యోగాతో కీమో బాధలు మాయం...

24-6-15

కేన్సర్‌ వచ్చిందనగానే చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు.  కేన్సర్‌  చికిత్సలో భాగమైన కిమోథెరపీ వల్ల తలెత్తే బాధలనైతే  భరించడం చాలా కష్టం. అందుకే కిమోకి వెళ్లాలంటే  చాలామంది కేన్సర్‌ పేషంట్లు డీలా పడిపోతుంటారు. కీమోథెరపీవల్ల సైడ్‌అఫెక్టులు తలెత్తుతాయి. వాంతులవడం, జుట్టు ఊడిపోవడం, యాంగ్జయిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని తట్టుకోలేక ఎంతోమంది కేన్సర్‌ బాధితులు నానాబాధలూ పడుతుంటారు. అయితే ఇలాంటి వారందరికీ ఒక శుభవార్త. యోగా  సహాయంతో కిమో వల్ల తలెత్తే సైడ్‌ఎఫెక్టులను నివారిచ్చవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇది కేన్సర్‌ రోగుల జీవితకాలాన్ని కూడా పెంచుతుందంటున్నారు. ఆధునిక వైద్యంతో యోగాను అనుసంధానం చేయడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చని అధ్యయనాకారులు చెప్తున్నారు. ఇవి ఉబుసుపోక చెప్తున్న మాటలు కావు.  ఎన్నో శాస్త్రీయ అధ్యయనాల్లో నిరూపితమైన సత్యం ఇది. కేన్సర్‌ ఒక్కటే కాదు మరెన్నో  జబ్బుల నివారణలో కూడా యోగా కీలకంగా  పనిచేస్తుంది. భారత్‌ చేసిన అధ్యయనాల్లోనే కాకుండా యూరప్‌, అమెరికాల్లో చేసిన అధ్యయనాల్లో కూడా కిమోవల్ల తలెత్తే  సైడ్‌ఎఫెక్టులను యోగా  ద్వారా నివారించవచ్చంటున్నారు నిపుణులు. 

కిమోథెరపీ వల్ల వచ్చే నొప్పి, యాంగ్జయిటీ , తలతిరగడం, వాంతులవడం వంటివి  తట్టుకునేలా యోగా సహకరించడమే కాదు శరీరంలో రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. అయితే దీనికి కేన్సర్‌ పేషంటు నిత్యం యోగ సాధన చేయాల్సి ఉంటుంది. కిమోథెరపీ చేయించుకునేటప్పుడు కేన్సర్‌తో బాధపడే వాళ్లు బాగా నీరసపడిపోతుంటారు. వారి మానసిక ఆరోగ్యం కూడా బాగా క్షీణిస్తుంది. యోగ  చేస్తే  రోగి శారీరకంగా, మానసికంగా  సమతుల్యతను సాధించగలడు.  ఇటీవల జరిపిన ఒక సర్వేలో యోగ సాధన వల్ల 101 అనారోగ్య సమస్యల తీవ్రతను నివారించవచ్చని వెల్లడైంది. యోగా వల్ల లింఫటిక్‌ సర్క్యులేషన్‌ మెరుగుపడుతుంది. లోయర్‌ బ్లడ్‌ ప్రెషర్‌ సమస్య తగ్గుతుంది. కీళ్ల కదలికలు మెరుగుపడతాయి. స్కొలియాసిస్‌ నొప్పిని కూడా ఇది నియంత్రిస్తుంది. ఇంకా యోగా వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు యోగా చేసిన వాళ్లల్లో రోగనిరోధకశక్తి పాళ్లు పెరిగాయని కూడా  పలు అధ్యయనాల్లో నిరూపితమయ్యాయి. యోగ శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దడమే కాకుండా గుండె సంబంధిత సమస్యల ను పరిష్కరించడంలోనూ చక్కటి ఫలితాలను చూబిస్తుంది.  కేన్సర్‌ అనే కాదు అన్ని  రకాల  జబ్బులకు యోగ  మంచి మందు. నిత్యం యోగా చేస్తే  మిగతావారిలాగే కేన్సర్‌ బాధితులు కూడా ఆనందకర జీవితాన్ని కొనసాగించగలరు. మరెందుకు ఆలస్యం.... మీరు కూడా యోగాని మొదలెట్టండి ...