మెటాస్టాటిక్‌ కేన్సర్‌ అంటే?

05-07-2018: తాను హైగ్రేడ్‌ కేన్సర్‌తో.. అదీ మెటాస్టాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు సోనాలీ బెంద్రే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. మెటాస్టాటిక్‌ కేన్సర్‌ అంటే.. ఒక చోట వచ్చిన కేన్సర్‌ కణితుల నుంచి కణాలు ఇతర అవయవాలకు వ్యాపించడం. ఉదాహరణకు ఒక వ్యక్తికి లంగ్‌ కేన్సర్‌ వచ్చిందనుకుంటే.. కేన్సర్‌ కణాలు ఊపిరితిత్తుల్లో ఏర్పడిన కణితి నుంచి విడివడి లింఫ్‌ గ్రంథుల వ్యవస్థ ద్వారా లేదా రక్తం ద్వారా ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తాయి. కేన్సర్‌ ఇలా ఇతర అవయవాలకు వ్యాపిస్తోందంటే అది ‘స్టేజ్‌ 4 కేన్సర్‌’ కింద లెక్క. అయితే, కొన్ని రకాల కేన్సర్లు కొన్ని ప్రత్యేకమైన అవయవాలకు వ్యాప్తిస్తాయి. ఉదాహరణకు.. రొమ్ము కేన్సర్‌ వస్తే ఆ కణాలు ఎముకలకు, కాలేయానికి, ఊపిరితిత్తులకు, మెదడుకు పాకే ముప్పు ఎక్కువ.
 
ఊపిరితిత్తుల కేన్సర్‌ బాధితుల్లో కేన్సర్‌ కణాలు మెదడుకు, ఎముకలకు, కాలేయానికి, ఎడ్రినల్‌ గ్రంథులకు వ్యాపించే ప్రమాదం ఎక్కువ. రొమ్ము కేన్సర్‌ నుంచి లివర్‌కు కేన్సర్‌ కణాలు విస్తరించినప్పుడు వైద్యులు దాన్ని ‘మెటాస్టాటిక్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌’గానే వ్యవహరిస్తారు తప్ప లివర్‌ కేన్సర్‌ అనరు. దానికి స్టేజ్‌ 4 బ్రెస్ట్‌ కేన్సర్‌కు చేసే చికిత్సే చేస్తారు. అలాగే, వేరే అవయవం వద్ద ఏర్పడే కేన్సర్‌ కణితులను మెటాస్టాటిక్‌ ట్యూమర్స్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో కేన్సర్‌ నాలుగో దశలో ఉండి పలు అవయవాలకు వ్యాపించాక బయటపడుతుంది. అలాంటి సందర్భాల్లో కేన్సర్‌ కణితి తొలుత ఎక్కడ ఏర్పడిందో (ప్రైమరీ స్పాట్‌) వైద్యులు గుర్తించలేకపోతారు. అలాంటి సందర్భాల్లో దాన్ని ‘కేన్సర్‌ ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ ఆరిజన్‌ (సీయూపీ)’గా వ్యవహరిస్తారు.