సత్వర చికిత్సే ఔషధం

14/07/15

ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధికి సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాధి నిర్థారణ పరీక్షలు, చికిత్స, మందుల కోసం అయ్యే ఖర్చులు సాధారణ ప్రజలకు తలకు మించిన భారమైపోయాయి. తాజా పరిశోధనలు ఈ పరిస్థితిలో మార్పు తెస్తుందంటున్నారు ఆస్ర్టేలియాకు చెందిన పరిశోధకులు, క్యాన్సర్‌ థెరప్యూటిక్‌  కంపెనీ సీఈఓ డాక్టర్‌. వార్‌విక్‌ టాంగ్‌. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.
 
పంచ దేశాలన్నీ క్యాన్సర్‌ మీద నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ దిశగా ఎన్నో పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. అయితే దీన్ని నిర్థారించేలోపే శరీరంలో వ్యాప్తి చెందటం క్యాన్సర్‌ వ్యాధి ప్రత్యేక లక్షణం. ఈ కారణంగానే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే వీలు లేకుండా పోతోంది. నాలుగో దశకు చేరుకున్న క్యాన్సర్‌ చికిత్సకు స్పందించదు. ఈ దశలో ఎన్ని మందులు వాడినా అవి క్యాన్సర్‌ కణ విచ్ఛిన్నతను అదుపు చేయలేకపోతున్నాయి. 
 

వ్యాధిని కనిపెట్టే ‘రక్త పరీక్ష’

ఈ ప్రతికూలతలను అధిగమించాలంటే శరీరంలో నిద్రాణ దశలోనే క్యాన్సర్‌ వ్యాధిని గుర్తించగలిగే నిర్థారణ పరీక్షలను కనిపెట్టాలి. ఈ దిశగా జరిపిన పరిశోధనల ఫలితమే ‘లిక్విడ్‌ బయాప్సీ’ పరీక్ష. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో కేవలం బ్లడ్‌ టెస్ట్‌ సహాయంతో క్యాన్సర్‌ ట్యూమర్‌ కణాలను, ఆ ట్యూమర్‌కు కారణమయ్యే ఎక్సోజోమ్‌ అనే కణాలను కనిపెట్టడం ద్వారా క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే అవకాశాన్ని ముందుగానే గుర్తించొచ్చు. దాంతో ఆ వ్యక్తులకు క్యాన్సర్‌ వ్యాధి బయటపడకముందే చికిత్సను మొదలుపెట్టి నిద్రాణ దశలో ఉన్న క్యాన్సర్‌ కారక మాలిక్యూల్స్‌ను తుదముట్టించవచ్చు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని మందులతో పొడిగించే వీలుంది. 2002లో రెండు నుంచి మూడు నెలలు మాత్రమే ఉన్న ఈ జీవితకాలం పొడిగింపు 2014కి ఏకంగా కొన్ని సంవత్సరాలకు పెరిగింది. మున్ముందు క్యాన్సర్‌ రోగులు మరింత ఎక్కువ కాలం జీవించేందుకు తోడ్పడే ఔషధాలను కనుగొనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

70 రకాల మందులు

ఇప్పటి వరకూ క్యాన్సర్‌కు సంబంఽధించి 70 రకాల మందులు ఎఫ్‌డిఐ (అమెరికా) అనుమతి పొందాయి. ఈ మందులన్నీ సమర్థమైనవే అయినా వీటి పనితీరు, సామర్థ్యం, స్పందించే గుణం వ్యక్తి వ్యక్తికీ మారుతూ ఉంటుంది. క్యాన్సర్‌ని నిద్రాణ స్థితిలోనే గుర్తించగలిగే చికిత్సలు అందుబాటులోకి రావాలి. ఉదాహరణకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌నే తీసుకుంటే ఈ రకం క్యాన్సర్‌ కణాలు ఎముక మజ్జలో దాక్కుని ఉంటాయి. ఇవి యాక్టివేట్‌ అయి రొమ్ము క్యాన్సర్‌గా బయటపడేలోపే ఈ సీడ్స్‌ను కనిపెట్టి వాటిని ఆ స్థితిలోనే ఉంచటం లేదా సంహరించటం చేయగలిగితే రొమ్ము క్యాన్సర్‌ రాకుండా చేయొచ్చు. ఆస్ట్రేలియాలో ప్రతి ఇద్దరిలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ప్రతి ఐదు మందిలో ఒకరు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఈ మరణాల్లో 90 శాతం క్యాన్సర్‌ వ్యాధి అత్యంత వేగంగా శరీరంలో వ్యాప్తి చెందటం వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో తయారవుతున్న మందులు క్యాన్సర్‌ వ్యాప్తి వేగాన్ని దృష్టిలో పెట్టుకుని తయారువుతున్నవే! భారతదేశంలో క్యాన్సర్‌ తీరు భిన్నంగా ఉంటుంది. పూర్వంతో పోల్చుకుంటే ఇక్కడి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. సమర్థమైన చికిత్స, మందుల వల్ల ఇన్‌ఫెక్షన్లు, వివిధ వ్యాధులకు తట్టుకుని నిలబడుతున్నారు. కానీ, క్యాన్సర్‌ మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇందుకు అధిక జనాభా, క్యాన్సర్‌కు ఇతర వ్యాధులు తోడవటం, దురలవాట్లు, క్యాన్సర్‌ మందులకు స్పందించని శరీరతత్వం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు క్యాన్సర్‌గా మారటం (పాపిలోమా వైరస్‌ వల్ల సర్వైకల్‌ క్యాన్సర్‌) ప్రధాన కారణాలు. ఈ మరణాలను తగ్గించాలంటే వీలైనంత ముందుగా క్యాన్సర్‌ను కనిపెట్టే పరీక్షలు రావాలి. అలాగే వ్యాధికి వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టాలి. 

 ప్రత్యామ్నాయ ఔషధం ‘ఇమ్యునో ఆంకాలజీ డ్రగ్స్‌’

శరీరంలో రోగనిరోధకశక్తిని బలపరచటం ద్వారా క్యాన్సర్‌ని జయించటం సరికొత్తగా కనుగొన్న చికిత్సా విధానం. ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉన్న ఈ రకం డ్రగ్స్‌ క్యాన్సర్‌ కారక కణాలను గుర్తించి వాటితో పోరాడేలా రోగుల్లో వ్యాధినిరోధకశక్తిని పెంచే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. ఇలా ఇప్పటికే కొన్ని రకాల డ్రగ్స్‌ విదేశాల్లో వాడుకలో ఉన్నాయి. మెలనోమా అనే చర్మపు క్యాన్సర్‌ చికిత్సలో ఇమ్యునో ఆంకాలజీ డ్రగ్స్‌ సమర్థంగా పనిచేస్తున్నాయి. అలాగే ఊపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్‌లను కూడా ఈ పద్ధతిలోనే ఎదుర్కొనే డ్రగ్స్‌ కూడా తయారవుతున్నాయి. 

విస్తరిస్తున్న క్యాన్సర్‌ 

గతంలో.. కేవలం ఒక శరీర భాగానికి సంబంధించిన క్యాన్సర్‌ల గురించే మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు క్యాన్సర్‌లలో ఎన్నో పరిణామాలొచ్చాయి. ఒక అవయవానికి చెందిన క్యాన్సరే అయినా అందులోనూ వేర్వేరు రకాలు పుట్టుకొచ్చాయి. దాంతో చికిత్సా పద్ధతులు మొదలుకుని మందుల్లో కూడా తేడాలను పాటించాలి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు ఒక ప్రదేశానికే పరిమితమైతే మరికొన్ని ఇతర శరీర భాగాలుగా వ్యాపిస్తున్నాయి. ఒక రకం క్యాన్సర్‌లో కేవలం 18 నెలల వ్యవధిలోనే శరీరం మొత్తం ట్యూమర్లు విస్తరించి ప్రాణాలు పోతున్నాయి. 

అరికట్టాలంటే?

క్యాన్సర్‌ను అరికట్టాలంటే మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాలి. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చవుతుంది. ఇదిలా ఉంటే.. క్యాన్సర్‌ వ్యాధి నిర్మూలన కోసం కొన్ని సూత్రాలను పాటించాలి.
ఎర్లీ డయాగ్నొసిస్‌
క్యాన్సర్‌ వ్యాప్తిని నియంత్రించే మందుల్ని కనిపెట్టడం.
రోగుల్లో ఆ మందుల పనితీరును పరిశీలించటం.
మందుల ధరలను అందుబాటులోకి తేవటం.
భారతదేశంలో ఈ దిశగా పరిశోధనలు అనుకున్న స్థాయిలో జరగకపోవటానికి ప్రధాన కారణం ఆర్ధిక లోటు. అలాగే విదేశాల్లోలా భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించకపోవటం. ఇక్కడి డ్రగ్‌ కంపెనీలు ఎంతో సమర్థమైనవి, వినూత్నమైనవి. అయితే ఇవి లాభార్జనే ధ్యేయంగా పనిచేయటం వల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఔషధం తయారీకయ్యే ఖర్చుకు లాభాన్ని జతచేసి ధరను నిర్ణయిస్తే ఫర్వాలేదు. కానీ అత్యాశతో అత్యంత ఎక్కువ ధరలకు మందులను విక్రయించటం వల్ల రోగులకు మందులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. అలాగే క్యాన్సర్‌ డయాగ్నొసిస్‌ కోసం ఉపయోగించాల్సిన పరికరాలను ప్రొగ్నోసిస్‌ కోసం ఉపయోగించటం కూడా చూస్తున్నాం. ఇది సరికాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాగలిగితే ఎన్నో రకాల క్యాన్సర్లను రూపుమాపొచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్‌లు క్యాన్సర్‌ పరిశోధన, డ్రగ్స్‌ తయారీలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రెండు దేశాల సామర్థ్యాల మేళవింపుతో రూపొందే చికిత్సా పద్ధతులు, మందులు సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేగలిగితే పరిశోధనల అసలు ప్రయోజనం నెరవేరినట్టే!

శాశ్వత విజయం సాధ్యమేనా?

గుండె జబ్బులకు మంచి చికిత్సలున్నాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపుచేసే మందులతో గుండె జబ్బులు రాకుండా చేయగలుగుతున్నాం. నేరుగా గుండె జబ్బుకు కాకుండా అందుకు కారకాలను సరిదిద్దడం ద్వారా వ్యాధిని అదుపుచేయగలుగుతున్నాం. ఎయిడ్స్‌ వైర్‌సను అదుపు చేయగలిగే మందులను వాడటం ద్వారా ఎక్కువ కాలంపాటు జీవించేలా చేయగలుగుతున్నాం. అలాగే క్యాన్సర్‌లో కూడా ఆ వ్యాధికారక సీడ్‌ను నిద్రాణంగానే ఉంచగలిగితే క్యాన్సర్‌ మరణాలు ఉండకపోవచ్చు. అలాగే ప్రిమెచ్యూర్‌ డెత్‌ రిస్క్‌ను కూడా తగ్గించవచ్చు. ఇక క్యాన్సర్‌ను సమూలంగా నిర్మూలించే విషయానికొస్తే ప్రస్తుతం టెస్టిక్యులర్‌ క్యాన్సర్‌ని పర్మినెంట్‌గా క్యూర్‌ చేయగలిగాం. అలాగే ఎర్లీ స్టేజ్‌లో ఉన్న ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌లను కూడా క్యూర్‌ చేయగలుగుతున్నాం. పూర్వం క్యాన్సర్‌ నాలుగో దశలో ఇచ్చే క్రానిక్‌ డ్రగ్‌ అయిన టెమాక్సిఫిన్‌ను ప్రస్తుతం మొదటి దశలోనే ఇస్తున్నాం. దాంతో రొమ్ము క్యాన్సర్‌ను రూపుమాపగలుగుతున్నాం. ఇదే రకమైన చికిత్సా విధానాన్ని భారతదేశంలో కూడా అమలు చేయగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లను సమూలంగా నిర్మూలించవచ్చు. అలాగే మందుల ధరలతోపాటు, ఎర్లీ టెస్ట్‌లు, చికిత్సకు స్పందించే తీరును బట్టి రోగులకు వేర్వేరు మందులను తయారు చేయగలిగితే రానున్న 20 ఏళ్లలో ఎలాంటి క్యాన్సర్‌నైనా జయించవచ్చు.

క్యాన్సర్‌ ‘టీకా’ 

ప్రస్తుతం క్యాన్సర్‌కు టీకా కనుగొనే పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. అమెరికాలో ప్రొవెంజ్‌ అనే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ టీకా వాడుకలో ఉంది. దీంతో 70 శాతం సత్ఫలితాలొస్తున్నాయి. మలేరియాకు టీకాను కనుగొన్నాం. భారతదేశంలో డెంగ్యు ఎక్కువ. ఈ వ్యాధిని రాకుండా టీకాను కనిపెట్టే పరిశోధన కొనసాగుతోంది. అలాగే వంద శాతం క్యాన్సర్‌ దాడిని అరికట్టే సమర్ధమైన టీకాలు భవిష్యత్తులో రూపొందే అవకాశం కూడా లేకపోలేదు.