వర్షాకాలంలో పిల్లలకు ఎలా స్నానం చేయించాలో తెలుసా..

13-08-2019: వర్షాకాలం ఇన్‌ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. జలుబు, దగ్గు వంటివే కాదు స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా సోకే కాలం ఇది. ఈ సీజన్‌లో పసిపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. అందుకు బేబీ స్కిన్‌కేర్‌లో మార్పులు చేయడమే కాదు వారి సున్నితమైన చర్మానికి సరైన పోషణ అందించడం కూడా ముఖ్యమే అంటున్నారు ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సుభాషిణి. ఆమె చెబుతున్న బేబీకేర్‌ టిప్స్‌ ఇవి.

తడిగా, తేమగా ఉండే వాతావరణం వల్ల పిల్లలకు ఎక్కువగా చెమట పడుతుంది. ఫలితంగా దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్ల వంటివి రెయినీ సీజన్‌లో సాధారణం. కాబట్టి పసిపిల్లల సుతిమెత్తని చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూడడం చాలా ముఖ్యం. పారాబెన్స్‌ వంటి రసాయనాలు, కృత్రిమ రంగులు, మినరల్‌ ఆయిల్స్‌, జంతు సంబంధ పదార్థాలు లేని బేబీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి.

స్నానం: తక్కువ గాఢత, ఔషధ మొక్కలతో తయారుచేసిన సబ్బుతో పిల్లలకు స్నానం చేయిస్తే వారి చర్మం సున్నితంగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది. ఆలివ్‌ నూనె, బాదం నూనె ఉన్న సబ్బు ఉపయోగిస్తే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడవచ్చు.
 
స్నానం తరువాత: బాదం నూనె, యశద భస్మ పొడి ఉన్న డైపర్‌ లోషన్‌ను వాడితే డైపర్‌ వల్ల ఏర్పడే రాషెస్‌ తగ్గుతాయి. బాదం నూనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. డైపర్‌ వాడడం వల్ల ఏర్పడే చర్మం వాపు, దురదను యశదభస్మ పొడి తగ్గిస్తుంది.
 
షాంపూ: వారానికి రెండుసార్లు పిల్లలకు తలంటు పోయాలి. దీంతో తల మీద ఏర్పడే మచ్చలను నివారించవచ్చు. వెంట్రుకలు, మాడు భాగం తాజాగా మారుతాయి. మందార, సెనగలతో తయారుచేసిన షాంపూ వాడాలి.
 
దద్దుర్లు పోవాలంటే: కలబంద, తుంగగడ్డి, ఆముదం నూనె వంటి సహజ పదార్థాలతో కూడిన కాలమైన్‌ ఉన్న లోషన్‌ను ఉపయోగించాలి. ఈ మిశ్రమం దద్దుర్లను పోగొడుతుంది.