బిడ్డకు పాలిస్తున్నారా?

08-07-2019: తల్లికి బిడ్డకు పాలిచ్చే పద్ధతులు నేర్పాలా? అనుకుంటారు. కానీ చంటి పిల్లలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కడుపు నిండా పాలు తాగాలంటే, ప్రతి తల్లీ కొన్ని పద్ధతుల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి!
 
బిడ్డకు తల్లి పాలివ్వడంలో ఓ నియమం కచ్చితంగా పాటించాలి. తల్లి చెవులు, భుజాలు, పిరుదులు నిలువుగా ఒకే కోణంలో ఉండేలా కూర్చోవాలి. ఎటువైపు పాలిస్తున్నారో ఆ వైపు ఈ నియమం తప్పకుండా పాటించాలి. బిడ్డ మీదకు వంగకుండా బిడ్డను రొమ్ముల దగ్గరకు తల్లి తెచ్చుకోవాలి. ఈ భంగిమ తల్లి, బిడ్డలిద్దరికీ ఎంతో సౌకర్యవంతమైనది. తల్లికి ఎప్పుడూ వెన్నుకు సపోర్ట్‌ ఉండాలి. ఇందుకోసం మంచాన్ని ఆసరాగా చేసుకుని రెండు దిండ్లు వీపు వెనక ఉంచుకుని నిటారుగా కూర్చోవాలి. పాలిచ్చే భంగిమల్లో క్రేడిల్‌, క్రాస్‌ క్రేడిల్‌, ఫుట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ హోల్డ్‌ అనే రకాలుంటాయి.
 
ప్రసవం జరిగిన తీరును బట్టి ఈ భంగిమలను అనుసరించాలి. సిజేరియన్‌ అయిన తల్లులైతే ‘ఫుట్‌ బాల్‌ పొజిషన్‌’ పాటించాలి. ఈ భంగిమలో తల్లి దిండ్లకు ఆనుకుని కూర్చుని, బిడ్డ తలను చేత్తో పట్టుకుని పాలు పట్టించాలి. ఇలా చేయటం వల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది. అలాగే పాలు పట్టించిన తర్వాత తప్పనిసరిగా బిడ్డకు త్రేన్పులు వచ్చేవరకూ భుజం మీద పడుకోబెట్టుకోవాలి. ఇక సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకుని బిడ్డ తలను లేపి రొమ్ముకు ఆనించుకుని పాలు పట్టించాలి. 15 నిమిషాలపాటు ఒక్కో రొమ్ముకూ సమయం కేటాయించాలి. రెండు రొమ్ములనూ సమానంగా బిడ్డకు అందించాలి. ఇలా చేయడం వల్ల పాలు నిల్వ ఉండిపోకుండా ఉంటాయి. పాలివ్వబోయే ముందు, ఇచ్చిన తర్వాత రొమ్ములను శుభ్రం చేసుకోవాలి.