పిల్లల్లో నిద్రలేమితో ఊబకాయం

ఆంధ్రజ్యోతి(17-10-2016): పిల్లలు సరిగా నిద్రపోకపోతే అతిగా తింటారట. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అలా నియంత్రణ లేకుండా తినడం వల్ల పిల్లల్లో కాలరీలు పెరుగుతున్నాయి. ఊబకాయులవుతున్నారు. ముఖ్యంగా ప్రి-స్కూలర్స్‌లో ఈ ట్రెండు ఎక్కువగా కనిపిస్తోంది. నిద్ర సరిగా పోకపోవడం వల్ల చిన్నతనంలో లావుగా ఉండడమే కాదు, పెద్దయిన తర్వాత కూడా వీళ్లు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని కొలరాడో బోల్డర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ స్టడీని చేశారు. వీరు చేసిన ఈ అధ్యయనంలోనే నిద్ర సరిగా పోని ప్రిస్కూలర్స్‌ అతిగా తింటున్నారని తేలింది. ఈ స్టడీలో పిల్లలు రోజుకు మూడు గంటల నిద్రను కోల్పోతున్నారని వెల్లడైంది. ఈ పిల్లలు మధ్యాహ్నం పూట నిద్రపోవడం లేదు. రాత్రి రెండు గంటలు ఆలస్యంగా నిద్రపోతున్నారు. అదే సమయంలో ఉదయం ఎప్పటిలాగే తొందరగా లేస్తున్నారు. దీంతో నిద్రలేమితో బాధపడుతున్న మూడు నాలుగేళ్ల వయసు పిల్లలు మామూలప్పుడు తీసుకునేదాని కన్నా 20 శాతం ఎక్కువ కాలరీలను ఉదయం తింటున్నారట. అలాగే సుగర్‌ 25 శాతం, పిండిపదార్థాలు 26 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. స్టడీలో భాగంగా ఈ పిల్లల్నే రోజంతా ఎన్ని గంటలసేపైనా నిద్రపొమ్మన్నారు. ఆ తర్వాత వారిని పరీక్షించారు. వాళ్లల్లో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ పరిమాణాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయినా కూడా పిల్లల్లో ఫ్యాట్‌, కాలరీలు సాధారణ స్థాయిల్లో లేవు. ఎప్పుడూ ఉండేదానికన్నా కాలరీలు 14 శాతం ఎక్కువగా, ఫ్యాట్‌ 23 శాతం అధికంగా ఉన్నాయి. అందుకే పిల్లల నిద్ర అలవాట్లను గమనించుకుని వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవడం మంచిది.