వాక్సిన్‌తో గర్భాశయ కేన్సర్‌ నివారణ

06-01-13

కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధే అయినా అది రాకుండా అడ్డుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ప్రయత్నాలు చేసే వారే తక్కువ. మిగతా కేన్సర్ల మాట ఎలా ఉన్నా, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ రాకుండా నిరోధించే వాక్సిన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. కాకపోతే ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే వాక్సిన్లు తీసుకునే వారి సంఖ్య ఈ రోజుకీ చాలా తక్కువే ఉంది. ఏమైనా నిర్ణీత సమయాల్లో వాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఈ కేన్సర్‌ను నిరోధించవచ్చని అంటున్నారు సీనియర్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ హెమటాలజిస్ట్‌ డా. భరత్‌.ఎ.వాస్వానీ
 
ఇండియాలో వేగంగా విస్తరిస్తోన్న కేన్సర్‌లలో గర్భాశయ ముఖ ్దద్వార కేన్సర్‌ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేన్సర్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెనోపాజ్‌ తరువాత కనిపించే ఈ కేన్సర్‌ ఇప్పుడు యుక్తవయస్సుల్లోనూ కనిపిస్తోంది.

కారణాలు 

హ్యూమన్‌ పాపిల్లోమ వైరస్‌(హెచ్‌పీపీ) వల్ల సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది. జననాంగాల దగ్గర శుభ్రత పాటించకపోవడం, ఒకరి కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ఈ కేన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 

లక్షణాలు 

ఈ కేన్సర్‌ బారినపడిన వారిలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. పీరియడ్స్‌ ముందు బ్లీడింగ్‌(ఇంటర్‌మెనుస్ట్రువల్‌ బ్లీడింగ్‌) ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటుంది. వైట్‌ డిశ్చార్జ్‌ అవుతుంటుంది. కేన్సర్‌ ఇతర భాగాలకు విస్తరించినపుడు దగ్గు కనిపిస్తుంది. 

నిర్ధారణ 

గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను గుర్తించడానికి పాప్‌స్మియర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఈ పరీక్ష చేస్తారు. ఏడాదికొకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ వీలుకాకపోతే మూడేళ్లకొకసారైనా పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. ఈ పరీక్ష చేయించుకోవడానికి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. అవుట్‌పేషెంట్‌గా పరీక్ష చేయించుకుని వెళ్లిపోవచ్చు. ఈ పరీక్షలో భాగంగా కొంత శాంపిల్‌ను తీసుకుని మైక్రోస్కోప్‌తో పరీక్షించడం జరుగుతుంది. ఏమైనా అబ్‌నార్మాలిటీ ఉంటే పాప్‌స్మియర్‌ పరీక్షలో తెలిసిపోతుంది. కాల్పోస్కోపీ అనే మరొక పరీక్ష కూడా వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో కెమెరా సహాయంతో వ్యాధి అనవాళ్లను చూడటం జరుగుతుంది. వ్యాధి ఉందని నిర్ధారణ అయిన తరువాత,ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి అలా్ట్రసౌండ్‌, సీటీస్కాన్‌ పరీక్షలు ఉపయోగపడతాయి. 

చికిత్స

సర్వైకల్‌ కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశాలుంటాయి. ప్రాథమిక దశలో సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కేన్సర్‌ బాగా ముదిరిన తరువాత గుర్తిస్తే రేడియేషన్‌ థెరపీ, కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క రేడియేషన్‌ చికిత్స తీసుకుంటే 50 శాతం మేర నయం అయ్యే అవకాశాలుంటాయి. రేడియేషన్‌తో పాటు కీమోథెరపీ తీసుకుంటే 70 శాతం మేర క్యూర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కేన్సర్‌ వ్యాధి స్టేజ్‌ 1, 2, 3లో ఉంటే 80 శాతం నయం అయ్యే అవకాశం ఉంటుంది. స్టేజ్‌ 4లో అంటే వ్యాధి బాగా ముదిరిన దశలో ఉంటే క్యూర్‌ అయ్యే అవకాశాలు 10 శాతం కన్నా తక్కువగా ఉంటాయి. 

వాక్సినేషన్‌

సర్వైకల్‌ కేన్సర్‌ నివారణకు వాక్సినేషన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే  వాక్సిన్‌పై చాలా మందికి అవగాహన లేదు. నిజానికి ఈ వాక్సిన్‌ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. చాలా సురక్షితమైనది. ఈ వాక్సిన్‌ను పెళ్లికి ముందు తీసుకుంటే చాలా మంచిది.  9 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సులో బాలికలకు ఇప్పిస్తే వారు సర్వైకల్‌ కేన్సర్‌ బారినపడకుండా ఉంటారు. 40 ఏళ్ల వయస్సు లోపు వారు కూడా వాక్సిన్‌ తీసుకోవచ్చు. వాక్సిన్‌ వల్ల కేన్సర్‌ రాకుండా ఉంటుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎప్పుడైనా వాక్సిన్‌ కేన్సర్‌ ను అడ్డుకోదు. కేన్సర్‌కు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటుంది. ఫలితంగా కేన్సర్‌ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. వ్యాధి వచ్చిన తరువాత బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. ప్రతీ ఒక్కరు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. కేన్సర్‌ రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వాక్సినేషన్‌ తీసుకోవడంతో పాటు పిల్లలకు వాక్సిన్‌ ఇప్పించడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే సర్వైకల్‌ కేన్సర్‌ సమూలంగా నివారించగలుగుతాం.

డా. భరత్‌.ఎ.వాస్వానీ
సీనియర్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ హెమటాలజిస్ట్‌
యశోద హాస్పిటల్‌
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 90300 73101