పిల్లల్లో వచ్చే ఆస్తమాకు ఆదిలోనే అడ్డుకట్ట

ఆంధ్రజ్యోతి(03-03-13): పిల్లలు ఆస్తమా బారినపడితే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఎదుగుదల లోపిస్తుంది. చురుకుదనం తగ్గిపోతుంది. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ఇప్పించడంతో పాటు ఆస్తమాకు కారణమవుతున్న వాటికి దూరంగా ఉంచడం ద్వారా ఆస్తమాకు ఆదిలోనే అడ్డుకట్ట          వేయవచ్చని అంటున్నారు పీడియాట్రిషియన్‌ డా. టి.పి.కార్తీక్‌.
 ఊపిరితిత్తుల్లోకి వివిధ రకాల అలర్జిన్‌లు, దుమ్ము, ధూళి ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా జబ్బులు వస్తుంటాయి. పిల్లల్లో ఈ సమస్య తలెత్తినపుడు ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది. దగ్గు, ఛాతీ బరువుగా అనిపించడం, పిల్లికూతలు, తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతుంది. ముందుగా ఈ లక్షణాలతో ప్రారంభమై తీవ్రత పెరిగిన కొద్దీ ఆయాసం రావడం మొదలవుతుంది. అలర్జీలో అలర్జిక్‌ ఆస్తమా, నాన్‌ అలర్జిక్‌ ఆస్తమా, ఎర్లీ ఆన్‌సైట్‌ ఆస్తమా అని రకాలుంటాయి. ఒక ఏడాది లోపు పిల్లల్లో కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎర్లీ ఆన్‌సైట్‌ ఆస్తమా అంటారు. 
కారణాలు 
ఇంటిలోపల దుమ్ము, అగర్‌బత్తీలు, పర్‌ఫ్యూమ్‌లు, కిరోసిన్‌ స్టవ్‌ వాడటం, పెంపుడు జంతువులు, దుప్పట్లు శుభ్రంగా లేకపోవడం వంటివి ఆస్తమాకు కారణమవుతుంటాయి. డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే పొగలో నైట్రోజన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులు ఉంటాయి. వీటివల్ల బ్రాంకైటిస్‌, ఆస్తమా సమస్య మొదలవుతుంది. అప్పటికే ఆస్తమా ఉన్నట్లయితే ఈ కాలుష్యం వల్ల తీవ్రత పెరుగుతుంది. సాధారణంగా చలికాలంలో ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో వేసవిలో కూడా ఆస్తమా కనిపిస్తోంది. కారణం గాలి కాలుష్యం. 
నిర్ధారణ
లక్షణాల ఆధారంగా వైద్యులు వ్యాధి నిర్ధారణ చేస్తారు. అవసరమైతే ఈఎస్‌ఆర్‌, సీబీపీ, ఎక్స్‌రే, కొన్ని రకాల అలర్జీ పరీక్షలు చేయిస్తే సరిపోతుంది. 

చికిత్స

  చికిత్స అందించేముందు ఆస్తమా తీవ్రతను గుర్తించాలి. మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ అని మూడు భాగాలుగా విభజించి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మైల్డ్‌ ఆస్తమా ఉన్న వారికి ఆయాసం తగ్గేందుకు 5 నుంచి 6 రోజుల పాటు మందులు ఇవ్వాలి. మోడరేట్‌ ఆస్తమా ఉన్నట్లయితే ఇన్‌హేలర్స్‌ సూచించాలి. ఇన్‌హేలర్స్‌ను క్రమంతప్పకుండా ఆరునెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ అలర్జిక్‌ మందు ఉంటుంది. దీంతోపాటు ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సివియర్‌ ఆస్తమా ఉన్నట్లయితే ఆరు నెలల పాటు మందులు ఇచ్చి వ్యాధి మళ్లీ అటాక్‌ చేస్తోందా అనే విషయాన్ని పరిశీలించాలి. ఇన్‌హేలర్స్‌లో వ్యాధిని తగ్గించేవి, వ్యాధి రాకుండా కాపాడేవి ఉంటాయి. కడుపులోకి తీసుకునే మాత్రల కన్నా ఇన్‌హేలర్స్‌ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఏమైనా పిల్లల్లో ఆస్తమా ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స ఇప్పించాలి. నెబ్యులైజర్‌ పెట్టించడం, ఆవిరి పట్టించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఒకసారి ఆస్తమా వస్తే జరిగిన నష్టాన్ని పూరించడానికి ఆరువారాల సమయం పడుతుంది. కాబట్టి రాకుండా చూసుకోవడం ఉత్తమం. 

నివారణ
పిల్లలకు చల్లగాలి నుంచి రక్షణ కల్పించాలి. పిల్లలను టూ వీలర్‌పై బయటకు తీసుకెళ్లకుండా ఉండాలి. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే స్కార్ప్‌, మాస్క్‌ లేదా మంకీ క్యాప్‌ పెట్టాలి. పిల్లలు ఉన్నప్పుడు పుస్తకాలు, పాతపేపర్లు సర్దడం చేయకూడదు. ఇల్లు ఊడవడం కాకుండా తడిగుడ్డతో శుభ్రం చేయాలి. ఇంట్లో డస్ట్‌మైట్స్‌, బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. ఇంట్లో సిగరెట్‌ తాగకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లలు ఆస్తమా బారినపడకుండా కాపాడుకోవచ్చు.