ఆరోగ్యం ‘పొగ’బారిపోతోంది!

30-05-2018: కేన్సర్లలో మూడో వంతు పొగాకు కారణంగా తలెత్తేవే! పొగాకు వాడకం వల్ల కేన్సర్‌ అభివృద్ధి చేసే కణాలలో త్వరితంగా మార్పులు జరుగుతాయి. దాంతో ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లతో పాటు, హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులు కూడా వేధిస్తాయి. ‘వరల్డ్‌ నో టొబాకో డే’ సందర్భంగా పొగాకు వాడకం గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా హృద్రోగాలు, శ్వాసకోస వ్యాధులు, కేన్సర్ల మూలంగా సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువ శాతం పొగాకు వాడకం మూలంగా జరిగేవే! మరీ ముఖ్యంగా పొగాకు వాడకం వల్ల కొరొనరీ హార్ట్‌ డిసీజెస్‌, గుండెపోటు, పెరిఫెరల్‌ వ్యాస్క్యులర్‌ డిసీజ్‌లు బాధిస్తాయి. పొగాకు వాడకం వల్ల గుండె, ఊపిరితిత్తులు వ్యాధులకు గురవుతాయనీ, వాటిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయనీ అవగాహన లేకపోవడం మూలంగా ఎంతోమంది పొగాకు కారక వ్యాధులకు గురవుతున్నారు.
 
పొగాకు వాడకం - కార్డియోవాస్క్యులర్‌ డిసీజెస్‌
గుండె సంబంధిత వ్యాధులతో మరణాల్లో 12% ప్యాసివ్‌ స్మోకర్లే! కార్డియో వాస్క్యులర్‌ మరణాలకు కారణాల్లో అధిక రక్తపోటు తర్వాతి స్థానం పొగాకుదే! కాబట్టి పొగ తాగేవారితోపాటు ఆ పొగకు పరోక్షంగా గురయ్యేవారు కూడా జాగ్రత్త పడాలి. పొగాకు వాడేవారిలో కచ్చితంగా కొన్ని లక్షణాలుంటాయి. అవి తీవ్రమైన వ్యాధిని సూచించేవి కూడా కావచ్చు. కాబట్టి ధూమపాన ప్రియులు ఈ కింది లక్షణాలను అలక్ష్యం చేయకూడదు.
 
ఊపిరి అందకపోవడం: ఇది ‘ఎంఫిసీమా’ అనే గుండె జబ్బుకు సూచన.
ఛాతీలో నొప్పి: గుండెకు సరిపడా రక్తప్రసారం జరగకపోవడం వల్ల తలెత్తే ‘యాంజైనా పెక్టోరిస్‌’. 
గొంతు బొంగురు: మింగడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం నోరు, లారింక్స్‌ కేన్సర్లకు సూచన. 
మూత్రంలో రక్తం: నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పోతుంటే ‘బ్లాడర్‌ కేన్సర్‌’గా భావించాలి.
ఇవే కాకుండా అకారణంగా బరువు తగ్గినా, పొత్తి కడుపులో నొప్పి వేధిస్తున్నా, నడుస్తున్నప్పుడు కాళ్లలో తలెత్తే నొప్పి విశ్రాంతిగా ఉన్నప్పుడు లేకున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.