అమ్మ పంచే అమృతం!

ఆగస్టు 1 నుంచి 7 దాకా తల్లిపాల వారోత్సవం
 
29-07-2019:చేప పిల్లకు ఈత నేర్పాలా? రెక్కలొచ్చిన పక్షికి ఎగరడం నేర్పాలా? అలాంటప్పుడు తల్లికి తన బిడ్డకు పాలెలా ఇవ్వాలో ఎందుకు నేర్పడం? ఇలాంటి అనుమానాలు తలెత్తడం సహజమే! అయితే బిడ్డకు పాలు పట్టించడంలో... బిడ్డ చేత పాలు తాగేలా చేయించడంలో... చనుబాలివ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయంలో.... అవగాహన ఏర్పరుచుకుంటే, తల్లీ, బిడ్డా ఇరువురి భవిష్యత్తు ఆరోగ్యకరంగా సాగుతుంది!
 
రొమ్మును బిడ్డ నోటికి అందించడంతోనే తల్లి బాధ్యత తీరిపోదు. బిడ్డ పాలు నోట్లోకి పీల్చగలుగుతోందా? సౌకర్యవంతంగా పాలు తాగగలుగుతోందా? బిడ్డకు పాలిచ్చే క్రమంలో తనకు అసౌకర్యం కలుగుతోందా? మొదలైన విషయాలు ప్రతి తల్లీ గమనించుకోవాలి. ఇద్దరికీ అనువైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో పాలిచ్చే క్రమాన్ని అనుసరించాలి.
 
ఇరువురి ఆరోగ్యానికీ...
తల్లి బిడ్డకు పాలివ్వడం ద్వారా బిడ్డ ఆకలి తీరుతుంది కాబట్టి, బిడ్డకు మాత్రమే ఉపయోగకరం అనుకుంటే పొరపాటు. పాలివ్వడం తల్లికీ ఉపయోగమే! అదెలాగంటే....
 
తల్లికి రక్ష!
పాలు తయారైనంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల, తల్లులకు భవిష్యత్తులో రొమ్ము, ఒవేరియన్‌ కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
బిడ్డకు పాలిచ్చిన ప్రతిసారీ తల్లి పిట్యూటరీ గ్రంథి నుంచి ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ గర్భధారణతో సంకోచించిన గర్భాశయాన్ని కుంచించుకుపోయేలా చేసి, తిరిగి పూర్వ పరిమాణానికి తీసుకొస్తుంది. ఫలితంగా ప్రసవం తదనంతర రక్తస్రావ తీవ్రత తగ్గుతుంది. దాంతో రక్తనష్టం తగ్గుతుంది. ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ రొమ్ముల్లో పాల తయారయ్యేందుకూ ఉపయోగపడుతుంది.
బిడ్డకు క్రమం తప్పకుండా పాలిచ్చినంతకాలం కొన్ని నెలలపాటు తల్లుల్లో ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ తయారవుతూ ఉంటుంది. ఇది తల్లిలో అండాలు విడుదలయ్యే క్రమాన్ని విరామ దశలో ఉంచుతుంది. తద్వారా అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
తల్లీబిడ్డా అనుబంధం: బిడ్డకు చనుపాలు ఇవ్వడం ద్వారా తల్లికీ, బిడ్డకూ మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది.
బిడ్డకు పాలివ్వడం ద్వారా ఒక్క రోజులో తల్లి 800 నుంచి 1000 కేలరీలను బిడ్డకు అందిస్తుంది. దాంతో గర్భధారణతో పెరిగిన శరీర బరువు పాలివ్వడం ద్వారా క్రమేపీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

బిడ్డకు రక్ష!

పిల్లల్లో పసివయసులోనే మొదలయ్యే ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పెదవులు, దవడలు ఉపయోగించి రొమ్ము పాలు లాగడం ద్వారా కండరాలకు వ్యాయామం అంది, పిల్లల్లో చెవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
తల్లి పాలు తాగి పెరిగిన పిల్లలు స్థూలకాయులయ్యే అవకాశాలు ఉండవు.
తల్లిపాలకు బదులు కృత్రిమ పాలు తాగి పెరిగిన పిల్లలు బాల్యంలోనే స్థూలకాయులవుతారు. అంతేకాకుండా పెరిగి పెద్దయ్యాక కూడా స్థూలకాయంతోనే బాధపడుతూ, సంబంధిత మధుమేహం, అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటారు.
నిద్రలోనే పసికందులు ప్రాణాలు కోల్పోయే ‘సడెన్‌ ఇన్‌ఫ్యాంట్‌ డెత్‌’ తల్లిపాలు తాగే పిల్లల్లో జరగదు.

తల్లుల ఆహారం!

బిడ్డకు పాలిచ్చే తల్లులు పోషకాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నా పాలతో బిడ్డ కడుపు నింపాలి అనే దృఢ సంకల్పం తల్లికి ఉండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పళ్లరసాలు తాగాలి. పాలు పట్టించడానికి కనీసం అరగంట ముందు పళ్లరసం తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. పాల ద్వారా తల్లి నుంచి బిడ్డకు క్యాల్షియం వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి తల్లి క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
 
తల్లి పాలు ఏ వయసు వరకూ?
బిడ్డ ఆరు నెలల వయసుకు చేరుకునే వరకూ బిడ్డకు తల్లిపాలు తప్ప, మరే ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఆరు నెలల తర్వాత ఘనాహారం మొదలుపెట్టినా తల్లి పాలు ఇవ్వడం ఆపకూడదు. అలా రెండేళ్ల వరకూ బిడ్డకు తల్లి పాలు ఇవ్వవచ్చు.
 
రొమ్ముల్లో పాలగడ్డలు!
పాలు రొమ్ముల్లో నిల్వ ఉండిపోతే గడ్డలు కడతాయి. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. దూది మీద వేసిన కొన్ని మందులను పీల్చడం ద్వారా రొమ్ముల్లో గడ్డకట్టిన పాలు కరిగి కారిపోతాయి. ఈ మందు వల్ల, పాల గ్రంథుల చుట్టూ ఉండే మయో ఎపిథీలియల్‌ సెల్స్‌ కుంచించుకుపోయి, చిన్న ఒత్తిడితో పాలు కరిగి కారిపోతాయి. అరుదుగా పాల గడ్డల వల్ల రొమ్ముల్లో ఇన్‌ఫెక్షన్‌ కూడా తలెత్తుతుంది. ఇలాంటప్పుడు మందులతో అదుపు చేయవచ్చు.
 
తల్లులు ఉద్యోగినులైతే?
ఉద్యోగినులైన తల్లులు పాలను సేకరించి, నిల్వ చేసి పిల్లలకు పట్టించవచ్చు. ఇందుకోసం సక్షన్‌ పంప్‌ సహాయంతో పాలు సేకరించి, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసిన పాలను ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి, గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత స్పూను లేదా ఉగ్గు గిన్నెతో పాలు పట్టించాలి.
 
మీకు తెలుసా
అపోహ: తొలిపాలు (ముర్రుపాలు) పిల్లలకు వాతం చేస్తాయి, కాబట్టి, వాటిని పిండి పారేయాలి!
వాస్తవం: ఇది అపోహ. ప్రసవం తర్వాత కొన్ని రోజులపాటు వచ్చే ముర్రుపాలలో ‘ఇమ్యునోగ్లాబ్యులిన్స్‌’ ఉంటాయి. వీటిలో ఇమ్యునోగ్లాబ్యులిన్‌ ఎ అనే పోషకం వల్ల బిడ్డకు పేగుల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దొరుకుతుంది. విరేచనాలు బిడ్డను వేధించవు. అలాగే ఎలర్జీలు కూడా బిడ్డ దరి చేరవు.
 
అపోహ: తల్లికి పాలు తయారవడం లేదు!
వాస్తవం: బిడ్డ ఎన్ని పాలు తాగుతుందో, ఆ పాలతో బిడ్డ పొట్ట నిండిందో, లేదో చూసి కనిపెట్టలేనప్పుడు, బిడ్డకు పాలు సరిపోవట్లేదని అనుకోవడం ఎంతవరకూ సమంజసం? కవల పిల్లలకు కడుపు నిండా సరిపోయేన్ని పాలు ఒకే తల్లి అందించగలిగినప్పుడు, ఒక బిడ్డను కన్న తల్లుల పాలు ఒకే బిడ్డకు ఎందుకు సరిపోవు? డిమాండ్‌ ఉన్న చోట సప్లై ఉన్న చందంగా, బిడ్డ రొమ్ము పీల్చుకున్న ప్రతిసారీ పాలు తయారవుతూనే ఉంటాయి.
 
అపోహ: బిడ్డ సరిపడా పాలు తాగడం లేదు!
వాస్తవం: పాలు తాగే పద్ధతి, ఆకలి, అవసరాల్లో బిడ్డకూ బిడ్డకూ తేడా ఉంటుంది. ఒక బిడ్డ ఎక్కువసార్లు, ఎక్కువ పాలు తాగితే, మరొక బిడ్డ అంత తరచుగా తాగకపోవచ్చు. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నంతకాలం కంగారుపడనవసరం లేదు.
 
అపోహ: రొమ్ము కంటే, పాల సీసాతోనే బిడ్డ తేలికగా పాలు తాగగలుతాడు!
వాస్తవం: రొమ్ము పాలు తాగడానికి పిల్లలు మొండికేస్తే, పాల సీసా నోటికి అందిస్తాం! పాల సీసా వాడితే పాలను పీల్చే శ్రమ ఉండదు. రొమ్ము పాలు తాగాలంటే, పెదవులతో చనుమొనలను పట్టుకోవాలి. దవడలు, బుగ్గలు కదిలిస్తూ పాలు పీల్చాలి. పాలిచ్చే పద్ధతి గురించి అవగాహన లేక, వాళ్ల ఏడ్పుతో పాల సీసా నోటికి అందించడం వల్ల పిల్లలకు అదే తేలిక పని అనిపించి, రొమ్ము పాలు తాగడం మానేస్తారు. పైగా తల్లి పాల కంటే, పాల పొడితో తయారైన పాలు తీయగా ఉంటాయి కాబట్టి ఒకసారి అలవాటు పడితే, పిల్లలు వాటిని తాగడానికే మక్కువ చూపుతారు.
 
ఇదీ...పాలిచ్చే పద్ధతి!
బిడ్డను రొమ్ము దగ్గరకు లాక్కుని పాలు పట్టించేసి, నిద్రలోకి జారుకోగానే ఇంటి పనుల్లో పడిపోతూ ఉంటారు తల్లులు. కానీ బిడ్డకు పాలు పట్టించడం అనేది ఒక పనిగా కాకుండా, బాధ్యతగా భావించాలి. అందుకోసం తీరిక చేసుకోవాలి. వీలైనంత నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి.
బిడ్డతో ఏకాంతంగా గదిలో కూర్చుని, తన పాలు బిడ్డ కడుపు నింపుతాయనే విశ్వాసంతో, ఇష్టంగా పాలు పట్టించడానికి పూనుకోవాలి. 
పాలు పట్టించేముందు చేతులతో బిడ్డను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కొద్దిసేపు గుండెలకు హత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల రొమ్ములు ప్రేరేపణకు గురై, పాలు వాటంతట అవే బయటకు రావడానికి మార్గం సులువవుతుంది.
బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకుని, ముందుకు వంగిపోయి బిడ్డకు పాలిచ్చే పద్ధతి సరికాదు. మహారాణిలా దర్జాగా కూర్చుని పాలు పట్టించాలి. ఇందుకోసం... హాయిగా వెనక్కి వాలి కూర్చుని, కాళ్ల కింద స్టూలు వేసుకుని, నడుము వెనక దిండు ఉంచుకుని, మోచేయి ఆసరాతో బిడ్డను ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి, పాలు పట్టించాలి. అలాగే పాలు పట్టించేప్పుడు బిడ్డను ముఖం రొమ్ముకు ఎదురుగా ఉంచాలి. లేదంటే మెడ 90 డిగ్రీల కోణంలో తిప్పి పాలు తాగవలసిరావడంతో, మెడనొప్పి వల్ల బిడ్డ కడుపు నిండా పాలు తాగలేకపోతాడు.
ఒకవేళ తల్లి బిడ్డకు పాలు తాగించే స్థితిలో లేనప్పుడు, వేరొకరు బిడ్డ ముఖాన్ని తల్లి రొమ్ముకు ఎదురుగా ఉంచి, పాలు పట్టించాలి.
పాలు తాగించిన వెంటనే బిడ్డను భుజం మీద వేసుకుని త్రేన్పులు తెప్పించాలి. ఇలా చేయకపోతే త్రేన్పులతో పాటు పాలు కూడా బయటకు వచ్చేస్తాయి. పడుకోబెట్టినప్పుడు పిల్లలు పాలు వాంతి చేసుకోవడం వల్ల, శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
తల్లులు వదులైన దుస్తులు వేసుకుని, రొమ్ములకు సపోర్టివ్‌ నర్సింగ్‌ బ్రా వేసుకుంటే బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుంది.
పాలిచ్చేముందు రొమ్ములను శుభ్రమైన టిష్యూ పేపర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. అలాగని మరింత శుభ్రం కోసం యాంటీసెప్టిక్‌ సొల్యూషన్లతో రొమ్ములను శుభ్రం చేసుకోకూడదు.
ప్రసవానికి కొద్ది రోజుల ముందు నుంచి, చనుమొనలు మెత్తగా తయారవడం కోసం, చనుమొనలు చిట్లకుండా ఉండడం కోసం మాయిశ్చరైజర్‌తో మర్దన చేస్తూ ఉండాలి.
చనుమొనలు చిట్లి, ఆ నొప్పి వల్ల పాలు ఇవ్వలేకపోతుంటే, నిపిల్‌ షీల్డ్‌ వాడి పాలు పట్టించవచ్చు.
-డాక్టర్‌ ఎల్‌.ఫమీదా బాను
కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌
అండ్‌ గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌.