ధూమపానం చేస్తే అంతే సంగతులు...

రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

మూడోవంతు పొగాకు ఉత్పత్తులతోనే..!!
 ప్రాణాంతక జబ్బులకు పొగాకే మూలం

10మంది వ్యాధిగ్రస్తుల్లో మందికి నోటి కేన్సర్లు

హైదరాబాద్‌, 30-05-2018: కేన్సర్లల్లో మూడో వంతువరకు పొగాకు వాడకానికి సంబంధించినవే. పొగాకు ఏ రూపంలో వినియోగించినా అది కేన్సర్‌కు దారి తీసే కణాలలో మార్పులు చేసి వ్యాధిని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మంది కేన్సర్‌తో చనిపోతున్నారు. అందులో ఇండియా రెండో స్థానంలో ఉంటోంది. మన దేశంలో 27.5 కోట్ల మంది పొగాకు వినియోగిస్తున్నారని గతంలో గ్లోబల్‌ అడల్య్‌ టోబాకో సంస్థ చేసిన సర్వే ద్వారా తేలింది. గుట్కా వంటి ఉత్పత్తులను 16.37 కోట్ల మంది వినియోగిస్తుండగా, 6.9 కోట్ల మంది ధూమపానం చేస్తున్నారని ఆ సర్వే తేల్చింది. మరో 4.23కోట్ల మంది ధూమపానంతోపాటు, గుట్కా వంటి ఉత్పత్తులను వాడుతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వాడకం నాన్‌ కమ్యూనికల్‌ డీసీజ్‌లకు కారణమవుతున్నాయి.

 
మహిళలు కూడా...
రోజు రోజుకు పొగతాగే మహిళల సంఖ్య పెరిగిపోతుండడంతో వారికే కాదు... రాబోయే తరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పొగ తాగుతున్న మహిళల శాతం పెరిగింది. ధూమపానం చేస్తున్న వారిలో 20 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ప్రధాన నగరాల్లో సిగరెట్లు తాగే మహిళల శాతం రెండు రెట్లు పెరిగింది. మారిన ఆర్థిక స్థితిగతులు మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చాయి. దీంతో చాలా మంది తమకు నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందునా ఉద్యోగాలు సైతం పగలు రాత్రి తేడా లేకుండా ఉంటున్నాయి. దీంతో కొందరు మానసిక ఒత్తిళ్లకు గురవుతూ సిగరెట్లకు అలవాటు పడుతున్నారు.
 
ఆందోళన, మానసిక ఉల్లాసం కోసం
హైదరాబాద్‌లో ధూమపానం, గుట్కా, కిళ్లీ వాడకం ఎక్కువగా ఉంటోంది. చాలా మంది ఆందోళన తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కోసం సిగరెట్‌ను ఎక్కువగా తాగుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 65 శాతం మంది టెన్షన్, రీలాక్స్‌ కోసం తాగుతున్నట్లు గతంలో నిర్వహించిన సర్వే ద్వారా తేలింది. దాదాపు రెండు వేల మందిపై ఈ సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది పొగరాయుల్లేనని తేలింది. ఇందులో రిలాక్స్‌ కోసం 34 శాతం, టెన్షన్‌ కోసం 35 శాతం మంది, స్టైల్‌ కోసం 10 శాతం సిగరెట్‌ తాగుతున్నట్లు వెల్లడైందని ఓ వైద్యుడు చెప్పారు. వంద మంది యువతుల్లో 15 శాతం మంది రెగ్యులర్‌గా సిగరెట్‌ తాగుతున్నామని, అందులో 21 శాతం మంది అప్పడుప్పుడు స్మోకింగ్‌ చేస్తున్నట్లు స్పష్టమైంది.
 
వచ్చే జబ్బులు ఇవీ...!!
చిన్న వయస్సు నుంచే ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వల్ల కేన్సర్‌, మధుమేహం, గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్స్ వంటి జబ్బులు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్యనే వస్తున్నాయి. ఎక్కువగా గొంతు, నాలుక, దవడ, స్వరపేటిక వంటి కేన్సర్‌ జబ్బులు అధికంగా ఉంటున్నాయి. వీటి బారిన యువకులే ఎక్కువగా పడుతున్నారు. వీటితో పాటు శ్వాసకోశ వ్యాధులు, అన్నకోశ వ్యాధులు, పెదవులు, కిడ్నీ, మూత్రాశయం కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
 
వెన్నుపూసలకు ప్రమాదమే
పొగతాగడం వల్ల వెన్నుపూసలు కూడా దెబ్బ తింటాయి. ధూమపానం వల్ల రెండు వెన్నుపూసల్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదముంది. తద్వారా డిస్క్‌లు కుంచించుకుపోయి కదలిక తగ్గిపోయే అవకాశం ఉంది. పొగతాగే వారిలో మూడు నాలుగు రెట్లు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. మహిళలు పొగతాగితే ఆస్ర్టియోపోరాసిస్‌ వచ్చే ప్రమాదముంది..
 
గర్భస్రావాలు
20 నుంచి 30 సంవత్సరాలలోపు ధూమపానం చేసే యువతులకు వివాహం జరిగిన తరువాత అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆలస్యంగా పిల్లలు పుట్టడం, కొన్నిసార్లు అబార్షన్లు కావడం, నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు పొగతాగిన మహిళల్లో కనిపిస్తాయి.
 
15 నుంచి 24 ఏళ్ల వారే అధికం..
సాధారణంగా 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతలో పొగతాగేవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. నగరంలోని పొగరాయుళ్లలో 32శాతం మంది ఈ వయస్సు వాళ్లే. ధూమపానం వల్ల 32 నుంచి 40 ఏళ్ల వాళ్లలో 30 శాతం మంది కేన్సర్‌ రక్కసి కోరల్లో చిక్కుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అంకాలజిస్టుల వద్దకు వచ్చే వంద మంది రోగుల్లో 40 మంది పొగాకు ఉత్పత్తుల కారణంగా వ్యాధి బారినపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
 
అటెన్షన్
ఛాతి వైద్యం కోసం వచ్చి మృతి చెందుతున్న వారిలో 50శాతం మంది పొగ తాగేవారే.
పొగ తాగటం వల్ల ప్రపంచంలో ప్రతి ఎనిమిది సెకన్లకూ ఒకరు చనిపోతున్నారు.
మహిళలు పొగతాగితే ఆసి్ట్రయోపోరాసిస్‌ వచ్చే ప్రమాదముంది.
 ఒక సిగరెట్‌ తాగితే 4200 విషవాయువులు ఆవహిస్తాయి.
 కౌన్సెలింగ్‌కు వస్తున్న వాళ్లలో 35 ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువ.
 తల్లులు పొగతాగితే పుట్టబోయే బిడ్డలకు ప్రమాదమే.
 
ఇలా చేస్తే బెటర్‌...
 సిగరెట్‌ మానేయాలనుకుంటే ఆ క్షణం నుంచే మొదలు పెట్టండి.
 తాగాలనిపించినప్పుడు చూయింగ్‌గమ్‌, చాక్లెట్స్‌ వాడండి
 ధూమపానం చేయాలనిపించినప్పుడు ఆ ధ్యాసను మరోవైపు మరల్చాలి.
 సిగరెట్‌పై ధ్యాస పోకుండా ధ్యానం, యోగా లాంటివి చేయండి.
పొగ తాగడాన్ని తగ్గించుకోలేక పోతే ఫార్మాకో థెరపీని చేయించుకోండి.
 వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ చేయించుకోవడం.
 
పదిమంది రోగుల్లో 8 మందికి నోటి కేన్సర్లే
ఎంఎనజేకు ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో అధిక శాతం పొగాకు ఉత్పత్తుల కారణంగానే ఉంటున్నాయి. పొగాకు వినియోగ దారుల్లో ఎక్కువగా నోటి కేన్సర్లు చోటు చేసుకుంటున్నాయి. 10 మంది కేన్సర్‌ రోగుల్లో 8మందికి పొగాకు ఉత్పత్తుల కేసులే ఉంటున్నాయి. ఇందులో 35 ఏళ్ల లోపు వారు అధికంగా ఉంటున్నారు. ధూమపానం వల్ల వచ్చే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం నిషేధించారు. కానీ అమలు మాత్రం సక్రమంగా జరగడం లేదు. పొగాకు ఉత్పత్తుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ధూమపానం మానివేయాలి. దీనివల్ల పుట్టబోయే పిల్లలు ముప్పు బారినుంచి బయటపడుతారు.
- డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎనజే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌