ఎక్కువ సేపు టీవీ చూస్తే..

ఆంధ్రజ్యోతి(19-06-14): మీ పిల్లలు రోజుకు రెండు గంటల కన్నా ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. వ్యాయామం చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించవచ్చంటున్నారు. అందుకే పిల్లలను రోజుకు గంటకన్నా ఎక్కువ సేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో పాటు కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వారు వివరిస్తున్నారు.