వాపును... వదిలిద్దాం!

ఆంధ్రజ్యోతి (10-12-2019): కేన్సర్‌ నుంచి కోలుకోవడం ఒక ఎత్తయితే, తదనంతర ఇబ్బందులను అధిగమించడం మరో ఎత్తు! మరీ ముఖ్యంగా అసౌకర్యానికి లోను చేసే అవయవాల వాపులు మరింత విసుగు తెప్పిస్తాయి! నిర్లక్ష్యం చేస్తే అనవసరపు సమస్యలూ తెచ్చిపెడతాయి! ‘లింఫెడీమా’ అనే ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాణ్యమైన జీవితాన్ని ఎలా గడపాలి..?
 
లింఫెడీమా అంటే అవయవాల వాపు. లింఫ్‌ గ్రంథుల నుంచి స్రవించే స్రావం కణజాలాలకు చేరకుండా, నిల్వ ఉండిపోతే ఇలా జరుగుతుంది. ఫలితంగా ఆయా ప్రదేశాలతో సంబంధం ఉన్న కాళ్లు, చేతులు, ముఖం... వాచిపోతాయి. గుండె నుంచి అవయవాలకు రక్తాన్ని చేరవేసే ధమనులు క్రమంగా చిన్న శాఖలుగా విడిపోయి, చివరకు సిరలుగా మారతాయి. అయితే శాఖలుగా విడిపోయే దశలో లింఫ్‌ స్రావం కణజాలాలకు చేరుతుంది. ఆ స్రావం ద్వారానే కణజాలం జీవించడానికి అవసరమైన ఆక్సిజన్‌, ఆహారం అందుతాయి. అయితే ఇలా కణజాలాలకు చేరిన స్రావం ‘లింఫాటిక్స్‌’ అనే సన్నని నాళాల ద్వారా వెనక్కి వచ్చి, తిరిగి సిరల్లో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ స్రావాలు లింఫ్‌ నోడ్స్‌ దగ్గర ఆగుతాయి. ఈ మార్గంలో ఏ కారణంగా, ఎక్కడ అవరోధం ఏర్పడినా లింఫెడీమా తలెత్తుతుంది. కేన్సర్‌ సర్జరీ ఫలితంగా ఈ నాళాలు లేదా లింఫ్‌నోడ్స్‌ మూసుకుపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీలో భాగంగా లింఫ్‌ నోడ్స్‌ను తొలగించవలసి రావచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీ సమయంలో లింఫ్‌ గ్రంథులు దెబ్బతినవచ్చు. ఫలితమే... లింఫెడీమా!
 
వాపు నియంత్రణ మన చేతుల్లోనే!
ఈ సమస్య క్రమేపీ పెరుగుతుంది. కాబట్టి ప్రారంభంలోనే గుర్తించి జాగ్రత్తపడడం అవసరం. లింఫెడీమా వాపు సాధారణమైన వాపు కన్నా భిన్నమైనది. కాళ్లలో తలెత్తే లింఫెడీమా అయినా, చేతుల్లో తలెత్తే లింఫెడీమా అయినా... వేళ్ల పైన ఉంచే చర్మం ఉబ్బిపోయి, వేళ్లతో పట్టుకుని లాగడానికి సాధ్యపడదు. ఇలా ప్రారంభంలోనే గుర్తిస్తే బిగుతైన ‘లింఫాటిక్‌ గార్మెంట్స్‌’ వేసి వాపును అదుపులో ఉంచుకోవచ్చు.
 
చికిత్స ఇలా!
లింఫ్‌ స్రావం పేరుకుపోవడం కారణంగా లింఫెడీమా తలెత్తినప్పుడు, ఆ స్రావాన్ని తిరిగి ఆ ప్రదేశం నుంచి వెనక్కి వెళ్లేలా చేయడమే ఈ సమస్యకు ప్రధాన చికిత్స. ఇందుకోసం మూడు రకాల పద్ధతులను అనుసరించాలి. అవేంటంటే...
 
మర్దన: మర్దన వల్ల మూసుకుపోయిన నాళాలు తెరుచుకోకపోయినా, చర్మం అడుగున కొత్త నాళాలు ఏర్పడేలా చేయవచ్చు. ఫలితంగా స్రావం వెనక్కి వెళ్లిపోతుంది. అయితే మర్దన కోసం ఎలాంటి నూనెలూ వాడకూడదు. మర్దన విధానం వైద్యుల దగ్గరే నేర్చుకుని అనుసరించాలి.
 
శుభ్రత: లింఫెడీమా తలెత్తిన అవయవం చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా వేళ్ల సందుల్లో ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి. కేవలం చర్మం శుభ్రం చేసుకోవడానికే ఉదయం, సాయంత్రం అరగంట కేటాయించాలి. జీరో పీహెచ్‌ రకం సబ్బునే వాడాలి. లేదంటే వాపు వల్ల ఏర్పడే ముడతల్లో బ్యాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. ఇలా కొత్తగా వచ్చే ఇన్‌ఫెక్షన్లు తిరిగి లింఫ్‌ నాళాలను మూసుకుపోయేలా చేస్తాయి. పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తాయి.
 
లింఫాటిక్‌ కంప్రెషన్‌ పంప్‌: ఈ పరికరం కూడా అవయవాల్లో పేరుకుపోయిన స్రావాన్ని వెనక్కి పంపిస్తుంది. ప్రారంభంలో వైద్యుల సహాయంతో ఈ చికిత్స తీసుకోవాలి. తర్వాత ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంట నుంచి గంటన్నర సమయం పాటు ఈ పరికరాన్ని ఉపయోగించాలి.
 
ఈ జాగ్రత్తలన్నీ అనుసరించడం కోసం ఆస్పత్రిలో వైద్యుల దగ్గర 8 రోజుల పాటు శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించగలిగితే లింఫెడీమాను 70% నుంచి 80% వరకూ తగ్గించవచ్చు. అయితే వాపు తగ్గినా... కంప్రెషన్‌ గార్మెంట్స్‌ జీవితాంతం వాడుతూనే ఉండాలి.
 
వీళ్లు అప్రమత్తంగా ఉండాలి!
వంశపారంపర్యంగా కేన్సర్‌ వచ్చే వీలు ఉంది కాబట్టి కేన్సర్‌ వ్యాధి పీడితుల రక్తసంబంధీకులు అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాధి ఉన్న రక్త సంబంధీకులు ఫస్ట్‌ డిగ్రీ (తల్లి, తండ్రి, మేనత్త, పిన్ని, బాబాయి, మామయ్య) కోవకు చెందిన వారైతే కేన్సర్‌ వచ్చే అవకాశాలు 80ు సెకండ్‌ డిగ్రీ (అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ) వారైతే 50ు, థర్డ్‌ డిగ్రీ (దూరపు రక్తసంబంధీకులు) వారైతే 20ు ఉంటాయి. రొమ్ము, పెద్దపేగు, గర్భాశయం కేన్సర్లు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. కాబట్టి మీకు కేన్సర్‌ రక్తసంబంధీకులు ఉంటే, వారికి ఆ వ్యాధి బయటపడినప్పటి వయసుకు ఐదేళ్ల ముందు వయసు నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలి.
 
సర్జరీ చేసిన ప్రదేశాన్ని బట్టి....
కేన్సర్‌ సర్జరీ చేసిన ప్రదేశాన్ని బట్టి నిర్దిష్ట అవయవాలకు లింఫెడీమా వస్తుంది. అదెలాగంటే....
కాళ్లు: ఒవేరియన్‌ కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ (ఎండోమెట్రియం, సర్వికల్‌), రెక్టల్‌, కొలొనిక్‌ కేన్సర్లు, కటి ప్రదేశంలో రేడియేషన్‌
ముఖం: తల, మెడకు సంబంధించిన కేన్సర్‌
చేతులు: రొమ్ము కేన్సర్‌
ఊపిరితిత్తులు: లంగ్‌ కేన్సర్‌
 
ప్రతి వ్యక్తిలో పుట్టుకతోనే కేన్సర్‌ జన్యువు, దాన్ని అదిమిపెట్టి ఉంచే ‘సప్రెసర్‌ జీన్స్‌’ (రక్షణ జన్యువులు) ఉంటాయి. అయితే మన ఆహార, జీవనశైలి, పర్యావరణ కాలుష్యం కారణంగా రక్షణ జన్యువుల పనితీరు కుంటుపడితే కేన్సర్‌ జన్యువు ప్రేరేపితమై వ్యాధి రూపం దాలుస్తుంది. కాబట్టి కేన్సర్‌ నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
రెండు నిమిషాల్లో వండుకుని తినే వీలున్న ఏ పదార్థమైనా కేన్సర్‌ కారకమే! ప్రాసెస్డ్ ఫుడ్స్‌, పదార్థాలు నిల్వ ఉండడానికి ఉపయోగించేవి, రుచి, రంగులను జోడించేవి కూడా కేన్సర్‌ కారకాలే. వాటికి దూరంగా ఉండాలి.
ధూమపానం (యాక్టివ్‌, పాసివ్‌) మద్యపానాలకు దూరంగా ఉండాలి.
మహిళలు యుక్తవయసు కన్నా ముందు నుంచే లైంగిక జీవితం మొదలుపెట్టడం వల్ల ‘సర్వికల్‌ కేన్సర్‌’ వచ్చే అవకాశాలు ఎక్కువ.
35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల రొమ్ము, ‘ఎండోమెట్రియల్‌ కేన్సర్‌’కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
35 ఏళ్లు దాటిన తర్వాత కుటుంబనియంత్రణ మాత్రలు వాడినా రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి.
అస్తవ్యస్త జీవనశైలి ధూమపానం కన్నా 8 రెట్లు ప్రమాదకరం. రోజుకు 10 సిగరెట్లు తాగడం కన్నా, రోజుకు 500 మీటర్ల కన్నా తక్కువ నడవడం అంతకు పది రెట్లు ప్రమాదకరం.
 
ఈ పరీక్షలు అవసరం!
కేన్సర్‌ను ముందుగానే గుర్తించగలగాలంటే ప్రతి ఒక్కరూ వారి వయసును బట్టి కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి!
 
పురుషులు:
50 ఏళ్లు దాటిన వాళ్లు ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నార్మల్‌గా ఉంటే, తిరిగి పదేళ్లకు చేయించుకోవాలి.
ధూమపానం అలవాటు ఉన్న వారు 40 ఏళ్ల వయసు నుంచి ఏడాదికోసారి ఛాతి ఎక్స్‌రే తీయించుకుంటూ ఉండాలి.
మద్యపానం అలవాటు ఉన్న వాళ్లు ఏడాదికోసారి లివర్‌ స్కానింగ్‌ చేయించుకుంటూ ఉండాలి.
 
మహిళలు:
40 ఏళ్లు దాటితే ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి.
25 ఏళ్ల వయసు మహిళలు ప్రతి ఐదేళ్లకోసారి పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. పరీక్షలో తేడా కనిపిస్తే ఏడాదికోసారి పరీక్షించుకుంటూ ఉండాలి.
 
స్త్రీ,పురుషులు
40 ఏళ్లు దాటిన తర్వాత కడుపు ఉబ్బరం హఠాత్తుగా మొదలైతే ఎండోస్కోపీ చేయించుకోవాలి.
50 ఏళ్లు దాటిన వాళ్లు కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఫలితం నార్మల్‌గా ఉంటే, తిరిగి పదేళ్ల తర్వాత చేయించుకోవాలి.
ఈ పరీక్షలతో పాటు సాధారణ మల, మూత్ర, రక్త పరీక్షలు ఏడాదికోసారి చేయించుకోగలిగితే ఫలితాల ద్వారా కేన్సర్‌ను ముందుగానే కనిపెట్టవచ్చు.
 
ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్ష!
లింఫెడీమాలో చర్మానికి గాయమెతే సూక్ష్మజీవులు తేలికగా ఆకర్షితమవుతాయి. దాంతో ఇన్‌ఫెక్షన్లు పెరు గుతాయి. ఈ అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎటువంటి ఇన్‌ఫెక్షన్లకూ గురయ్యే వీలు లేకుండా ‘లాంగ్‌ టర్మ్‌ యాంటీ బయాటిక్స్‌’ తీసుకోక తప్పదు. ఈ చికిత్సలో భాగంగా తక్కువ మోతాదులో ప్రతి 21 రోజులకు ఒక ఇంజక్షన్‌ తీసుకోవలసి ఉంటుంది. అలాగే బాడీ మాస్‌ ఇండెక్స్‌ 30 కన్నా తక్కువ ఉన్న వారితో పోలిస్తే, అంతకన్నా ఎక్కువ ఉన్న స్థూలకాయుల్లో లింఫెడీమా వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.
 
- డాక్టర్‌ రాజా వి. కొప్పాల
ఫెలో ఇన్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ, ఎవిస్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌