16-10-13
రొమ్ము కేన్సర్ అవగాహనా వారోత్సవాలు జరుగుతున్న సమయమిది. రొమ్ము కేన్సర్ ఒకసారి తగ్గిపోయి మళ్లీ వచ్చే ద్వితీయ కేన్సర్ అవగాహనా సదస్సులు కూడా ఇందులో ఒక భాగంగా ఉంటున్నాయి. ఏటా ఈ సదస్సులు జరుగుతున్నా, స్వీయ పరీక్షలతో రొమ్ము కణితిని గుర్తించడంలో చాలా మంది అలక్ష్యంగానే ఉంటున్నారు. ఆ అవగాహనే పెరిగితే రొమ్ము కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి వ్యాధి నుంచి తొలిదశలోనే విముక్తి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. వాస్తవానికి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాక రెండవ సారి వచ్చిన రొమ్ము కేన్సర్ కు కూడా సమర్థవంతంగా చికిత్స చేసే అవకాశాలు మెరుగుపడ్డాయి. సకాలంలో డాక్టర్‌ను సంప్రదిస్తే, ఈ రోజుల్లో రొమ్ము కేన్సర్‌ను నిర్మూలించడమే కాదు రొమ్ము ఆకృతిని కాపాడటం కూడా సులువవుతుంది అంటున్నారు, ప్రముఖ కేర్సర్ నిపుణులు డాక్టర్ సిహెచ్ మోహనవంశీ.
ఏవైపు నుంచో ఒక ఒత్తిడి ఉండడం వల్ల ఇతరమైన అన్ని బాధ్యత ల్నీ సక్రమంగా వ్యవహరిస్తారు. ఏ ఒత్తిడీ లేనిది మన ఆరోగ్యం విషయంలోనే కాబట్టి, చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండిపోతారు. ఈ నిర్లక్ష్యం ఒకవేళ కేన్సర్ విషయంలోనే అయితే దాని ఫలితం ప్రాణాపాయమేగా! అతి స్వల్పమైన చికిత్సలే అందుబాటులో ఉన్నప్పటి పరిస్థితి వేరు. ఈ రోజుల్లో అత్యంత ఆఽధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. సైబర్ నైఫ్ రేడియేషన్ల ఆధునిక పరికరాలు క్సేర్ చికిత్సలో ఒక విప్లవాత్మకమైన పురోగతినే సాధించాయి. ఇంతా జరిగాక కూడా ఎవరైనా కేన్సర్‌ను ముదర పెట్టుకుని ప్రాణాంతక స్థితికి చేరుకోవడం చాలా బాధాకరం.నిజానికి నేడు చికిత్సల్లోనే కాదు. వ్యాధినిర్ధారణా పరీక్షల్లోనూ ఎన్నో అధునాతన యంత్రాలు వచ్చాయి. ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన సాధారణ అనలాగ్ మేమోగ్రఫీ స్థానంలోకి ఇప్పుడు డిజిటల్ మేమోగ్రఫీ వచ్చిచేరింది. ఒకప్పుడు కణితి 7 నుంచి 8 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటే తప్ప పరీక్షల్లో కనిపించేదే కాదు. గుర్తించే నాటికే కొన్నిసార్లు కేన్సర్ విషమస్థితికి చేరుకునేది. ఇప్పుడొచ్చిన డిజిటల్ మెమోగ్రఫీ ద్వారా దీని వల్ల అతి చిన్నదిగా అంటే 3 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉన్న కణితిని కూడా గుర్తించడం సాధ్యమవుతోంది. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎన్హాన్స్ మెమోగ్రఫీ, డైనమిక్ కాంట్రాస్ట్‌తో ఎంఆర్ మేమోగ్రాం ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కణితిని ఎంతో కచ్ఛితంగా గుర్తించవచ్చు. ఆల్ర్టాసౌండ్ పరీక్షలోనూ, ఎలాస్టోగ్రఫీ చేయడం ద్వారా, కణితి ఽతత్వాన్ని కూడా అంచనా వేసే అవకాశం ఏర్పడింది.
సర్జరీలో సంచలనమే
గతంలో అయితే రొమ్ము కేన్సర్ వస్తే, రొమ్ము మొత్తం తీసివేస్తారనే భయం, బాధ ఉండేవి. వాస్తవికంగా, అప్పటి పరిస్థితుల్లో చాలా వరకు అలాగే ఉండేది. అయితే, ఇప్పుడొచ్చిన ఈ ఆధునిక విధానాల వల్ల అలా మొత్తం రొమ్మును తీసివేసే అవసరం తప్పింది. ఈ క్రమంలో రొమ్ములోని ఆ కణితి వరకే తీసివేయడం మొదలయ్యింది. కాకపోతే, ఆ రోగిలీఓ కేన్సర్ పాకే అవకాశం ఉన్న లింఫ్గ్లాండ్స్ను కూడా తీసివేయడం జరుగుతూ వచ్చింది. రొమ్ము కేన్సర్ సర్జరీలు రెండు దశల్లో ఉంటూవచ్చాయి. అందులో ప్రాధమికంగా కణితి ఎక్కడైతే ఉందో అంతవరకే సర్జరీ చేయడం, రెండవది కేన్సర్ పాకే అవకాశం ఉన్న చంకలోని లింఫ్గ్లాండ్స్ను కూడా తొలగించివేయడం. అయితే ఈ సర్జరీల్లో ఎన్నో ఆధునిక రీతులు అందుబాటులోకి వ చ్చాయి. ప్రాథమిక దశలో చేసే సర్జరీ అంటే లంపెక్టమీలో కేన్సర్ కణితి చుట్టూ కొన్ని మిల్లీ మీటర్ల మార్జిన్ ఉండేలా సర్జరీ ఉంటుంది. అయితే, లంపెక్టమీ చేశాక కూడా, రొమ్ము ఆకృతిలో ఏ విథమైన లోపమూ ఏర్పడకుండా, మళ్లీ మునుపటి సహజాకృతిలో ఉంచే కొన్ని కొత్త విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ
ప్లాస్టిక్ సర్జరీ సూత్రాలను, రొమ్మును తిరిగి నిర్మించే రీక న్స్ట్రక్టివ్ సర్జరీ సూత్రాలను పాటిస్తూనే, ఆంకాలజీ విధానాల్లో రాజీపడకుండా చేయడం ఈ విధానం ప్రత్యేకత. ఈ సర్జరీల్లో రొమ్ము చుట్టూ అసలు గాటు అయినా పడకుండా చేసే వీలుంది. అంటే, రొమ్ము నిపుల్ చుట్టూ న ల్లటి చార ఉండే చోట, గుండ్రంగా కోత పెట్టి, కేన్సర్ కణితిని అందులోంచి తీసివేస్తాం. ఆ తరువాత గుండ్రంగా కుట్టివేస్తాం. అందువల్ల ఆక్కడ గాటు కనపడదు. సర్జరీ తరువాత లోకల్ బ్రెస్ట్ టిష్యూను అంటే కొవ్వును ఆ ఖాళీలోకి చేర్చడం ద్వారా అక్కడ గుంట కూడా పడదు. రొమ్ములో ఎక్కువ కణజాలాన్ని తీసివేసే సందర్భాల్లోనూ భుజం కింది భాగంలో కొన్ని కండరాల్ని,రక్తనాళంతో సహా అక్కడికి చేరుస్తాం. అది అంతకు ముందు కొవ్వు తీసివేసిన ఖాళీలోకి పూర్తిగా ఒదిగిపోతుంది. వెళుతుంది. అలాగే ఇటీవల స్టెమ్‌సెల్స్‌ను తీసుకుని ఈ ఖాళీని పూరించే విధానాలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ విధానం ఇంకా కొన్ని కేంద్రాల్లోనే అందుబాటులో ఉంది. ఇలాంటి పలు విధానాల ద్వారా రొమ్ము పరిమాణంలోగానీ, ఆకృతిలో గానీ, ఏమాత్రం మార్పు రాకుండా సర్జరీ చేయగలుగుతున్నాం. ఇదే సమయంలో రొమ్మును బిగుతుగా మార్చే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోవచ్చు. ఆంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు సంయుక్తంగా చేసే ఈ శస్త్ర చికి త్స ద్వారా కేన్సర్ చికిత్సతో పాటు సహజమైన సౌందర్యాన్ని కాపాడుకునే వీలుంది.
కీమోథెరపీలో కొత్త పుంతలు
కీమోథెరపీలోనూ ఎన్నో కొత్త రకం మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటివల్ల శరీరం మీద పడే దుష్ప్రభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. గుండె మీద ఏ మాత్రం దుష్ప్రభావం పడకుండానే కీమోథెరీపీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కీమోథెరపీ ఇచ్చాక కూడా కేన్సర్ మళ్లీ వస్తే ఒకప్పుడైతే ఇంక ఆశలు వదులుకునే వారు. ఇప్పుడు ఆ భయమే అవసరమే లేదు. ఆ స్థితిలో ఇవ్వడానికి కొన్ని కొత్తరకం మందులు వచ్చాయి.ఎన్నో కొత్త మాల్క్యూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నోటి ద్వారా వేసుకోవడానికి వీలుగా, ఓరల్ కీమోథెరపీ మందులు కూడా వచ్చాయి. వీటి ద్వారా జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది.
రేడియేషన్ లో ముందడుగు
రొమ్ము కేన్సర్ సోకిన వారికి ఇచ్చే రేడియేషన్లోనూ ఎన్నో కొత్త విధానాలు వచ్చాయి. మామూలుగా అయితే, సర్జరీ తరువాత మొత్తం రొమ్ముకు రేడియేషన్ ఇస్తుంటాం. ఒకప్పుడైతే, ఎడమ రొమ్ముకు కేన్సర్ వచ్చి, ఆ భాగానికి రేడియేషన్ ఇస్తే, శ్వాసకోశాలతో పాటు, గుండెకూడా దుష్ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి లేకుండా ఇటీవల కొత్త రకం రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐమ్ఆర్టి ( ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ), ఐజిఆర్‌టి ( ఇమేజ్ గ్రైడెడ్ రేడియో థెరపీ)లతో వి-మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి, రేడియేషన్ ఇస్తే, సులువుగానూ, చాలా వేగంగానూ ఆ భాగానికి రేడియేషన్అందించగలుగుతాం. పైగా, ఆ పక్కనున్న నార్మల్ కణజాలానికి, ఏ మాత్రం హాని కలగదు.దీనికి తోడు ఈ మద్య పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే ఒక విధానం వచ్చింది. రొమ్ము మొత్తానికి రేడియేషన్ ఇవ్వకుండా, క్యాన్సర్ కణితి ఉన్న భాగానికే రేడియేషన్ ఇవ్వడం ఈ విధానం. ఇందులో భాగంగా, పలురకాల ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ రేడియో టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి సర్జరీ చేస్తున్నప్పుడే ఈ థెరపీ ఇవ్వడం అయిపోతుంది.ఒకే ఒక్క ఫ్రాక్షన్లో రేడియేషన్ అయిపోతుంది. ఆ తరువాత రేడియేషన్ అవసరమే లేదు. అలాగే సైబర్‌నైఫ్ ద్వారా చేసే, పార్షియల్ రేడియేషన్ కూడా ఒకే ఒక్క రోజుతో అయిపోతుంది.
హార్మోన్ థెరపీ
రొమ్ము కేన్సర్ కణాలు, హార్మోన్ రిసెప్టార్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టాన్ రిసెప్టార్, ఈ హార్మోన్ రిసెప్టార్స్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇవ్వడానికి కొన్ని కొత్త రకం మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూడా జీవిత కాలాన్ని బాగా పెంచవచ్చు. అలాగే యాంటీ ఈస్ట్రోజన్‌గా పనిచేసే ఫల్వెస్ట్రెంట్ అనే మందు కూడా అందుబాటులోకి వ చ్చింది. ఒక కీమో థెరఫీ విఫలమైపోతే మరో కీమో థెరపీ అందుబాటులోకి వచ్చినట్లు,ఒక హార్మోన్ థెరపీ విఫలమైపోతే, మరోరకం హార్మోన్ థెరపీ, అదీ విఫలమైతే ఈ ఫల్వెస్ట్రెంట్ ఇలా కేన్సర్ చికిత్సలో ఎన్నో కొత్త విధానాలు వచ్చాయి. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ఎవరిలోనైనా,హర్ 2 న్యూ రిసెప్టార్, పాజిటివ్‌గా ఉంటే,కణితి చిన్నదే అయినా, హర్సెప్టీన్ మందు ఇవ్వవలసి ఉంటుంది. ఈ మందు ఖరీదు చాలా ఎక్కువే. కానీ కేన్సర్ తిరిగా రాకుండా నివారించడానికి, జీవిత కాలాన్ని బాగా పెంచడానికి ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మందును మూడు వారాలకు ఒకసారి చొప్పున 18 కోర్సులు అంటే దాదాపు ఒక ఏడాది పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ హర్సెప్టీన్తో కూడా ఫలితం లేనప్పుడు ఇవ్వడానికి టైకర్బ్ అనే మందు అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా వారి జీవితకాలాన్ని గణీనీయంగా పెంచవచ్చు. ఏమైనా, అప్పటికి అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలన్నీ అయిపోయాక కూడా మరోసారి కేన్సర్ వస్తే ఆందోళన చెందవ లసిన అవసరం ఇప్పుడేమీ లేదు.క ణితి ఎంత చిన్నదయినా, వివిధ కోణాల్లోంచి, అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందించడం ద్వారా వ్యాఽఽధిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు ఏర్పడ్డాయి. నిజానికి ఒక రొమ్ము కేన్సర్‌కు తప్ప మరే కేన్సర్‌కూ ఇన్నిరకాల వైద్య చికిత్సలు అవసరం లేదు. రొమ్ము కేన్సర్ అంత సంక్లిష్టమైనది కావడం వల్లే ఇవన్నీ అవసరమవుతున్నాయి. కాకపోతే రొమ్ము కేన్సర్ ఎంత సంక్లిష్టమైనదైనా, దాన్ని ఎదుర్కొనే విశిష్ఠమైన వైద్య విధానాలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కావలసిందల్లా రొమ్ము కేన్సర్ గురించిన ఒక అవగాహనే. అవగాహన అంటే మెదడులో కొంత సమాచారాన్ని నింపుకోవడమే కాదు. కేన్సర్‌ను అధిగమించి నిండు నూరేళ్లు జీవించడమే.
డాక్టర్ సి హెచ్ మోహనవంశీ
'చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్