ఒకే రక్త పరీక్ష.. 8 కేన్సర్లు గుర్తింపు

 

‘కేన్సర్‌సీక్‌’తో 98 % కచ్చితత్వంతో రోగ నిర్ధారణ
 జాన్స్‌ హోప్కిన్స్‌ వర్సిటీ శాస్త్రవేత్తల ఘనత
న్యూయార్క్‌, జనవరి 19: ఒక్కో కేన్సర్‌కు ఒక్కో రకం పరీక్ష.. ఇలా ఎన్ని రకాల కేన్సర్లు ఉంటే అన్ని పరీక్షలు చేయాల్సిందే. దానికి బోలెడంత ఖర్చు. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు అన్ని రకాల కేన్సర్లకు ఒకే పరీక్షను అమెరికాలోని జాన్స్‌ హోప్కిన్స్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎనిమిది రకాల కేన్సర్లను గుర్తించేలా రక్తపరీక్ష ‘కేన్సర్‌సీక్‌’ను అభివృద్ధి చేశారు. ఒక్క రక్త పరీక్షతో కేన్సర్లను ముందుగానే, కచ్చితత్వంతో గుర్తించవచ్చట. కేన్సర్‌ కణితులు పరివర్తనం చెందిన డీఎన్‌ఏ ఆనవాళ్లను, ప్రొటీన్లను రక్తంలోకి విడుదల చేస్తాయి.
 
ఆ డీఎన్‌ఏను, ప్రొటీన్లను పరీక్షిస్తే కేన్సర్‌ను గుర్తించవచ్చని పరిశోధకులు వందలాది జన్యువులను, 40 ప్రొటీన్‌ మార్కర్లను పరీక్షించారు. అందులో కేన్సర్‌ కణితుల జాడలను తెలిపే 16 జన్యువులను, 8 ప్రొటీన్‌ మార్కర్లను ఎంపిక చేశారు. వాటితో కేన్సర్‌ ఉందా? లేదా? అని తెలుసుకోవచ్చు. దాదాపు వెయ్యి మంది రోగులను కేన్సర్‌ సీక్‌తో పరీక్షించి 68% నుంచి 98% సక్సెస్‌ రేటు సాధించినట్లు వెల్లడించారు. కాగా, ఈ పరీక్షకు అయ్యే ఖర్చు దాదాపు రూ.32వేలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.