గాఢనిద్రకు ఘనాహారం

04-09-2018: పిల్లలు అసలు నిద్రేపోవడం లేదనీ, తెల్లవార్లూ అదేపనిగా ఏడుస్తున్నారని చాలా మంది తలిదండ్రులు చెబుతుంటారు. అయినా, కారణం చెప్పి ఏడ్చే పెద్ద పిల్లలు వేరు. కానీ ఏ కారణం చెప్పకుండా ఎడతెరిపి లేకుండా ఏడ్చే పసిపిల్లలు నిజంగా చిరాకు పెట్టేస్తారు. కారణం తెలిస్తే ఏదో ఒకటి చేయవచ్చు, ఆ కారణమే తెలియకపోతే ఎవరైనా ఏం చేయగలరు? అయితే, బ్రిటన్‌ పరిశోధకులు ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన చిట్కా ఒకటి చెబుతున్నారు. పసిపిల్లల మీద జరిపిన ఒక అధ్యయనంలో ఏ పిల్లలకైతే, మూడు మాసాల వయసు నుంచే తల్లిపాలతో పాటు ఘనాహారం కూడా ఇస్తున్నారో, ఆ పిల్లలు హాయిగా నిద్రిస్తున్నారనీ. 6 మాసాల వయసు వచ్చేదాకా ఏ పిల్లలు కేవలం తల్లిపాల మీదే ఆధారపడుతున్నారో, వారు, తరుచూ మేలుకుంటూ ఏడుపు లంఘిస్తున్నారనీ వెల్లడయ్యింది. బ్రిటన్‌లో ప్రచురితమయ్యే .జర్నల్‌ ‘జామా పీడియాట్రిక్స్‌’ ఇటీవలి సంచికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పిల్లలకు 6 మాసాల దాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచిస్తోంది, అయితే, చాలా మంది తల్లులు తమ పిల్లలకు 5 మాసాల కన్నా ముంందే ఘనాహారం పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల రాత్రివేళ తరుచూ మేల్కోవడం బాగా తగ్గి, హాయిగా నిద్రపోతున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఘనాహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటీ అంటే, కేవలం తల్లిపాలకే పరిమితమైన పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ వాటి ద్వారా లభించడం లేదనీ, ఆ కారణంగా వచ్చే అశక్తత, అసహనం వాళ్లు పూర్తి స్థాయి నిద్ర రాకపోవడానికి కారణమవుతున్నాయని వారు అందులో పేర్కొంటున్నారు. పైగా ఘనాహారం వల్ల కడుపు నిండుగా ఉండడం వల్ల వాళ్లకు కంటి నిండా నిద్ర పడుతోందని కూడా వాళ్లు చెబుతున్నారు. అందువల్ల తల్లిపాలతో పాటు పిల్లలకు కాసింత ఘనాహారం కూడా పెడితే సరి!