పిడివాదం చేయనివ్వకండి!

ఆంధ్రజ్యోతి (18-11-2019): పిల్లలే అని కాదు కొంతమంది పెద్దవాళ్లు కూడా పిడివాదం చేయడం చూస్తుంటాం. అయితే బాల్యంలోనే పిడివాదానికి బీజం పడితే అది మరీ ప్రమాదం. కొంత మంది పిల్లలు తమకు తెలిసిందే పరమ సత్యమంటూ వాదిస్తూ, ఇతరులు చెప్పే ప్రతి మాటనూ ఖండిస్తూ ఉంటారు. ఇలాంటి ధోరణి కొందరిలో పోనుపోనూ ఒక స్వభావంగా కూడా మారిపోవచ్చు. ఏదైనా ఒక ధోరణి కొన్ని కాల పరిస్థితుల్లో మారిపోవచ్చేమో గానీ అదొక స్వభావంగా మారితే చాలా కష్టం. ఎవరైనా వీళ్లను విమర్శిస్తే, వాళ్లకు తమను అర్జం చేసుకునే స్థాయి లేదని మాట్లాడతారే గానీ, తమ ఆలోచనోనే ఏదో లోపం ఉందని మాత్రం ఎప్పుడూ అనుకోరు.

ఇలాంటి మనస్తత్వాల్ని తరచి చూస్తే, వీటి మూలాలు బాల్యంలోనే ఉన్నాయనే విషయం బోధపడుతుంది. అసలు ఏం జరుగుతుందీ అంటే, బాల్యంలో ఎవరో ఒక విషయం చెబుతారు. దాన్ని సమర్థించే ఒక వాదన వినిపిస్తారు. ఆ వాదనతో వాళ్ల హృదయం బలంగా కన్విన్స్‌ అవుతుంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లో దానికి భిన్నమైన వాదన ఏదీ వాళ్ల చెవిన పడకపోతే, ఇక తాము కన్విన్స్‌ అయిన ఆ వాదననే పట్టుకుని వేళ్లాడతారు.

ఎక్కడికి వెళ్లినా ఆ వాదనే చేస్తారు. అందుకు భిన్నంగా ఎవరేం చెప్పినా ఖండిస్తారు. ఒక్కోసారి అవతలి వాళ్లను అవహేళన కూడా చేస్తారు. వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సంఘటన జరగడానికీ, ఏదైనా నిలబడడానికీ, లేదా ఒకటి కూలిపోవడానికీ ఒకే ఒక్క కారణం అంటూ ఉండదు. తమకు తెలిసిన ఆ కారణంతో పాటు ఇంకా అనేక కారణాలు ఉంటాయి. ఆ విషయం తెలియక తనకు తెలిసినదే తప్ప మిగతావేవీ కారణాలే కావు అనే ధోరణి వీరిలో పాతుకుపోతుంది. నేల పైన ఒక మొక్క మొలవడానికి, మంచి నాణ్యమైన విత్తనం కావడం ఒక్కటే కారణం కాదు కదా! ఆ విత్తిన నేల సారవంతమైనది కావడం, సరిపడా నీరు అందించడం, ఆ నాటిన విత్తనం పక్షుల పాలో, ఎలుకల పాలో కాకుండా కాపాడడం ఇవన్నీ కారణాలే కదా! బాల్యంలో ఎక్కువ కారణాలు చెబితే వాళ్లకు అర్థం కాదని, ఏదో ఒకటి చెప్పి వదిలేస్తే వచ్చే చిక్కే ఇది.
 
అందువల్ల ఒక విషయానికి సంబంధించి తల్లితండ్రులు పిల్లలకు ఏదైనా చెబుతున్నప్పుడు అన్నీ అప్పుడే చెప్పడం అన్నిసార్లూ సాధ్యం కాదు కనుక, కొంత జాగ్రత్త పడాలి. ‘‘దీనికి ఇదొక కారణమే! అయితే ఇదొక్కటే కారణం కాదు!! అయితే, అన్నీ ఇప్పుడే చెప్పుకోలేం కాబట్టి మునుముందు మిగతావన్నీ వీలును బట్టి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం’’ అంటూ ముగించాలి. అలాగైతేనే పిల్లలు పిడివాదులుగా మారకుండా ఉంటారు.