సార్కోమా కేన్సర్లకు సర్జరీ, కీమోలతో సంపూర్ణ వైద్యం

21/01/14

కేన్సర్లు అందరికీ శరీరపు అంతర్భాగాల్లోనే వస్తాయని కాదు. కొన్ని  రకాల కేన్సర్లు శరీరపు ఉపరిభాగానికే పరిమితమై వస్తాయి.  వీటిలో ఎముకలకు సంబంధంలేకుండా మెత్తని కణజాలంలో వచ్చే వాటిని సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా అంటారు. మిగ తా కేన్సర్‌లతో పోలిస్తే ఇవి కాస్త నిదానంగా పెరుగుతాయి. అందువల్ల  ఇవి ఇతర  కేన్సర్లంత ఎక్కువ ప్రమాదకరం కాదు. అందుకే,  వైద్య చికిత్సలతో ఇవి  పూర్తిగా నయమైపోయే అవకాశాలే ఎక్కువ. కాకపోతే,   వ్యాధి  లక్షణాల ఆధారంగా సమస్యను ముందే గుర్తించి వెంటనే వైద్య చికిత్సలకు వెళితే  ఈ కేన్సర్ల నుంచి  మరింత  వేగ ంగా విముక్తి పొందే అవకాశాలు ఉంటాయంటున్నారు, ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్‌ సిహెచ్‌  మోహనవంశీ....
 
ఎముకల్లోంచి వచ్చే క్యాన్సర్‌ కణుతుల్ని కార్సినోమాలుగా, ఎముక కాని మెత్తని కణజాలంలోంచి వచ్చే కణుతుల్ని సాఫ్ట్‌ టిష్యూ సార్కోమాలుగా పిలుస్తాం.ఆ ఈ మెత్తని కణజాలం ఎముక కాని, మిగతా శరీర భాగాలన్నిటిలో అంటే కొవ్వు, కండరాలు, నరాలు, ఫైబ్రస్‌ టిష్యూస్‌ (ఇంటర్‌ కనెక్టింగ్‌), రక్తనాళాలు, చర్మం కింద ఉండే లోతైన కణజాలం వీటన్నిటిలోనూ సార్కోమా కణుతులు రావచ్చు. ఈ కణజాలం మెద డులోనూ, గుండె పక్కన, శ్వాసకోశాలు, కిడ్నీలు, లివర్‌ ఇలా శరీరంలోని కీలక భాగాలతో పాటు శరీరమంతా ఉంటుంది. కాకపోతే ఈ సార్కోమా కణుతులు కాళ్లూ, చేతుల్లో ఎక్కువగా కనపడతాయి. అయితే, ఛాతీ, వీపు, తల, మెడ, పొట్ట ఈ భాగాల్లో వచ్చే కణుతులు కూడా తక్కువే మీ కాదు. సార్కోమా కణుతుల్లో పెద్దవారిలో వచ్చేవి, చిన్నవారిలో వచ్చేవి అంటూ రెండు విభాగాలుగా తీసుకోవచ్చు. 

పెద్దవారిలో వచ్చే కారణాలు

రేడియేషన్‌కు గురైన వారిలో ఈ కణుతులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రొమ్ము కేన్సర్‌ కారణంగా గానీ లింఫోమా కేన్సర్‌ కారణంగా గానీ, ఎవరైనా అంతకు ముందు రేడియేషన్‌ థె రపీ తీసుకుని ఉంటే అది ఈ కణతులు రావడానికి కారణం కావచ్చు. ఇప్పుడంటే నిక్కచ్చిగా క్యాన్సర్‌ కణుతుల మీదే ప్రసరించే రేడియేషన్‌ థెరపీలు వచ్చాయి. ఒకప్పుడు ఈ విధానం లేదు. అందుకే పాతరోజుల్లో రేడియేషన్‌ తీసుకున్న వారి మీద ఈ దుష్ప్రభావం పడే అవకాశం కొంత మేరకు ఉంది. అయితే, పాత విధానంలో రేడియేషన్‌ తీసుకున్న 10 లేదా 15 ఏళ్ల తరువాతే కొందరిలో ఈ కార్సినోమా కణుతులు ఏర్పడే వీలు ఉంటుంది. అలాగే న్యూక్లియర్‌ ప్రభావాలకు గురయ్యే వారిలో కూడా ఈ కణుతులు ఏన్పడే అవకాశం ఎక్కువ. అయితే రేడియేషన్‌లో ఆధునిక విధానాలు ప్రవేశించాక ఈ దుష్ప్రభావాలు బాగా తగ్గాయి. కొందరిలో రొమ్ము కేన్సర్‌కు సర్జరీ జరిగిన తరువాత లింఫ్‌ భాగంలో వాపు వస్తుంది. అలాంటి వారిలో లింఫాజియో సార్కోమా వచ్చే అవకాశం ఉంది. గాయాలకూ, సార్కోమా కణుతులకు సంబంధం లేదు గానీ, అయినా, బలంగా గాయాల పాలైనవారిలో కొందరు ఈ సార్కోమా కేన్సర్‌ బారిన పడటం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వినైల్‌ క్లోరైడ్‌ను ఉపయోగించే ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో పనిచేసే వారిలో, ఆర్సినిక్‌ పరిశ్రమల్లో పనిచేసే వారి లివర్‌లో సార్కోమా కణుతులు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే క్రిమిసంహారక మందులు, హెర్పిసైట్స్‌, వీట్‌కిల్లర్స్‌, ఇన్‌సెక్టిసైట్స్‌ తయారు చేసే కంపెనీ ఉద్యోగుల్లో కూడా ఈ కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యకారణం డయాక్సిన్‌, ఫినాక్సి అసిటిక్‌ యాసిడ్‌ల వినియోగమే. వీటికి తోడు కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒళ్లంతా చిన్నచిన్న కణుతులు ఏర్పడే మల్టిపుల్‌ న్యూరో ఫైబ్రోమైటోసిస్‌ ఉన్నవారిలో కూడా ఈ సార్కోమా కణుతులు ఏర్పడే ప్రమాదం ఉంది. పుట్టుకతో వచ్చే కొన్ని రకాల సిండ్రోమ్‌ వ్యాధుల్లో కూడా ఈ కణుతులు ఏర్పడవచ్చు. డిఎన్‌ఏ లో కొన్ని రకాలు జన్యువులు ఉంటాయి. వాటిలో ఆంకో జీన్స్‌, ట్యూమర్‌ సప్రెసార్‌ జీన్స్‌ అనీ ఉంటాయి. ఆంకో జీన్స్‌ కణజాల విభజనన ను ప్రేరేపిస్తాయి. ట్యూమర్‌ సప్రెసార్‌ జన్యువులేమో ఆ కణజాలం విభజన వేగాన్ని తగ్గిస్తాయి. అయితే సప్రెసార్‌ జన్యువుల కన్నా ఆంకోజీన్స్‌ ఎక్కువ తీవ్రతతో పనిచేసినప్పుడు సార్కోమా కణుతులు ఏర్పడే స్థితి ఏర్పడుతుంది. 

కణుతుల్ని గుర్తించేదెలా?

సార్కోమా కేన్సర్లు ఉన్న కుటుంబ నేపథ్యం ఉన్న వారిలో ఈ కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే జన్యుపరమైన కారణాలతో కూడా ఈ కేన్సర్లు రావచ్చు. ఆంకోజీన్‌ విభజన వేగాన్ని పెంచి ట్యూమర్‌ సప్రెసార్‌ జీన్స్‌ చర్యల్ని అణచివేయడం వల్లే ఏ కేన్సర్‌ అయినా తలెత్తుతుంది. సాఫ్ట్‌టిష్యూ సార్కోమా కేన్సర్లు రావడానికి ఇదే ప్రధాన కార ణం. ఏమైనా సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా కేన్సర్లు ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవాళ్లు గానీ, పూర్వీకుల్లో పెద్ద పేగు కేన్సర్లు ఉన్న వారు గానీ, డిస్మాయిడ్‌ ట్యూమర్లు ఉన్నవారు గానీ, జన్యుపరమైన సిండ్రోమ్‌ సమస్యలు ఉన్నవారు గానీ, డాక్టర్‌ తరుచూ సంప్రదిస్తూ, వారు సూచించే కాలవ్యవధిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. 

ఇవీ లక్షణాలు

సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా కణుతులు సాధారణ ంగా కాళ్లూ, చేతుల్లోనే ఎక్కువగా వస్తాయి. అయితే మిగతా భాగాల్లో రావని కూడా కాదు. ఒక కణితి మొదలై కొద్ది వారాలనుంచి కొద్ది నెలల్లోపే పెద్దదైపోవడం, నొప్పితో గానీ, నొప్పి లేకుండా గానీ, కణితి పెరుగుతూ వెళ్లడం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ కణుతులు కాళ్లూ చేతుల్లోనే కాకుండా, పొట్టలోపలి భాగాల్లో కూడా రావచ్చు. కొందరిలో ఇవి మెదడులోనూ రావచ్చు. నిజానికి, సాఫ్ట్‌టిష్యూలు శరీరమంతా ఉంటాయి. అందుకే కణుతులు కూడా శరీరంలో ఎక్కడైనా రావచ్చు. కడుపులో నొప్పి, వాంతులు, మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

వైద్య పరీక్షలు

సార్కోమా కణుతుల్ని గుర్తించడానికి ముక్కపరీక్ష (కోర్‌ నీడిల్‌ బయాప్సి) అవసరమవుతుంది. ఈ విషయంలో ఫైన్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌ సైటాలజీ అంతగా ఉపయోగపడ కపోవచ్చు. ఎందువల్ల అంటే సాఫ్ట్‌ టిష్యూ సార్కోమాలో ట్యూమర్‌ టైప్‌, ట్యూమర్‌ గ్రేడ్‌ తెలుసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల ద్వారా ఆది సార్కోమా కేన్సరేనా కాదా అని తెలుసుకోవడం మాత్రమే కాకుండా, అది ఏ రకానికి చెందినది, ఎంత వేగంగా పెరుగుతోంది అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమవుతుంది. అందుకే ఇక్కడ కోర్‌ నీడిల్‌ బయాప్సి అవసరమవుతుంది. ఒకవేళ కణితి మరీ చిన్నదైతే, ఎక్సిషనల్‌ బయాప్సి అంటే ట్యూమర్‌ను దూరంగా తీసివేయవలసి ఉంటుంది. ఒకవేళ ట్యూమర్‌ దాకా వెళ్లడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇన్‌సిషనల్‌ బయాప్సి చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న ఓపెన్‌ సర్జరీ ద్వారా ముక్కతీసి పరీక్షకు పంపించాలి. సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా కణితి గ్రేడింగ్‌ చేయడం, అది ఎంత వేగంగా పెరుగుతోంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ సార్కోమా ఏ కణజాలం నుంచి అంటే రక్తనాళాలు, కనెక్టివ్‌ టిష్యూ, నరాలు, కండరాలు వీటిలో ఎక్కడి నుంచి ఏర్పడిందో తెలుసుకోవడ ం చాలా ముఖ్యం. దీనికి ఐహెచ్‌సి (ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ) అనే పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ కణుతుల విషయంలో సైటో జెనిటిక్స్‌ పరీక్ష కూడా ముఖ్యం. క్రోమోజోమ్స్‌ను పరీక్షించడం ద్వారా వాటి స్థితిని తెలుసుకోవచ్చు అలాగే ఫిష్‌ టెస్ట్‌, ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు చేయిస్తే, కణితి టైప్‌ను, దాని గ్రేడ్‌ను మరింత స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. 

స్టేజింగ్‌

ఒకసారి అది సార్కోమాయే నని గుర్తించిన త రువాత ఆ కణితి పుట్టిన చోటే ఉందా? మరె క్కడికైనా పాకిందా? అనే విషయాలు తెలుసుకోవాలి? ఒకవేళ అది అక్కడే ఉండిపోయినా అది ఎంత పెద్దదయ్యింది? ఏ భాగాలదాకా వ్యాపించింది అని తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌ చేయవలసి ఉంటుంది. సీటీ స్కాన్‌ తరువాత, సీటీ గైడైడ్‌ బయాప్సి చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే సీటీస్కాన్‌తో పాటే ఈ బయాప్సి కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఎంఆర్‌ఐ టెస్ట్‌ ద్వారా ఈ వివరాలు మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఆలా్ట్రసౌండ్‌ పరీక్షలు, కాళ్లూ చేతుల్లో కాకుండా శరీరం లోపలి భాగాల్లో ఎక్కడైనా పాకిందేమో తెలుసుకోవడానికి పెట్‌స్కాన్‌ బాగా ఉపయోగపడుతుంది.
 స్టేజింగ్‌లో టిఎన్‌ఎమ్‌ అని ఉంటాయి. కణతి సైజుఎలా ఉంది? లింఫ్‌నోడ్స్‌లు ఏమైనా ప్రభావితమయ్యాయా? మెటాస్టేసిస్‌ అంటే కేన్సర్‌ కణాల విస్తృతి ఎలా ఉంది? అన్న విషయాలను బట్టి స్జేజింగ్‌ ఉంటుంది. కాకపోతే, ఇతర కేన్సర్లలా సార్కోమా కేన్సర్లతో లింఫ్‌నోడ్స్‌ ప్రభావితం కావడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. సాధారణంగా ఈ కేన్సర్లు లింఫాటిక్స్‌ ద్వారా కాకుండా రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు పాకుతాయి. 

వైద్య చికిత్సలు 

సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా చికిత్సలో అతి కీలకమైనది సర్జరీ. సార్కోమా కణితిని పూర్తిగా తొలగించడం సర్జరీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క ణితిని దాని చుట్టూ ఒకటి రెండు సెంటీ మీటర్లతో సహా తీసివేయవలసి ఉంటుంది. కాళ్లూ చేతుల్లో ఈ సార్కోమా కణుతులు వస్తే ఒకప్పుడూ ఆ కణితి ఉన్న ఆ భాగం దాకా తీసివేసే వారు. దానికి ఆ కణితి ఎంత దూరం విస్తరించిందో తెలుసుకునే సరియైన పరీక్షా విధానాలు అప్పుడు లేకపోవడమే కారణం దీనివల్ల హఠాత్తుగా అంగవైకల్యం వచ్చిపడేది. ఇప్పుడు అలా కాదు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ద్వారా కణితిని స్పష్టంగా గుర్తించి, అంత వరకే తీసివేసే అవకాశం ఇప్పుడుంది. ఒకవేళ కణితి మరీ పెద్దగా ఉంటే కీమోథెరపీ ద్వారా ఆ సైజ్‌ను తగ్గించి ఆ తరువాత సర్జరీ చేయడం జరుగుతోంది. సర్జరీ తరువాత ఆ కణితి స్టేజ్‌, గ్రేడ్‌ను అనుసరించి అవసరమైతే కీమోథెరపీ, రేడియో థెరపీ కూడా ఇస్తాం. ఇటీవలి కాలంలో టార్గెటెడ్‌ థెరపీలో భాగా ఫ్యాజోఫెనిబ్‌ అనే చికిత్స కూడా చేస్తున్నాం. దీనిద్వారా సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా కణుతులకు మరింత సమర్ధవంతమైన వైద్యం లభిస్తోంది. 

పిల్లల్లో....

చిన్న పిల్లల్లో కూడా ఈ సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా కణుతులూ వస్తూ ఉంటాయి. వీటిని రాబ్డో మయో సార్కోమా అని, నాన్‌-రాబ్డో మయో సార్కోమా అని రెండు భాగాలుగా చూస్తాం. శరీరంలో ఏదైనా ఒక భాగంలో క ణితి ఏర్పడటం, లేదా వాపు రావడం, నొప్పి లేకుండానే ఇతర భాగాలకు వ్యాపించడం, రోజూ జ్వరం రావడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకసారి వ్యాధి నిర్ధారణ అయితే వైద్య చికిత్సలు మొదలవుతాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో వచ్చే ఈ సార్కోమా కేన్సర్లకు దీర్ఘకాలిక చికిత్సలు అంటే 40 నుంచి 48 వారాల పాటు కొనసాగుతూ ఉంటాయి. సర్జరీ చేయడానికి వీలయ్యే భాగాల్లోనే ఈ కణుతులు ఉంటే సర్జరీ చేసి ఆ తరువాత కీమోథెరపీ కూడా ఇస్తాం. ఒకవేళ సర్జరీ వీలుకాని భాగాల్లో ఉంటే, కీమో థెరపీ, రేడియేషన్‌ ద్వారా చికిత్సలు కొనసాగించవలసి ఉంటుంది. ఏమైనా మిగతా కేన్సర్లతో పోలిస్తే వీటి లో ఇతర భాగాలకు వ్యాపించే గుణం తక్కువే. అందుకే సమస్యను ముందే గుర్తించి సత్వరమే వైద్య చికిత్సలు తీసుకుంటే, సమస్యనుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.
డాక్టర్‌ సిహెచ్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌
ఒమేగా హాస్పిటల్స్‌, ఎం.ఎల్‌.ఏ కాలనీ
రోడ్‌ నం: 12, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌
ఫోన్స్‌: 9848011421