అరుదే!.. అయినా చికిత్స సులువే!

26-03-2018: ఇర్ఫాన్‌ ఖాన్‌ అత్యంత అరుదైన ‘న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌’ బారిన పడ్డారు. ఈయన్నే కాదు... యాపిల్‌ సంస్థ సి.ఈ.ఓ ‘స్టీవ్‌ జాబ్స్‌’ను కబళించిన వ్యాధి కూడా అదే! క్లిష్టమైన ఈ కేన్సర్‌ మూలాన్ని గుర్తిస్తే చికిత్స సులువే!

కేన్సర్‌ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చు. ఎందుకొచ్చింది? అనే ప్రశ్నకు సమాధానం లేకపోయినా, వ్యాధిని వీలైనంత త్వరగా కనిపెట్టి, సమర్థంగా చికిత్స అందించగలిగితే నయం చేయటం అసాధ్యమేమీ కాదు. అది ఏ రకానికి చెందినదైనా, ఎంత అరుదైనదైనా ఆధునిక వైద్య చికిత్సల సహాయంతో ఆయుర్దాయాన్ని పెంచే వీలుంది. అయితే చిక్కంతా వ్యాధి లక్షణాల్లోనే ఉంది. కొన్ని కేన్సర్లలో లక్షణాలు వ్యాధి ముదిరేవరకూ నిద్రావస్థలో ఉంటే, మరికొన్నిట్లో అవి నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటాయి.
 
ఇంకొన్ని కేన్సర్లలో చివరి దశ వరకూ లక్షణాలే కనిపించకపోవచ్చు. ఎక్కువ శాతం లక్షణాలు వ్యాధిని తప్పుదోవ పట్టిస్తూ కూడా ఉంటాయి. కాబట్టి ఏ చిన్న సుస్తీని కూడా అలక్ష్యం చేయకూడదని న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ రుజువు చేస్తోంది. ఇది ఈ వ్యాధికున్న ఒక మంచి గుణంగానే భావించాలి. ఎందుకంటే... ఎంత త్వరగా వ్యాధిని గుర్తిస్తే అంత త్వరగా దాన్ని సమూలంగా నయం చేసే వీలుంటుంది.
 
లక్షల్లో ముగ్గురికి
న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ లక్షమందిలో ముగ్గురు నుంచి ఐదుగురికి వస్తుంది. ఇది మిగతా కేన్సర్లకంటే భిన్నమైనది. అవి కణజాలాల్లోని కణాల్లో తలెత్తితే, న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ నాడులు, అంతఃస్రావ గ్రంథుల ఎండోక్రైన్‌ కణాల్లో వస్తుంది. కార్సినోమా అంటే కేన్సర్‌. కానీ కొన్ని కణుతులు కేన్సర్‌ కాకపోయినా దాన్ని పోలి ఉంటాయి.
 
అలాంటివాటిని కార్సినాయిడ్‌ అంటారు. అయితే కేన్సర్‌ అయినా, కాకపోయినా.... ఈ కణుతులు నరాలు విస్తరించుకుని ఉండే శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే సాధారణంగా ఊపిరితిత్తులు, పొట్ట, పేగులు, పిత్తాశయం, ఎపెండిక్స్‌... మొదలైన చోట్లే ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. ఇవి ఎంతో చిన్నవిగా ఉండి, నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. కణితి ఏర్పడటానికీ లక్షణాలు బయల్పడటానికి కొన్ని దశాబ్దాలూ పట్టవచ్చు.
 
లక్షణాలూ భిన్నమే!
ఈ వ్యాధికారక లక్షణాలు కణితి తలెత్తిన ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. గ్రంథుల స్రావాలు (సెరటోనిన్‌, బ్రాడీకినిన్‌, హిస్టమిన్‌, ప్రోస్టాగ్లాండిన్స్‌) కణుతుల ద్వారా అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ ఉంటాయి. దాంతో విడుదలయ్యే గ్రంథుల స్రావాల్ని బట్టి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. వాటిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇవి!
ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు
విరేచనాలు
మెడ, ముఖం ఎర్రగా మారడం
శ్వాస తీసుకోలేకపోవడం
గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం
పొట్టలో శబ్దాలు, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం
దగ్గు, ఆయాసం
బరువు పెరగడం, లేదా తగ్గడం
రక్తపోటు పెరగడం, తగ్గడం
 
ప్రాథమిక కణితిని కనిపెట్టడమే కీలకం!
మిగతా కేన్సర్లలా న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ ఒక శరీర భాగానికే పరిమితమై ఉండదు. ఒకే సమయంలో పలుచోట్ల కణుతులు ఒకదాని వెంట ఒకటిగా తలెత్తుతాయి. వీటన్నిటికీ మూలమైన ప్రాథమిక కణితి శరీరంలో ఎక్కడుందో కనిపెట్టడమే కీలకం. దాన్ని కనిపెట్టి దాంతోపాటు, మిగతా కణుతులన్నిటినీ తొలగించగలిగితే ఈ వ్యాధిని తేలికగానే నయం చేయవచ్చు. అలాకాకుండా ప్రాథమిక కణితిని వదిలేసి మిగతా వాటిని తొలగిస్తే కేన్సర్‌ అంతర్లీనంగా పాకుతూ తిరిగి సరిదిద్దలేనంత మొండిగా మారవచ్చు. కాబట్టి ఈ రకమైన కేన్సర్‌ చికిత్సలో ప్రాథమిక కణితిని కనిపెట్టడమే ఎంతో ముఖ్యమైన అంశం.
 
పరీక్షలతో నిర్ధారణ
న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌ అనేది కేన్సర్‌కు చెందినదా, కాదా? అనేది నిర్ధారించుకోవటంతోపాటు, ప్రాథమిక కణితిని కనిపెట్టడం కోసం కొన్ని పరీక్షలున్నాయి. అవేంటంటే....
కెఐ - 67: బయాప్సీ చేసిన తర్వాత చేసే పరీక్ష ఇది. కేన్సర్‌ కణాల తత్వం (త్వరితంగా విస్తరించేదా, లేక నెమ్మది స్వభావం కలిగినదా?) ఈ పరీక్షతో తెలుస్తుంది. కణితిలో విచ్ఛిత్తి చెందుతున్న కణాల సంఖ్యను బట్టి కణితి ఎంత త్వరగా పెరుగుతుందనేది వైద్యులు అంచనా వేయగలుగుతారు. ఈ బయాప్సీ ఫలితం 2% కంటే తక్కువ ఉంటే, అది కేన్సర్‌ కాదని అర్థం. ఇలాంటి కణితిని సర్జరీ చేసి తొలగిస్తే దాని వల్ల వచ్చిన అస్వస్థతలన్నీ సద్దుమణుగుతాయి. అలాకాకుండా ఫలితం 2% కంటే ఎక్కువ ఉంటే కేన్సర్‌గానే భావించాలి.
మూత్రం, రక్త పరీక్షలు: ఈ పరీక్షల ద్వారా విడుదలయ్యే గ్రంథుల స్రావాల పరిమాణాన్ని బట్టి కూడా కేన్సర్‌ అవునో కాదో నిర్థారించుకోవచ్చు.
డొటా నాక్‌ స్కాన్‌: కేన్సర్‌ కేంద్రకాన్ని ఈ పరీక్షతో గుర్తించవచ్చు. ప్రాథమిక కణితిని కనిపెట్టి సర్జరీతో తొలగించగలిగితే వ్యాధిని నయం చేయటం తేలికవుతుంది.
ప్రాణాంతకమైనవి రెండే!
మిగతా వాటితో పోలిస్తే ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌ వచ్చే న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ తీవ్రమైనది. పేగులు, పాంక్రియా్‌సల నుంచి తలెత్తే కేన్సర్‌లకు సర్జరీతో కణుతులను తొలగించి, కొంత కీమో, మరికొంత లుటీషియం థెరపీ, నోటి మాత్రలు ఇస్తే తేలికగా నయమవుతాయి.
 
నయం చేయటం అసాధ్యమేమీ కాదు!
ఎంత అరుదైనదైనా, మిగతా కేన్సర్లతో పోలిస్తే న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ని నయం చేయడం సులువే! నాలుగో దశకు చేరుకున్నా, ప్రాథమిక కణితినీ, అనుబంధంగా ఉన్న చిన్న చిన్న కణుతులనూ సర్జరీతో తొలగించి, కీమో థెరపీ ఇస్తే వ్యాధి నయమవుతుంది. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
 
 
స్టీవ్‌ జాబ్స్‌కి వచ్చిందిదే!
1999 నుంచి 2003 వరకూ, మూత్రపిండాల్లో తరచుగా రాళ్లు కనిపిస్తూ ఉండడంతో స్కానింగ్‌ కోసం వెళ్లిన స్టీవ్‌ జాబ్స్‌కు, ప్యాంక్రియా్‌సలో కణితి ఉన్నట్టు తెలిసింది. 2004లో సర్జరీతో కణితిని తీయించేటప్పటికే చాలా సమయం వృథా అయింది. ఆ తర్వాత కేన్సర్‌ చికిత్సను ఇష్టపడని స్టీవ్‌, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయించి, స్పెషల్‌ డైట్‌ను అనుసరిస్తూ, మరో తొమ్మిది నెలల సమయాన్ని వృథా చేశారు. ఆ లోగా కేన్సర్‌ కాలేయానికి కూడా పాకింది. కాలేయంలో 3 కేన్సర్‌ కణుతులు తయారయ్యాయి. తిరిగి తర్జనభర్జన పడిన తర్వాత 2009లో స్టీవ్‌ కాలేయ మార్పిడి సర్జరీ చేయించుకున్నారు. కాలేయ మార్పిడి తర్వాత కూడా స్టీవ్‌ తరచుగా అస్వస్థతకు లోనవుతూ ఉండేవారు. పరీక్షల్లో కేన్సర్‌ కాలేయం, ఎముకలు, ఇతర శరీరావయవాలలోకి పాకినట్టు వెల్లడైంది. అప్పటికే చికిత్సను ఆలస్యం చేసి తీవ్ర అనారోగ్యంపాలైన స్టీవ్‌, చివరికి అక్టోబరు5 2011న ప్రాణాలొదిలారు.
 
లుటీషియం థెరపీ
మన దేశంలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఈ థెరపీని కనిపెట్టింది. ఈ థెరపీకి ముందువరకూ కేన్సర్‌ కణుతులను తొలగించి కీమో థెరపీ ఇవ్వటం వరకే పరిమితమయ్యేవాళ్లు. కానీ టుటీషియం థెరపీ కనుగొన్న తర్వాత కేన్సర్‌ కణాలను నేరుగా, సమర్థంగా అంతమొందించే వీలు కలిగింది.
 
దాంతో ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం జరగదు. ఫలితంగా రోగి కీమోథెరపీతో నీరసపడినట్టు ఈ థెరపీలో జరగదు. అదనంగా కీమోథెరపీలో ఉండే దుష్ప్రభావాలు (జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం) లుటీషియం థెరపీలో ఉండవు. ఈ థెరపీకున్న మరో ప్రయోజనం, కేన్సర్‌ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు పాకకుండా నియంత్రించడం. ‘డోటాటేట్‌’ అనే రసాయనంతో కలిపి ఇవ్వడం ద్వారా కేన్సర్‌ కణితి ప్రదేశాన్ని గుర్తించి, నేరుగా ఆ కణాలనే నాశనం చేసే వీలు కలుగుతుంది.
 
 
డాక్టర్‌ ఎవిఎస్.సురేష్‌,
కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌
హెమటాలజిస్ట్‌, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.