బుజ్జాయిలకు లాల ఇలా!

ఆంధ్రజ్యోతి (24-12-2019):పసికందులు తాకితేనే కందిపోయేంత సున్నితంగా ఉంటారు. అలాంటి బుజ్జాయిలకు ఏకంగా స్నానమే చేయించాలంటే... భయం వేయటం సహజమే! కానీ, ఇందుకు విరుద్ధంగా పసికందులకు కాస్త మొరటుగా స్నానం చేయించేవాళ్లూ లేకపోలేదు. అసలు పిల్లలకు స్నానం చేయించే పద్ధతంటూ ఉంటుందా? ఏ పద్ధతి వల్ల పిల్లలు అసౌకర్యానికి గురికాకుండా ఉంటారు?
 
బొడ్డుతాడు ఊడేవరకూ: పుట్టింది మొదలు ప్రతిరోజూ పసికందులకు స్నానం చేయించవచ్చు లేదా వారంలో మూడు సార్లు చేయించినా సరిపోతుంది. అయితే ఏకంగా టబ్‌లో కాకుండా సబ్బు నీళ్లలో ముంచి మెత్తని స్పాంజ్‌తో ఒళ్లంతా తుడిచి, వేడి నీళ్లలో తడిపి పిండిన గుడ్డతో తుడవాలి.
 
ఏ సమయంలో?: పిల్లలు ఉదయం వేళ స్నానం ఇష్టపడతారు. ఇంకొందరు రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేయటానికి మక్కువ చూపుతారు. అసలు స్నానమే వద్దనుకుంటే ముఖం, మెడ, చేతులు, డయాపర్‌ వేసే ప్రదేశాలను శుభ్రం చేసినా సరిపోతుంది. అయితే స్నానం మాత్రం వారంలో కనీసం 3 సార్లైనా తప్పక చేయించాలి.
 
ఏ సబ్బు: పిల్లలకు గరుకుగా ఉండే సున్నిపిండి బదులు పర్‌ఫ్యూమ్‌, డైలు వాడకుండా తయారైన సబ్బును ఎంచుకోవాలి. సబ్బును రుద్దేటప్పుడు ఒక చేత్తో తలను పట్టుకుని ఇంకో చేత్తో ఒళ్లు రుద్దాలి. ఎక్కువ నీటితో సబ్బు నురగంతా వదిలేలా సున్నితంగా రుద్ది స్నానం చేయించాలి.