ఆంధ్రజ్యోతి(01-02-13): కేరింతలతో, చిన్న చిన్న మాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన పిల్లలు ఒంటరిగా కూర్చుండిపోతుంటే తల్లిదండ్రుల్లో కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఆరోగ్యంగా జన్మించాడనుకున్న శిశువు మెదడు ఎదుగుదలలో లోపం ఉందని తెలిస్తే వారి బాధ చెప్పనలవి కాదు. చిన్న పిల్లల్లో కనిపించే ఈ సమస్యను ‘ఆటిజమ్’గా పిలుస్తుంటారు. పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్స అందిస్తే ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలా చేయవచ్చని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
చిన్న పిల్లల్లో కనిపించే ‘ఆటిజమ్’కు చికిత్స లేదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఎలాంటి అంగవైకల్యం లేకుండా జన్మించినపుడే తల్లిదండ్రులకు ఆనందం. ఒకవేళ రుగ్మతలతో జన్మిస్తే ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణనాతీతం. ఆటిజమ్ అనేది పిల్లల్లో మానసిక ఎదుగుదలలో వచ్చే సమస్య. పిల్లలు చిన్న చిన్న మాటలతో, కేరింతలతో ఆడుతూ ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. అలాంటి పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతుంటే, నడక ఆలస్యమైతే తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఆటిజమ్ ఉన్న పిల్లలు మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూడకపోవడం, సామాజికసంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఏర్పరచుకోలేకపోవడం, భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం, అసాధారణమైన చేష్టలు, ప్రవర్తనను కలిగి ఉంటారు. వినికిడి సమస్యతో బాధపడే పిల్లలకు కూడా మాటలు సరిగ్గా రావు. అందువల్ల ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో చూసుకుని నిపుణులైన వైద్యుల దగ్గర చికిత్స చేయించుకోవాలి.
గుర్తించటమెలా?
ఆటిజమ్ అనేది స్పెక్ట్రమ్ డిజార్డర్ . ఇందులో చాలా రకాలుంటాయి. లక్షణాల తీవ్రతను బట్టి ఆటిజమ్‌ను గుర్తించడం జరుగుతుంది. తెలివితేటలు సాధారణంగా ఉండి భావవ్యక్తీకరణ, భావాన్ని అర్థం చేసుకోలేకపోవడం, నలుగురిలో కలవలేకుండా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు తీవ్రంగా లేకుంటే యాస్పర్జర్ సిండ్రోమ్ అంటారు. ఇది మైల్డ్వెరైటీ కిందకు వస్తుంది. పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం, ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకోలేకపోవడం, నలుగురిలో కలవకపోవడం, ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం, అడిగిన ప్రశ్నను పదేపదే తిరిగి ఉచ్చరించడం చేస్తూ ఉంటారు. దీన్ని ఇకోలేలియా అంటారు. ఏదైనా అవసరం ఉంటే వ్యాఖ్యలనుకాకుండా చిన్నచిన్న పదాలతో చెప్పడం చేస్తుంటారు. ఈ పిల్లలు కొత్తదనానికి తొందరగా అలవాటుపడలేరు. ఏదైనారొటీన్గా ఉండటమే ఇష్టపడతారు. ఒకేరకమైన ఆహారాన్ని కోరుకోవడం, ఆట వస్తువులను కోరుకోవడం, ఒకే రంగు దుస్తులను వేసుకోవడం, టీవీలో ఒకేరకమైన కార్యక్రమాలను చూడటం చేస్తుంటారు. తోటి పిల్లలు ఆడే ఆటలపై ఇష్టం చూపించరు. బాంధవ్యాలు సరిగ్గా ఏర్పరచుకోలేరు. బాగా అలవాటుపడిన వ్యక్తులతోనే ఉంటారు. కొత్త వ్యక్తులొస్తే ఇష్టపడరు. మానసిక పరిపక్వత సరిగ్గా లేకపోవడం వల్ల చేతులు, కాళ్ళు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం చేస్తుంటారు. శరీరంలో అకస్మాత్తుగా కదలికలు వస్తుంటాయి. వీటిని స్టీరియో టైప్ మూవ్మెంట్స్ అంటారు. ఇలాంటి లక్షణాలతో ఆటిజమ్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఆటిజమ్ అనేది మెదడు ఎదుగుదలలో లోపం వల్ల వచ్చే సమస్య. దీని లక్షణాలను మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు గుర్తించలేకపోవచ్చు.
కారణాలెన్నో...
ఆటిజమ్ జన్యు సంబంధమైన వ్యాధి. వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారిలో క్రోమోజోమ్ 13లో ఉండే మార్పు ఒకరకంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో తల్లికి రుబెల్లా, సైటో మెగాలోవైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినా మద్యపానం, దూమపానం చేసినా, దీర్ఘకాలిక సమస్యలు అంటే డయాబెటిస్, థైరాయిడ్, సమస్యలతో బాధపడుతూ సరియైన చికిత్స తీసుకోకున్నా ఆటిజమ్ వచ్చే అవకాశం ఉంది. పోషకపదార్థాలు లోపించినా, జంక్‌ఫుడ్, ప్రిసర్వేటివ్ ఫుడ్, ఫుడ్ కలర్ ఉపయోగించిన పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంది. సరిగ్గా భద్రపరచని వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు వాడే మందుల వల్ల కూడా ఆటిజమ్ వస్తుంది. ఆటిజమ్ ఒకే వ్యాధిగా కాకుండా ఇతర మానసిక సమస్యలతో మిళితమై ఉంటుంది. మెంటల్లీ రిటార్టెడ్, ఏడిహెచ్‌డి, రైట్ సిండ్రోమ్, ఫిట్స్ వంటి వ్యాధులతో కూడా వస్తుంది. ఆటిజమ్ లక్షణాలు కనిపించినపుడు నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవాలి.
హోమియో చికిత్స
రోగి యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలు, వ్యాధి లక్షణాలు, మూలకారణాలను ఆధారంగా చేసుకుని హోమియో చికిత్సను అందించడం జరుగుతుంది. హోమియో మందులు జన్యువులపై ప్రభావం చూపిస్తాయి. రోగి వ్యాధి నిరోధక వ్యవస్థను బలపరచడంలో హోమియో మందులు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రత, కాలంను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు జీవితం ఆనందంగా గడపటానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఆహార నియమాలను పాటిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించవచ్చు.
డాక్టర్ రవికిరణ్
(ఎం.డి.,హోమియో,ఎం.ఎస్సి.సైకాలజీ)
డైరెక్టర్ అండ్ సీనియర్ ఫిజీషియన్
మాస్టర్స్ హోమియోపతి
హైదరాబాద్, విజయవాడ
ఫోన్ : 7842 106 106
9032 106 106