పిల్లలతో జంక్‌ఫుడ్‌ మాన్పించాలంటే...?

14-06-2019: నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు ఎనిమిదవ తరగతి, మరొకరు పదవ తరగతి చదువుతున్నారు. ఇంట్లో చేసిన ఫుడ్‌ వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ బయటి ఫుడ్‌ (జంక్‌ఫుడ్‌) కావాలంటారు. జంక్‌ఫుడ్‌ తినకుండా ఏం చేయాలి? మీరు చెబితే వింటారు. దయచేసి మంచి ఉపాయం చెప్పండి.
 
-విష్ణుప్రియ, సికింద్రాబాద్‌
 
మీ బాధ అర్థమైంది. ఈ కాలంలో పిల్లల్ని జంక్‌ఫుడ్‌ తిననివ్వకుండా ఆపడం కష్టం. ప్రకటనలు, స్నేహితుల ప్రోద్భలం, బయట దొరికే ఆహారపదార్థాలు పిల్లలపైన చాలా ప్రభావం చూపుతున్నాయి. మొట్టమొదట పేరెంట్స్‌ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జంక్‌ఫుడ్‌ అంటే ఏమిటి? ఏ ఆహారమైన మనకు కావాల్సిన దాని కన్నా ఎక్కువ తీసుకుంటే అది మన శరీరంలో జంక్‌గా మారుతుంది. పిజ్జా, బర్గర్‌, సాఫ్ట్‌డ్రింక్‌, చాట్‌, స్వీట్‌, బిర్యానీ, బిస్కట్‌... మొదలైనవాటిలో అధికంగా ఉప్పు, కొవ్వు, మసాలా, తీపి పదార్థాలు ఉంటాయి. మనలో ఇవి అవసరానికి మించి ఉండటం వల్ల శరీరంలో అనారోగ్యపు మార్పులు వస్తాయి. ఇవేకాకుండా ఇంట్లో చేసిన ఫుడ్‌ కూడా అవసరానికి మించి తింటే తప్పకుండా శరీర కొవ్వును పెంచుతుంది.
 
ఇలా చేయండి ...
పిల్లలతో మాట్లాడండి: ఫుడ్‌ ప్లానింగ్‌లో పిల్లలను భాగం చెయ్యాలి. దీనివల్ల వారి ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. దానికి తగ్గట్టుగా ఫుడ్‌ ప్లాన్‌ చేయొచ్చు. మీరు కొంత తగ్గి, వారి ఇష్టాలను అంగీకరిస్తే పిల్లలు మీ మాట కూడా ఆలకించి, మీరు చెప్పింది వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే పేరెంట్స్‌ పిల్లలు ఇద్దరికీ వీలైన ఆహార ప్రణాళిక చేయొచ్చు. ఫుడ్‌ ప్లానింగ్‌లో వారి గోల్స్‌ కూడా అడగండి. ఉదాహరణకు పొడవు పెరగాలనుకోవడం, బలంగా తయారవ్వాలనుకోవడం, జ్ఞాపకశక్తి పెంపొందిచుకోవడం మొదలైనవి.
 
ఆహారంపై గౌరవం: జంక్‌ఫుడ్‌ టేస్ట్‌ వల్ల, చూడటానికి ఇంపుగా కనిపించడం వల్ల పిల్లలు (పెద్దలు కూడా) వాటికి అట్రాక్ట్‌ అవుతారు. అందుకే ఇంట్లో చేసే ఆహార పదార్థాలు కూడా చూడటానికి చక్కగా కనిపించేటట్టు ప్లేటులో అందంగా అలంకరించి ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఆహారం పట్ల వారికి గౌరవం ఏర్పడుతుంది.
 
లంచ్‌బాక్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి: లంచ్‌బాక్స్‌లో అన్నం, కూర పెట్టేసి ఇస్తే దాన్ని ఓపెన్‌ కూడా చెయ్యడానికి ఇష్టపడని పిల్లలున్నారు. లంచ్‌బాక్స్‌లో ఎప్పుడూ సులువుగా తినడానికి వీలుగా ఉండే ఆహార పదార్థాలు, బాక్స్‌ తెరవగానే మంచి వాసన వచ్చే ఆహారం పెడితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. కొన్ని లంచ్‌బాక్స్‌ ఐడియాలు ఏమిటంటే చపాతీరోల్స్‌, వెజ్‌ఫ్రైడ్‌ రైస్‌, శాండ్‌విచ్‌, గ్రీన్‌ లేదా ఆరెంజ్‌ పూరి (ఆకుకూర, క్యారెట్‌ ఉపయోగించి), ఫ్రూట్‌ కేక్స్‌, మిల్లెట్‌ కేక్స్‌ మొదలైనవి.
 
ఆహారం ఆరోగ్యాన్నిస్తుంది: ఎప్పుడైనా పిల్లలతో ‘ఇది తినడం మంచిది కాదు, అది తినడం మంచిది కాదు’ అని ఆజ్ఞలు జారీ చేయకూడదు. ఏ ఆహారమైనా పోషణ ఇస్తుంది. అయితే అది మనకు అవసరమా, ఎంత వరకు తినవచ్చో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు చాకోలెట్లు శక్తినిస్తాయి. రుచి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. అయితే ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే చాకోలెట్లు శక్తివంతమైనవి కాబట్టి మనం రోజు తీసుకునే ఆహారం తర్వాత కొంచెం తినాలి. అదే ఆహారం తీసుకోనవసరం లేదని చెప్పొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా పిల్లలకు చెప్పొచ్చు. అందరికీ ఒకేరకం సమస్య ఉండదు కాబట్టి, ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.