నెలలు నిండకుండా పుడితే?

10-09-2018: ఏదైనా తుంటరి పని చేస్తే.... ‘నెల తక్కువ వెధవదీ’! అని ముద్దుగా తిడుతుంటారు పెద్దలు! అయితే నిజంగానే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు మిగతా పిల్లలతో సమం కాలేరా? ప్రి మెచ్యూర్‌ బేబీస్‌ ఎదిగే క్రమంలో సమస్యలు ఎదుర్కొంటారా? వాళ్ల చేత బాలారిష్టాలన్నిటినీ దాటించాలంటే ఏం చేయాలి? నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 
ప్రపంచం మొత్తం మీద మన దేశంలో 23% మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం. మధుమేహం, రక్తపోటు, ఇన్‌ఫెక్షన్లు, కవలలు, ట్రిప్‌లెట్స్‌... ఇలా పలు కారణాల వల్ల గర్భిణులకు నెలలు నిండకుండానే పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. ఈ సమస్యలను సకాలంలో గుర్తించి సరిదిద్దగలిగితే ప్రి మెచ్యూర్‌ బర్త్‌ జరగకుండా నియంత్రించవచ్చు. అయితే అవగాహన లోపం, సరైన వసతులు లేని ఆస్పత్రులను ఆశ్రయించడం... ఇలా పలు కారణాల వల్ల ప్రి మెచ్యూర్‌ పుట్టుకలు జరుగుతూనే ఉన్నాయి.
 
రెండు రకాలు!
నెలలు నిండకుండా అంటే... 23, 24, 25, 27, 34...ఇలా 40 వారాల లోపే పుట్టే పిల్లలందరినీ ప్రి మెచ్యూర్‌ బేబీస్‌గానే పరిగణించాలి. అయితే 37 వారాలకంటే ముందు పుట్టే పిల్లలు ‘ప్రి మెచ్యూర్‌ ’కోవలోకి వస్తే, 28 వారాల లోపే పుట్టే పిల్లలు ‘ఎక్స్‌ట్రీమ్‌ ప్రి మెచ్యూర్‌’ కోవకు చెందుతారు. వీళ్లలో ఇద్దరూ పుడుతూనే ఆరోగ్య సమస్యలు వెంట తెచ్చుకోవడంతోపాటు ఎదిగేక్రమంలో కూడా ఎన్నో రకాల సమస్యలకు లోనవుతారు. మరీ ముఖ్యంగా తల్లి గర్భం నుంచి అత్యంత తక్కువ సమయంలోపే బయటపడే ఎక్స్‌ట్రీమ్‌ ప్రీ మెచ్యూర్‌ పిల్లలకు సమస్యలు ఒకింత ఎక్కువే!
 
ఇబ్బంది ఎక్కడ?
నెలలు నిండే కొద్దీ గర్భంలో బిడ్డ నిండైన రూపం దిద్దుకుంటుంది. అంత సమయం పాటు ఆగకుండా ముందే పుట్టేస్తే, పూర్తిగా తయారవవలసిన అవయవాల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలా పుట్టిన పిల్లలను నెలలు నిండి పుట్టిన పిల్లలతో
సమానంగా ఆరోగ్యకరంగా మార్చడం అనేది వైద్యుల, తల్లితండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ప్రి మెచ్యూర్‌, ఎక్స్‌ట్రీమ్‌ ప్రి మెచ్యూర్‌.... ఈ రెండు కోవలకు చెందిన పిల్లల ఎదుగుదల క్రమాన్ని వాళ్లు పుట్టినప్పటి నుంచి కాకుండా నెలలు పూర్తిగా నిండి పుట్టిన సమయం నుంచి లెక్క వేయవలసి ఉంటుంది. అలాగే ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపరంగా చూస్తే, ఎక్స్‌ట్రీమ్‌తో పోల్చుకుంటే ప్రి మెచ్యూర్‌ పిల్లలు కొంత మేలు!
 
సమస్యలలో కొన్ని....
నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి.
 
నాడీసంబంధమైనవి
ఇంద్రియ సమస్యలు: చూపు, వినికిడి సమస్యలు అత్యంత సహజం. కంటి చూపుకు సంబంధించి... మెల్లకన్ను రావొచ్చు. కంటి చూపు తగ్గొచ్చు. వినికిడి సమస్యలు కూడా ఉంటాయి.
 
ఎదుగుదల: బోర్లా పడడం, తల నిలబెట్టడం, కూర్చోవడం, నిలబడడం, వస్తువులను పట్టుకోవడం.... ఈ అంశాల్లో కొంత ఎదుగుదల తగ్గవచ్చు. మాటలు కూడా ఆలస్యమవవచ్చు.
 
ఎండోక్రైన్‌: గ్రంథుల పనితీరు మెరుగ్గా ఉండకపోవచ్చు. దాని వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చు.
 
హైపర్‌ యాక్టివ్‌: ప్రి మెచ్యూర్‌ పిల్లల్లో ఎ.డి.హెచ్‌.డి సిండ్రోమ్‌ (ఎటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ సిండ్రోమ్‌) తలెత్తవచ్చు.
 
‘ఫాలోఅప్‌’ తప్పనిసరి
ప్రి మెచ్యూర్‌ పిల్లలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయిన తర్వాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తూ ఉండాలి. ‘గండం గడిచి, పిల్లాడి ప్రాణాలు నిలిచాయి... అంతే చాలు!’ అనుకుంటే ప్రమాదమే! ఈ పిల్లలకు వైద్యుల పర్యవేక్షణ ఎంతో అవసరం. వారి ఎదుగుదల, ఇంద్రియాల సామర్థ్యం, నాడీ మండల పనితీరు, స్పందించే గుణం... ఇలా ఎన్నో అంశాల మీద పర్యవేక్షణ అవసరం. కాబట్టి క్రమం తప్పక పరీక్షలు అవసరమవుతాయి.
 
వినికిడి సమస్యలు: పుట్టిన వెంటనే పరీక్ష చేసినా, ప్రతి మూడు నెలలకు వినికిడి పరీక్షలు అవసరమవుతాయి. అంతా మామూలుగా ఉంటే ఏడాది వయసుకు వచ్చిన తర్వాత పరీక్ష చేయించాలి.
 
రెటినోపతీ: ప్రీ మెచ్యూర్‌ పిల్లలు పుట్టిన వెంటనే అందించే ఆక్సిజన్‌ పరిమాణం తక్కువైనా, ఎక్కువైనా, లోపించినా కళ్లు దెబ్బతింటాయి. దానివల్ల పెరిగే క్రమంలో రెటినోపతీ తలెత్తవచ్చు. కాబట్టి బిడ్డ పుట్టిన 21 రోజులకే కళ్లు పరీక్ష చేసినా, అప్పటి నుంచి ప్రతి రెండు వారాలకు ఓసారి పరీక్ష చేయిస్తూ ఉండాలి. అలా పూర్తిగా కన్ను ఎదిగేవరకూ నాలుగు నెలలకోసారి, ఏడాదికోసారి, రెండేళ్లకు, ఐదేళ్లకు, ఆరేళ్లకు... ఇలా క్రమం తప్పక ఫాలో అప్‌ చేస్తూ ఉండాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కన్ను దెబ్బతిని లేజర్‌ సర్జరీ, అరుదుగా సర్జరీ కూడా చేయవలసి రావచ్చు.
 
నాడీ సంబంధమైన ఎదుగుదల: ప్రి మెచ్యూర్‌ బేబీలలో మోటార్‌ (నడక, అవయవాల కదలికలు, సెన్సరీ (స్పర్శ, స్పందించే గుణం) కాగ్నిటివ్‌ (తెలివితేటలు)... ఈ అంశాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలన్నీ మెదడులో ఇన్‌ఫెక్షన్‌ లేదా రక్తస్రావం అయితే డెవల్‌పమెంట్‌ సమస్యలు తలెత్తుతాయి. రక్త పరీక్ష కోసం పసికందులకు పదే పదే సూది గుచ్చడం వల్ల కూడా మెదడు మీద ప్రభావం పడి రక్తస్రావం జరగవచ్చు. గర్భిణికి మధుమేహం అదుపు తప్పినా, పోషకాలు తగ్గినా, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తగుమాత్రంగా ఉండకపోవచ్చు. ఈ కారణాల వల్ల మెదడు ఎదుగుదల కుంటుపడి, తెలివితేటల మీద ప్రభావం పడవచ్చు. ఈ నష్టం జరిగిపోయిన తర్వాత సరిదిద్దే చికిత్సలు లేవు, కాబట్టి ఇలా జరగకుండా నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం!
 
న్యూరోడెవల్‌పమెంట్‌ అసిస్టెడ్‌ పీడియాట్రీషియన్‌ అనే ప్రత్యేక వైద్యులు మాత్రమే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లోపాలను కరెక్టుగా గుర్తించగలుగుతారు. కాబట్టి ప్రీ మెచ్యూర్‌ బేబీ్‌సను వైద్యుల సూచన మేరకు ఈ పిల్లల వైద్యుల చేత క్రమం తప్పక పరీక్షలు చేయుస్తూ ఉండాలి. ఇలా చేయగలిగితే లోపాలను సాధ్యమైనంత ప్రారంభంలోనే గుర్తించి అవసరమైన చికిత్సలతో సరిదిద్దుకోవచ్చు.
 
మేలు చేసే స్టెరాయిడ్లు
నెలలు నిండకుండా బిడ్డ పుట్టే అవకాశం ఉన్నప్పుడు ప్రసవానికి ముందు గర్భిణికి స్టెరాయిడ్లు ఇవ్వడం ద్వారా బిడ్డ మెదడు ఎదుగుదల లోపాలను నియంత్రించే వీలుంటుంది. అంతేకాకుండా స్టెరాయిడ్ల ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ
సమస్యలు తలెత్తకుండా కూడా నివారించవచ్చు.
 
కంగారూ మదర్‌ కేర్‌
బిడ్డ వెంటిలేటర్‌ నుంచి బయటకొచ్చి తనంతట తాను శ్వాస తీసుకోగలిగే పరిస్థితికి వస్తే, ‘కంగారూ మదర్‌ కేర్‌’ మొదలు పెట్టవచ్చు. కంగారూ జంతువు ఎలాగైతే తన ఒంటికి హత్తుకుని బిడ్డను సంరక్షించుకుంటుందో, అదే పద్ధతిలో తల్లి తన ఛాతీకి బిడ్డను హత్తుకుని కాపాడుకుంటుంది. ఇలా చేయడం వల్ల తల్లి గుండె చప్పుడు వినబడే వీలు, తల్లి స్పర్శను అనుభవించే వీలు బిడ్డకు కలుగుతాయి. ఫలితంగా, తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడి, బిడ్డ
మరింత త్వరగా కోలుకునే వీలు కలుగుతుంది. కంగారూ మదర్‌ కేర్‌ ఉద్దేశం అదే!
 
ముందే జాగ్రత్త పడాలి!
నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉన్న గర్భిణులు ఎంతో ముందుగానే సకల సదుపాయాలూ ఉన్న ఆస్పత్రికి చేరుకోవాలి. ఆ ఆస్పత్రిలో ప్రసవం జరిగిన వెంటనే పిల్లలకు అందించవలసిన వైద్య సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నెలలు నిండకుండా పుట్టే పిల్లల షుగర్‌ లెవెల్స్‌, శరీర ఉష్ణోగ్రతలను క్రమంలో పెట్టాలి. లేదంటే, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు నాలుగు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచి, వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం అందించగలగాలి. కొందరు పిల్లలకు మెదడులో రక్తస్రావమై బ్రెయిన్‌ హెమరేజ్‌కు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది.
 
డాక్టర్‌ ఎ. వెంకట లక్ష్మి, నియో నాటాలజిస్ట్‌ అండ్‌
పిడియాట్రీషియన్‌, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ బర్త్‌రైట్‌ సెంటర్‌,
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌