రొమ్ము కేన్సర్‌కు ఆధునిక చికిత్స

02-04-13

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంకాలజీ విభాగంలో వస్తున్న మార్పులు కేన్సర్‌ రోగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. అవగాహన లేమి, తరచు వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల రొమ్ము కేన్సర్‌ను ప్రాథమిక దశలో కాకుండా ముదిరిన పరిస్థితిలో గుర్తించడం జరుగుతోంది. అయితే అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతమైన పరికరాలు, చికిత్సా విధానం వల్ల రొమ్ము కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధిని సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనని అంటున్నారు అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా. బాబయ్య. 
 
భారతదేశంలో రొమ్ము కేన్సర్‌ రోజురోజుకూ మహమ్మారిలా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలోనే ఈ వ్యాధి సర్వసాధారణంగా మారుతోందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము కేన్సర్‌ బారిన పడే మహిళల వయోదశ తగ్గుతుండగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రొమ్ము నిర్మాణ వ్యవస్థ గురించి తెలుసుకోవడం, స్వీయ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా మహిళలు రొమ్ము కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధి ముదరకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు. మహిళలు నెలకొకసారైనా రొమ్ములోపల ఏవైనా గడ్డలు ఉన్నదీ లేనిదీ స్వీయ నిర్ధారణ చేసుకోవాలి. రొమ్ముకు పరిమాణంలో మార్పులేమైనా కనపడిన వెంటనే వైద్యుడిని సంప్రదించి తదుపరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు స్వీయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి, వ్యాధి నిర్మూలన సాధ్యపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

రొమ్ము కేన్సర్‌కు కారణాలు

రొమ్ము కేన్సర్‌ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల జన్యుపరమైన అంశాలు కేన్సర్‌కు కారణమవుతున్నాయి. బీఆర్‌సీఏ అనే ఒకరకమైన జన్యువు వంశపారం పర్యంగా సంక్రమించడం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. స్మోకింగ్‌ చేయడం, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, ఆఽధునిక జీవనవిధానం వంటివి రొమ్ము కేన్సర్‌కు కారణమవుతున్నాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, డెలివరీ తరువాత పిల్లలకు పాలివ్వకపోవడం కూడా కేన్సర్‌కు కారణమవుతోంది. 

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

రొమ్ము కేన్సర్‌ను గుర్తించడానికి మమ్మోగ్రామ్‌ పరీక్షలు ఎంతగానో తోడ్పడతాయి. తక్కువ శక్తితో పంపే ఈ ఎక్స్‌రేల వల్ల ప్రాథమిక దశలో కేన్సర్‌ను గుర్తించడంతోపాటు వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా నివారణ చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది. 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ఏడాదికోసారైనా మమ్మోగ్రామ్‌ పరీక్షలు చేయించుకోవాలని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ మార్గదర్శకసూత్రాలు సూచిస్తున్నాయి. అయితే రోగి ఆరోగ్య చరిత్ర ప్రాతిపదికగా ఈ పరీక్షల కాలవ్యవధి మారవచ్చు.

అయితే వైద్యరంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అటు రోగులకే కాక వైద్యులకు కూడా వ్యాధి నిర్ధారణను సులభతరం చేసింది. డిజిటల్‌ మమ్మోగ్రాఫీ రాకతో రొమ్ము కేన్సర్‌ను సులభంగా నిర్ధారించడం సాధ్యపడుతోంది. మమ్మోగ్రాఫీ పరీక్షల ద్వారా రొమ్ము కేన్సర్‌ ఉన్నట్లు వైద్యులు అనుమానించినపుడు తదుపరి నిర్ధారణ నిమిత్తం బయాప్సీ, పాథాలజీ విశ్లేషణ, కేన్సర్‌ దశ వంటివి గుర్తించడానికి ఇతర పరీక్షలను సూచించడం జరుగుతుంది. ఇమేజింగ్‌ టెస్టుల ద్వారా వ్యాధిని సమగ్రంగా నిర్ధారించుకుని రొమ్ము కేన్సర్‌ నిర్మూలనకు చేపట్టవలసిన చికిత్సా విధానాన్ని వైద్యులు  రూపొందించుకుంటారు.

ఒక వ్యక్తికి కేన్సర్‌ ఉందని తెలుసుకోవడానికి ప్రాథమికంగా భౌతిక పరీక్ష చేయాలి. ఆ తరువాత ఇమేజింగ్‌ టెక్నాలజీలోని ప్రాథమిక అంశమైన ఎక్స్‌రేతో నిర్ధారణ చేయాలి. ఇది గతంలో కొంత కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు రేడియేషన్‌ ఆంకాలజీ నిపుణులు కేన్సర్‌ కణజాలమంతా కలిసి ముద్దగా ఏర్పడిన క ణుతులను రేడియేషన్‌ సహాయంతో చికిత్సకు ముందే స్పష్టంగా చూడగలుగుతున్నారు. దీనివల్ల చికిత్స మరింత మెరుగ్గా అందించేందుకు వీలుపడుతోంది. అంతేకాకుండా పెట్‌, సీటీ స్కాన్‌తో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఏర్పడింది. కేన్సర్‌ చికిత్సలో పెట్‌స్కాన్‌తోపాటు సీటీస్కాన్‌ను కలుపుకుంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. పెట్‌/సీటీ స్కాన్‌ ద్వారా కేన్సర్‌ కణితి ఏ భాగంలో ఉంది? దాని పరిమాణం ఏమిటి? నిర్దిష్టంగా ఎక్కడ ఉంది అనే సమాచారం 3 డి చిత్రాల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అధునాతనమైన 4డి పెట్‌/సీటీ స్కాన్‌ను ఉపయోగించడం జరుగుతోంది. ఈ స్కాన్‌తో రోగి శ్వాస తీసుకుంటున్నప్పుడు కదిలే అతి చిన్న కణుతుల కదలికలను సైతం గుర్తించవచ్చు. దీనివల్ల అత్యంత చిన్న కణుతులను సైతం ప్రాథమిక దశలోనే తొలగించడం సాధ్యమవుతోంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ పరికరాన్ని మా ఇన్‌స్టిట్యూట్‌ ప్రవేశపెట్టింది. చికిత్స సందర్భంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఏర్పడకుండా దీని ద్వారా నివారించడం సాధ్యపడుతుంది.

చికిత్సా పద్ధతులు

రొమ్ము కేన్సర్‌ ఏర్పడిన రోగులకు ఒక్కోసారి సర్జరీ ద్వారా రొమ్మును పూర్తిగా తొలగించవలసి వస్తుంది. ఈ సర్జరీని మాస్టెక్టమీ అంటారు. కేన్సర్‌ బారిన పడిన రొమ్ములో కొంత భాగాన్ని తొలగించే సర్జరీని లంపెక్టమీ అంటారు. తొలిదశలో ఉన్న రొమ్ము కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు లంపెక్టమీ చేయడం సాధారణంగా జరిగే సర్జరీ. దీని తర్వాత రేడియేషన్‌ థెరపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సర్జరీ అనంతరం రొమ్ములో మిగిలి ఉండే కేన్సర్‌ కణాలను నశింపచేయడానికి అత్యంత శక్తివంతమైన రేడియేషన్‌ కిరణాలను పంపించడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో మా దగ్గర మాత్రమే అందుబాటులో ఉన్న అత్యంత అధునికమైన ట్రూబీమ్‌ లేనియర్‌ ఆక్సెలరేటర్‌ వంటి యంత్రాలు, ఎక్లిప్స్‌ ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌, 4డి పిఇటి/సిటి స్కానర్ల ద్వారా రొమ్ము కేన్సర్‌ను సంపూర్ణంగా నిర్మూలించడం సాధ్యపడుతుంది. రొమ్ముకు చేరువలో ఉండే గుండె, ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడకుండా రేడియేషన్‌ కిరణాల ప్రసరణలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల రొమ్ము కేన్సర్‌ను సమూలంగా, సమగ్రంగా నిర్మూలించి, రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం సాధ్యపడుతోంది.

చికిత్సకు ఇదే కీలకం

చికిత్సకు ప్రణాళిక రూపొందించడంలో అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ ఒక అసాధారణమైన కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉపకరణాలు కలిగి ఉంది. వాటిని ఉపయోగించడానికి అత్యంత సునిశితమైన శిక్షణ పొందిన ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. అమెరికాలో ఉన్న మాతృ సంస్థ ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇటువంటి ప్రణాళిక వల్ల వైద్యం చేసే సమయంలో వైద్యుల లక్ష్యమంతా రోగ కారణమైన కణితిపైనే కేంద్రీకరించగలుగుతారు. దాని చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలంపై అతి తక్కువ ప్రభావం పడేలా చూస్తారు. కేన్సర్‌ కణం తాలూకు పూర్తి స్వరూపాన్ని (సిమెట్రీ) కొలిచి నిర్ధారణ చేసి చికిత్స చేసే వాళ్లను డూసిమెట్రిస్ట్‌ అంటారు. చికిత్స సమయంలో కొన్ని వేల ప్రణాళికలను సిద్ధం చేసి దానికి అనుగుణంగా చికిత్స అందించడం జరుగుతుంది.
డా. బాబయ్య, ఎండి(ఎయిమ్స్‌)
మెడికల్‌ డైరెక్టర్‌
అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ ః సిటిజన్స్‌ హాస్పిటల్‌
శేరిలింగంపల్లి, హైదరాబాద్‌
ఫోన్‌ : 9963667511, 040-67199999