పిల్లలు హల్‌ సెల్‌ చేస్తున్నారా..!

ఆంధ్రజ్యోతి(6-6-15): నడక, మాటలు కూడా సరిగా రాని చిన్నారులు సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, పిసిలతో ఆడుతున్నారు. వాటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఈ  పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని శాన్‌ డియాగోలో జరిగిన ‘పీడియాట్రిక్‌ అకడమిక్‌ సొసైటీస్‌’ వారి సమావేశంలో పిల్లలు ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌కు అలవాటుపడ్డ వైనంపై ఒక స్టడీని వారు సమర్పించారు. ఈ స్టడీలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సెల్‌ఫోన్లకు పిల్లలు అలవాటుపడుతున్న తీరు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఈ స్టడీ పేర్కొంది. ఆరు నెలల వయసు నుంచే సెల్‌ఫోన్ల పట్ల పిల్లలు ఆసక్తి చూపడంపై తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ స్టడీ కింద మొత్తం 370 మంది బేబీలను సర్వే చేశారు. వీరంతా ఆరు నెలల నుంచి నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు. వీళ్లకు మాటలు రాకముందే, నడవడానికి అడుగులు కూడా పడకముందే సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లతో ఆడుకుంటున్నారు. వాటి ీస్క్రన్స్‌ని దగ్గరి నుంచి చూస్తూ ఆనందిస్తున్నారు. వాటి బటన్స్‌ నొక్కి ఉపయోగిస్తున్నారు. ఈ పిల్లల్లో 14 శాతం మంది ఏడాది వయసు వచ్చేసరికే రోజూ కనీసం గంట సేపు సెల్‌ఫోన్‌, ట్యాబ్లెట్లతో ఆడుతున్నారు. 

 

రెండేళ్లు వచ్చేసరికే చాలామంది చిన్నారులకు సెల్‌ఫోన్‌, ట్యాబ్లెట్లను ఎలా వాడాలో తెలిసిపోతోంది. వాటిని  విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే 73 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల చేతల్లో ఈ గాడ్జెట్స్‌ను పెట్టి ఇంటిపనులు చూసుకుంటున్నారు. 65 శాతం మంది అయితే తమ పిల్లలు ఏడవకుండా, అల్లరి చేయకుండా ఉండేందుకు వారి చేతుల్లో సెల్‌ఫోన్లు పెడుతున్నామని చెప్పారు. 29 శాతం మంది తమ పిల్లలను నిద్రపుచ్చడానికి ఈ గాడ్జెట్స్‌ను వాడుతున్నట్టు చెప్పారు. ఈ స్టడీ అధ్యయనకారుల్లో ఒకరైన, ఫిలడెల్ఫియాలోని ‘ఐనిస్టియన్‌ హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌’కు చెందిన హిల్డా కబాలి మాట్లాడుతూ ‘ఆరు నెలల ప్రాయం నుంచే పిల్లలు సెల్‌ఫోన్లను పట్టుకుని ఆడుకోవడం, వాటిని దగ్గర నుంచి చూడడం, ఉపయోగించడం చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం’ అన్నారు. ఇండియాలో కూడా పసిపిల్లలు పిసిలు, ట్యాబ్లెట్లు, సెల్‌ఫోన్లు వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పిల్లలు గంటల తరబడి సెల్‌ఫోన్లు పట్టుకుని ఆడుకోవడం చూసిన ఇక్కడి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు వీటికి అలవాటుపడ్డం వల్ల ప్రవర్తనాపరమైన సమస్యలతోపాటు రకరకాల అనారోగ్య సమస్యలు వారికి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పిల్లలకు వెన్నెముక, మెడ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందొస్తుగానే వారి సమస్యను గుర్తించి తగిన వైద్యం అందించకపోతే పోశ్చరల్‌ సమస్యలు వారిలో తలెత్తే అవకాశం ఉందిట. అతిగా ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్లు ఉపయోగించడం వల్ల పిల్లలు కూడా ఎలాంటి భావావేశాలు లేని మనుషుల్లా.. అంటే యంత్రాల్లా తయారవుతారని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను టివితో సహా సెల్‌ఫోన్లకు, పిసిలకు, ట్యాబ్లెట్లకు ఎంత దూరంగా ఉంచితే అంతమంచిదంటున్నారు.  అంతేకాదు ఈ సమస్యకు పరిష్కారం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని అధ్యయనకారులు అంటున్నారు. గాడ్జెట్స్‌తో కాకుండా ఇతరత్రా ఆసక్తికరమైన అంశాల్లో, ఆటపాటల్లో, సృజనాత్మక కార్యకలాపాల్లో పిల్లలు పాల్గొనేట్టు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.