బేబీ ఇంటెలిజెన్స్‌

15-10-2019: పిల్లల తెలివితేటలన్నీ వాళ్ల చదువు సంధ్యలపైనే ఆధారపడి ఉంటాయనే అందరూ అనుకుంటారు. అయితే ఇటీవలి కొన్ని పరిశోధనలు అందుకు భిన్నమైన నిజాన్ని బయటపెట్టాయి. గర్భం దాల్చిన తొలి మూడు మాసాల్లో జీడిపప్పు, బాదాం, పిస్తా వంటి గింజధాన్యాలు తిన్నవారి పిల్లల్లో ఐ.క్యూ స్థాయి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా, ఉన్నతంగా ఉంటున్నాయన్నదే ఆ నిజం. ‘యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం పిల్లల జ్ఞాపక శక్తికి సంబంధించి ఈ ఈ కొత్త విషయాన్ని బయటపెట్టింది.
 
గర్భం దాల్చిన ఒకటి నుంచి మూడో మాసం దాకా, గింజధాన్యాలు తిన్న వారికి కలిగిన పిల్లల్లో చలన శక్తి (మోటార్‌) మేధో శక్తి ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. ముఖ్యంగా మొదటి మూడు మాసాల కాలంలో గింజ ధాన్యాలు తిన్న గర్భిణులకు కలిగిన పిల్లలను పరీక్షిస్తే, గ్రహణ శక్తి, ఏకాగ్రతా పటిమ, దీర్ఘకాల జ్ఞాపక శక్తి చాలా పై స్థాయిలో ఉంటున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమయ్యింది. గింజ ధాన్యాల్లో విశేషించి ఫోలిక్‌ యాసిడ్‌, ఒమేగా-3, ఒమేగా 6 వంటి ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి నాడీ కణజాలంలో, ప్రత్యేకించి మెదడులోని ప్రాంటల్‌ ప్రదేశంలో ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తినీ, కార్యదక్షతనూ బాగా పెంచుతాయి.