ప్రాక్టికల్‌గా చెప్పండి

ఆంధ్రజ్యోతి(6-11-15): పిల్లలకు ప్రతీది వింతే. మరీ చిట్టిబుర్రల సంగతి అటుంచితే కాస్త పెద్దపిల్లల్లోనూ రోజూ రకరకాల సందేహాలు ఉదయిస్తూ ఉంటాయి. ఏటీఎంలో డబ్బులు ఎలా వస్తాయి?, ప్యాకెట్లలోకి పాలు ఎక్కడి నుంచి వస్తాయి?, బియ్యం ఎలా  పండుతాయి? వంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రులను అడుగుతూనే ఉంటారు. వీటిని  తేలిగ్గా తీసిపారేయకుండా ఓపిగ్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ప్రశ్నించేతత్వం పిల్లల ఎదుగుదలకు నిదర్శనం. వారి అనుమానాలను ప్రాక్టికల్‌గా నివృత్తి చేయగలిగితే మరీ మంచిది. పిల్లలను వారాంతాల్లో పార్క్‌కో, సినిమాకో తీసుకెళ్తూనే ఉంటారు. అదే సమయంలో నెలకోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లండి. ఒకసారి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లండి. అక్కడ ఎలా ఉంటుందో చూపించండి. పోలీస్‌ విధులు ఏమిటో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మరోసారి ఓ బ్యాంక్‌కు తీసుకెళ్లండి. డబ్బులు ఎలా డిపాజిట్‌ చే స్తారు, ఎలా విత్‌డ్రా చేస్తారో చూపించండి. ఇలాంటి వినూత్న మార్గాలను ఎంచుకుంటే పిల్లలకు సామాజిక, ఆర్థిక విజ్ఞానం కలుగుతుంది.పండుగలకో పబ్బాలకో మీ స్వగ్రామానికో, దగ్గర్లోని పల్లెటూరుకో పిల్లలతో సహా వెళ్లండి. అక్కడ చెరువులకు, పొలాలకు దగ్గరుండి తీసుకెళ్లండి. మీకూ ఆటవిడుపుగా ఉంటుంది. చిన్నారులకూ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.
స్కూల్‌ తరఫున వెళ్లే విజ్ఞాన, విహార యాత్రలకు పిల్లలను తప్పకుండా పంపండి. ఇలాంటి సందర్భాలలో నేర్చుకునే విషయాలు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.