పిల్లలూ ఎక్కువసేపు కూర్చోవద్దు

ఆంధ్రజ్యోతి(24-10-15): పిల్లలు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చిన్నారుల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయని అధ్యయనకారులు చెప్తున్నారు. ధమనుల పనితీరులో  మార్పులు తలెత్తుతాయట. వీటివల్ల పిల్లలకు భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందట. అలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. ఊబకాయం, గుండెజబ్బులు, కాలేయం జబ్బులు, జీవక్రియ దెబ్బతినడం వంటి అనారోగ్య సమస్యలు పిల్లల్లో తలెత్తుతాయి. అంతేకాదు కొన్ని సమయాల్లో వారి ప్రాణాలకు సైతం ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందట. ముఖ్యంగా వ్యాయామాలను పిల్లలు అస్సలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఒక పెద్ద స్టడీలో ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు రోజుకు 8.5 గంటలు కూర్చుంటున్నారని వెల్లడైంది. మరో స్టడీలో ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత పిల్లల్లో యాక్టివిటీ  ప్రమాణాలు బాగా పడిపోయాయని తేలింది. అదే రకమైన  జీవనశైలితో యుక్తవయసులోకి కూడా  పిల్లలు ప్రవేశిస్తున్నారు. అమ్మాయిల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటోందని కూడా స్టడీలో తేలింది. 

శాస్త్రవేత్తలు తొమ్మిదేళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న అమ్మాయిల మీద తమ స్టడీని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా తొమ్మిది మంది అమ్మాయిలను స్టడీ చేశారు. వీరిలో ఇద్దరమ్మాయిలు భారీకాయులు, మిగతా అమ్మాయిలంతా సాధారణ శారీరక బరువుతో ఉన్నారు. ఈ తొమ్మిదిమంది అమ్మాయిల్లో ధమనుల పనితీరును అలా్ట్రసౌండ్‌, బ్లడ్‌ ప్రషర్‌ కఫ్‌  ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరిలో సగంమంది అమ్మాయిలు లేబొరెటరీలో ఐపాడ్‌తో ఆడుతూ, సినిమా చూస్తూ కదలకుండా మూడుగంటలు అలాగే కూర్చున్నారు. వీరిలో ఎవరైనా బాత్‌రూమ్‌కు వెళ్లాల్సివస్తే అధ్యయనకారులు వారిని వీల్‌ఛైయిర్‌లో తీసుకెళ్లారు. వీరుకాకుండా మిగతా సగంమంది అమ్మాయిలు కూడా కదలకుండా కూర్చున్నా ప్రతి గంటకు ఎందుకో అందుకు  లేస్తూనే ఉన్నారు. సైక్లింగ్‌ కాసేపు చేయడం, అటుఇటు తిరగడం వంటివి చేశారు. తర్వాత వీరందరి ధమనుల పనితీరును అధ్యయనకారులు తిరిగి పరిశీలించారు. కొన్ని రోజులైన తర్వాత మళ్లా ఇలాగే అమ్మాయిలచేత చేయించారు. మూడుగంటలు కదలకుండా కూర్చున్న అమ్మాయిల్లో ధమనుల పనితీరు ముందున్నట్టు లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. వారి వాస్క్యులర్‌ ఫంక్షన్‌ బాగా పడిపోయింది. ఒక శాతం వాస్క్యులర్‌ ఫంక్షన్‌ తగ్గితే 13 శాతం వరకూ కార్డియోవాస్క్యులర్‌ జబ్బుల రిస్కు పెరుగుతోంది. అలా గంటల తరబడి కూర్చోకుండా సైక్లింగ్‌ చేసిన, అటుఇటు తిరిగిన అమ్మాయిల్లో  పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది.  చిన్న పిల్లల ధమనులు సరిగా పనిచేయడానికి తీవ్రంగా వ్యాయామాలు చేయనవసరం లేదు కాని కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి అటు ఇటు వాళ్లు తిరిగితే మంచిదని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలామంది పిల్లల్లో పెరిగే కొద్దీ ఫిజికల్‌ యాక్టివిటీ పట్ల ఆసక్తి లేక  ఎక్కువ సేపు  కదలకుండా కూర్చుంటున్నారు. అందులోనూ ఆడపిల్లలు ఎంతసేపు కూర్చోవడానికైనా విముఖత చూపకపోవడం అధ్యయనకారులను ఆశ్చర్యపరిచింది. ఏమైనా గంటల తరబడి పిల్లలు అలా కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీ, ఆటలు, వ్యాయామాల పట్ల ఆసక్తిని పెంచాలని అధ్యయనకారులు అంటున్నారు.