పిల్లలతో ఇలా మెలగాలి!

22-10-2019: పిల్లలను గారం చేస్తే ప్రతిదీ కావాలని మారాం చేస్తారు. అలాగని కట్టడి చేస్తే మొండిఘటాల్లా తయారవుతారు. కాబట్టే పిల్లలతో ప్రేమగానూ, క్రమశిక్షణతోనూ మెలగాలి అంటూ ఉంటారు మానసిక వైద్యులు. వారి సూచనలు ఇవే!
 
ప్రేమను పంచేది ఇలా!
ఐ లవ్‌ యు: పిల్లలు తల్లితండ్రుల ప్రేమను కోరుకుంటారు. వాళ్ల చర్యల్లోనే కాదు, మాటల ద్వారా కూడా ఆ ప్రేమను పొందాలని తహతహలాడతారు. అందుకే, తరచుగా పిల్లలకు ఆ విషయాన్ని తెలిపేలా మాట్లాడాలి. ‘నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అనో, ‘నీమీద నాకెంతో ప్రేమ అనో అంటూ ఉండాలి’.
 
ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ: నిన్ను చూసి గర్వపడుతున్నాను అంటే ఏ పసి మసను ఉప్పొంగిపోదు? పిల్లలు చేసే మంచి పని, అది ఎంత చిన్నదైనా సరే! వాళ్లని మెచ్చుకోవాలి. ఇందుకు నిన్ను చూసి గర్వపడుతున్నానని చెప్తే పిల్లలు మరింత ప్రోత్సాహాన్ని అందుకున్న అనుభూతికి లోనవుతారు.
 
ఐయామ్‌ సారీ: పిల్లలకు తల్లితండ్రులు క్షమాపణ చెప్పడమేంటి? అనుకుంటాం. కానీ వాళ్లకు మనం రోల్‌ మోడల్‌గా నిలవాలంటే తప్పు చేస్తే క్షమాపణ అడగడానికి అడ్డొచ్చే అహాన్ని చంపుకోవాలి. ఈ లక్షణాన్నే పిల్లలూ అలవరుచుకుంటారు.
 
ఐయామ్‌ లిజనింగ్‌: పిల్లలు చెప్పేది, అదెంత అసందర్భమైనదైనా శ్రద్ధగా వినాలి. అప్పుడే పిల్లలు అన్ని విషయాలనూ పెద్దలతో పంచుకోవటానికి ఇష్టపడతారు.
 
కోపం వస్తే?
పిల్లలు తమ కోపాన్ని మాటల్లో వ్యక్తం చేయలేరు కాబట్టి చేతలతో చూపిస్తారు. వస్తువులు విసిరేయటం, కాళ్లను నేలకేసి కొట్టి, గట్టిగా అరవటం లాంటివి చేస్తారు. మరీ ముఖ్యంగా వాళ్లు బాగా అలసిపోయినప్పుడో, అసహనానికి గురైనప్పుడో ఇలా చేస్తారు. ఇలాంటి పిల్లల విసుగు, చిరాకులు, పరాకులను దారి మళ్లించాలంటే ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.
సాధ్యమైనంత నవ్వించే ప్రయత్నం చేయాలి.
నిశ్శబ్దమైన ప్రదేశానికి తీసుకెళ్లి కోపానికి కారణం నెమ్మదిగా రాబట్టాలి.
తమ బాధను మాటల్లో వ్యక్తపరచగలిగేలా పిల్లలను ప్రోత్సహించాలి.
పిల్లలు ఏడవగానే వాళ్లడిగింది చేతిలో పెడితే అదే అలవాటవుతుంది. కాబట్టి అరిచి, గోల చేయటం వల్ల ఉపయోగం ఉండదని పిల్లలు తెలుసుకునేలా చేయాలి.
అరుస్తూ, గోల చేస్తున్న పిల్లల్ని ఆ గోల ఆపేవరకూ హత్తుకోవాలి.
పెద్దల దృష్టిని ఆకర్షించడం కోసం కూడా పిల్లలు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకవేళ అదే కారణమైతే పిల్లల కోపాన్ని గుర్తించనట్టు నటించాలి.

పిల్లలతో కలిసి....

పిల్లల ఆటల్లో పాలు పంచుకోవడం చిన్నతనంగా భావించకూడదు. వాళ్లతో కలిసి ఆటలాడడం వల్ల అనుబంధం బలపడుతుంది. పిల్లల మనోభావాలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి...
దాగుడుమూతలు మొదలు పరుగు పందెం వరకూ వీలైనన్ని ఆటల్లో పాలుపంచుకోవాలి.
బిల్డింగ్‌ బ్లాక్స్‌ ఆటలో పక్కన ఉండి సహాయం చేయాలి.
చెస్‌, క్యారమ్స్‌ లాంటి ఇండోర్‌ గేమ్స్‌లో పిల్లలను గెలిపిస్తూ, ఓడిస్తూ స్పోర్టివ్‌నెస్‌ పెంచవచ్చు.