వీరికి కేన్సర్‌ రాదు..

 

70 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం
60 ఏళ్లు దాటినా బిడ్డకు జననం
 
ఆంధ్రజ్యోతి, 22-01-2019: మనిషి జీవితకాలం ఎంత? ఒకప్పుడు వందేళ్లుశ్రీ ఇప్పుడైతే ? డెభ్బై నుంచి ఎనబై! ఆ వయసుకు వచ్చేసరికే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడటం చూస్తున్నాం. కానీ ఆ తెగవాళ్లు వందేళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉంటారు. ఇక కేన్సర్‌ వంటి రోగాల సమస్యే లేదు. అదంటే కూడా తెలియదు. 70 ఏళ్లు వచ్చినా యవ్వనంగా కనిపించడం వీరి ప్రత్యేకత. ఇంతకీ ఆ తెగ పేరేంటో తెలుసా? ‘బురుషా’! దీనికి మరో పేరు హుంజాలు!
 
పాకిస్థాన్‌లోని హుంజా ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. సాధారణంగా మహిళలకు నలభై ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఈ తెగ వారు మాత్రం 60 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు. అందరికంటే ప్రత్యేకంగా ఉండటానికి వీరేం అమృతం తాగలేదు. వీరి జీవన విధానమే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా పాకిస్థానీల సగటు వయసు 67 ఏళ్లు. కానీ హుంజాల సగటు వయసు వందేళ్లు. గడ్డ కట్టే చలిలోనూ చన్నీళ్లతో స్నానం చేయడానికే ఇష్టపడతారు. వ్యాయామం, నడకకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఉన్నవారిలో 90 శాతం అక్షరాస్యులే!
 
వీరి ఆహారమే ప్రత్యేకం
ఆరోగ్యకరమైన జీవన విధానమే వీరి ఆరోగ్య రహస్యం. ఆహారపదార్థాలన్నీ స్వయంగా పండించుకుంటారు. ముఖ్యంగా పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, స్వయంగా పండించిన కూరగాయలు, పాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే హుంజాలు తింటారు. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని అసలే ముట్టుకోరు. రోజుకు 2వేల కేలరీలకు మించి ఆహారం తీసుకోరు. ఆప్రికాట్‌ పండ్లను ఇష్టంగా తింటారు. హిమనీనదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగుతారు. ఇక్కడ ‘తుమురు టీ’ ఇక్కడ చాలా ప్రత్యేకం. మూలికలతో తయారు చేసీ ఈ టీ వల్లే వీరి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
 
ఆహారానికి విరామం
ఇక్కడి ప్రజలు రోజూవారీ ఆహారానికి రెండు, మూడు నెలలపాటు విరామం ఇస్తారు. ఆ సమయంలో ఆప్రికాట్‌ పండ్ల నుంచి తీసిన ఆహరాన్ని ఎక్కువగా తాగుతారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆప్రికాట్‌ పండ్లలో ఉండే విటమిన్‌ బీ-17కు కేన్సర్‌ వంటి వ్యాధులను నిరోధించే లక్షణాలున్నాయి.