క్యాన్సర్‌కు పంచ్‌ ఈ థెరపీ

ఆంధ్రజ్యోతి,12-9-2016: క్యాన్సర్‌ చికిత్సలో రేడియేషన్‌ పాత్ర ఎంతో కీలకం. అయితే క్యాన్సర్‌ కణాలతోపాటు వాటి చుట్టూ ఉన్న ఆరోగ్య కణాలు కూడా నాశనమవుతూ ఉండటమే ఈ చికిత్సకున్న ప్రధాన ప్రతికూలత. ఈ సమస్యను అధిగమించటం కోసం మెరుగైన సాంకేతిక పరికరాలు రూపొందుతూ ఉంటాయి. అలా అందుబాటులోకొచ్చిన అత్యాధునిక చికిత్సా విధానమే... ‘టోమో థెరపీ’. ఈ చికిత్స గురించి డాక్టర్‌ పి.విజయ్‌ ఆనంద్‌ రెడ్డి మరిన్ని వివరాలను వెల్లడించారు.

 
క్యాన్సర్‌ గడ్డ పరిమాణం, ఆకారం, ప్రదేశాలనుబట్టి సర్జరీకి ముందు లేదా తర్వాత రేడియేషన్‌ అవసరమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీతో పనిలేకుండా ఒక్క రేడియేషన్‌తోనే క్యాన్సర్‌ను సమూలంగా నయం చేసే వీలు కూడా ఉంటుంది. దాదాపు 80% మంది రోగులకు ఇలా ఏదో ఓ సందర్భంలో రేడియేషన్‌ తీసుకోవటం తప్పనిసరి. కాబట్టి రేడియేషన్‌ అందించే మెరుగైన పరికరాల గురించిన పరిశోధన గత 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ పరిశోధన ప్రథమోద్దేశం...క్యాన్సర్‌ కణాలను నాశనం చేయటం, పక్కనున్న ఆరోగ్యవంతమైన కణాలను సంరక్షించటం. అయితే ఇప్పటివరకూ వాడుకలో ఉన్న రేడియేషన్‌ పరికరాలన్నీ క్యాన్సర్‌ కణాలతోపాటు పక్కనున్న కణాలకు అంతో ఇంతో నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. ఫలితంగా రోగి కోలుకునే వేగం కుంటుపడుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే సూటిగా క్యాన్సర్‌ కణాలే లక్ష్యంగా చికిత్సనందించాలి. అలాంటి మెరుగైన చికిత్సా విధానమే ‘టోమో థెరపీ’. ఈ విధానానికి ఎన్నో ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
కీలకమైన ‘కన్‌ఫర్మిటీ ఇండెక్స్‌’ 
క్యాన్సర్‌ గడ్డను బయటికి తీసి దానికే సూటిగా రేడియేషన్‌ అందించే వీలుంటే వ్యాధిని నయం చేయటం ఎంతో సులభం. కానీ క్యాన్సర్‌కు అలాంటి సౌలభ్యం లేదు. కాబట్టే వ్యాధి సోకిన ప్రదేశానికి నేరుగా చేరుకుని క్యాన్సర్‌ కణాల్ని నాశనం చేసే వీలున్న రేడియేషన్‌ మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే రేడియేషన్‌ ఇచ్చే క్రమంలో ఆరోగ్యవంతమైన కణాలు నాశనమవకుండా సంరక్షించలేకపోతున్నాం. ఇందుకు కారణం...ఆ కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్‌ కణాలే నాశనమయ్యేలా ఎంత సమయంపాటు, ఏ కోణంలో, ఎంత మోతాదులో రేడియేషన్‌ అవసరమో లెక్కించే వీలు లేకపోవటమే! ఇలా లెక్కించే విధానమే ‘కన్‌ఫర్మిటీ ఇండెక్స్‌’. టోమోథెరపీలో ఈ వెసులుబాటు అత్యధికంగా ఉంది.
 
సిటి స్కానర్‌లాంటిదే! 
రేడియేషన్‌ చికిత్స అందించే పరికరాలు భారీగా ఉంటాయి. ఆ పరికరాన్ని చూడగానే రోగి మరింత భయానికి లోనవుతాడు. టోమోథెరపీలో రేడియేషన్‌ అందించే పరికరం సిటి స్కానర్‌లా ఉంటుంది. సిటి స్కానర్‌లాగే పని చేస్తుంది కూడా! అంటే... క్యాన్సర్‌ సోకిన ప్రదేశాన్ని ఫొటో తీస్తూనే అత్యధిక మోతాదులో రేడియేషన్‌ను అందిస్తుంది.

సూటిగా, సమర్ధంగా 
మిగతా పరికరాలతో పోలిస్తే టోమోథెరపీలో అందించే క్యాన్సర్‌ చికిత్స సూటిగా, సమర్ధంగా ఉంటుంది. ఉదాహరణకు మెదడు, వెన్నుపాము క్యాన్సర్‌కు ప్రస్తుతమున్న పరికరాలతో క్రేనియో స్పైనల్‌ రేడియేషన్‌ అందించాలనుకుంటే అవి మెదడు, సర్వైకల్‌ స్పైన్‌, టార్సల్‌ స్పైన్‌, లంబార్‌ స్పైన్‌...ఇలా ముక్కలుగా విడగొట్టుకుంటుంది. టోమోథెరపీలో ఒకే ఒక్క సిటింగ్‌లోనే ఈ భాగాలన్నిటికీ ఒకే సమయంలో రేడియేషన్‌ను అందించగలదు.
 
ఒకే సమయంలో వేర్వేరు చోట్ల 
శరీరంలో వేర్వేరు ప్రదేశాలకు పాకిన క్యాన్సర్‌ గడ్డలకు టోమోథెరపీ ద్వారా ఒకే సమయంలో చికిత్స చేసే వీలుంది. ఇప్పటివరకూ అనుసరిస్తున్న రేడియేషన్‌ చికిత్సల్లో ఒక ప్రదేశంలో సోకిన క్యాన్సర్‌కు ఒకే సమయంలో చికిత్స ఇచ్చే పద్ధతి ఉంది. ఇలా విడతలవారీగా చికిత్స చేయటం వల్ల ఎంతో సమయం వృథా అవటంతోపాటు క్యాన్సర్‌ మరింత ముదిరిపోయే ప్రమాదం కూడా ఉంది. టోమోథెరపీతో ఈ సమస్య లేదు. ప్రైమరీ ట్యూమర్‌తోపాటు అక్కడినుంచి ఇతర శరీర భాగాలకు పాకిన క్యాన్సర్‌లను కూడా ఒకే సమయంలో చికిత్స చేయొచ్చు. రోగి పడుకున్న కౌచ్‌తోపాటు రేడియేషన్‌ అందించే గ్యాంట్రీ ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేయటం వల్లనే ఇంతటి సమర్ధమైన చికిత్స సాధ్యపడుతోంది. అలాగే ఒక్కో శరీర భాగంలో ఏర్పడే క్యాన్సర్‌ గడ్డలు ఒక్కో ఆకారంలో ఉంటాయి. కాబట్టి వాటి ఆకారానికి, సైజ్‌కి తగ్గట్టు ఈ పరికరం రేడియేషన్‌ మోతాదు, కోణాలను తనంతట తానే లెక్కించి సూటిగా క్యాన్సర్‌ కణాలే లక్ష్యంగా రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.
 
రేడియేషన్‌లో హెచ్చుతగ్గులు 
ఒక క్యాన్సర్‌ గడ్డకు సాధారణంగా 3 నుంచి 6 వారాల రేడియేషన్‌ అవసరం. చికిత్స ప్రారంభంలో లావుగా ఉన్న క్యాన్సర్‌ గడ్డ క్రమేపీ కుచించుకుపోయి చివరికి పూర్తిగా నాశనమవుతుంది. అంటే...ప్రారంభంలో ఎంత రేడియేషన్‌ ఇచ్చామో గడ్డ కుచించుకుపోయి చిన్నదిగా మారినప్పుడు కూడా అంతే రేడియేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న గామా నైఫ్‌, సైబర్‌ నైఫ్‌, ఎక్స్‌ నైఫ్‌ పరికరాలన్నీ మొదట్నుంచీ చివరివరకూ ఒకే మోతాదు రేడియేషన్‌ను విడుదల చేసేవే! టోమోథెరపీ చికిత్సా విధానంలో అందించే రేడియేషన్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు రేడియేషన్‌ పరికరంలోనే ఉన్న సిటి స్కానర్‌ ద్వారా క్యాన్సర్‌ గడ్డ సైజుని గమనిస్తూ అందుకు తగ్గట్టుగా రేడియేషన్‌ను తగ్గిస్తూ చికిత్స చేయొచ్చు. ఈ సౌలభ్యం వల్ల కుచించుకుపోయిన క్యాన్సర్‌ గడ్డ స్థానాన్ని భర్తీ చేసిన ఆరోగ్య కణాలను నాశనమవకుండా కాపాడుకోవచ్చు.
 
ప్రయోజనాలు బోలెడన్ని 
రేడియేషన్‌ అవసరం ఉన్న ఎలాంటి క్యాన్సర్‌ చికిత్సకైనా టోమోథెరపీని ఎంచుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎక్కువ పరిధితో కూడిన హోల్‌ బాడీ రేడియేషన్‌, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌, క్రేనియో స్పైనల్‌ రేడియేషన్‌లకు టోమోథెరపీ అత్యుత్తమమైన ప్రత్యామ్నాయం.
 
దుష్ప్రభావాలు తక్కువే! 
రేడియేషన్‌ తీవ్రతను బట్టి దాని దుష్ప్రభావాల్లో హెచ్చుతగ్గులుంటాయి. టోమోథెరపీలో ఎప్పటికప్పుడు ట్యూమర్‌ను గమనిస్తూ రేడియేషన్‌ను అందుకు తగ్గట్టు కుదించటం వల్ల దాని ప్రభావం కూడా తగ్గుతుంది. పొరపాటుకు అవకాశం ఉండదు. ఆరోగ్య కణజాలం దెబ్బతినే ప్రమాదం లేదు. ఈ ప్రయోజనాల వల్ల దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి. సాధారణంగా చిన్నపాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. అవి కూడా రేడియేషన్‌ ఇచ్చే ప్రదేశాన్ని బట్టి మారతాయి. పొత్తికడుపు దగ్గర రేడియేషన్‌ ఇస్తే విరేచనాలు, మూత్ర విసర్జనలో మంటలాంటి తాత్కాలిక లక్షణాలు కనిపించొచ్చు. మిగతా రేడియేషన్‌ పద్ధతుల్లో మెదడుకు చికిత్స చేస్తే వెంట్రుకలు రాలే సమస్య ఉంటుంది. కానీ టోమోథెరపీలో ఈ సమస్య ఉండదు.
 
టోమో థెరపీ అంటే? 
‘టోమో’ అనే గ్రీకు పదానికి స్లయిస్‌ అని అర్థం. రేడియేషన్‌ ఒకదాని వెంట మరొకటి స్లయి్‌సల రూపంలో ప్రసరిస్తుంది కాబట్టి ఈ రేడియేషన్‌ థెరపీకి ‘టోమో థెరపీ’ అనే పేరు పెట్టారు.
 
డాక్టర్‌.పి.విజయ్‌ ఆనంద్‌ రెడ్డి 
కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌ 
అపోలో హాస్పిటల్స్‌ 
హైదరాబాద్‌.