఉంది. అయితే ఇంకా ఈ అంశంపై  మరింతగా పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందని అధ్యయనకారులు భావిస్తున్నారు. తర్వాత చేసే పరీక్షల్లో కూడా ఇదే నిర్థారణ  అయితే ఫుడ్‌ స్వరూప స్వభావాల్లో మార్పులు రావొచ్చు. దాంతోపాటు పిల్లల బోన్‌ డెన్సిటీ కూడా మెరుగుపడే అవకాశం ఉంది..