వేగంగా పెరిగే లంగ్‌ కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తిస్తే

ఆంధ్రజ్యోతి, 07-05-2013: శ్వాసకోశాల కేన్సర్‌ నిర్ధారణ చాలా  క్లిష్టమైనది. ఈ  కేన్సర్‌ లక్షణాలు, క్షయ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడం వల్ల, శ్వాసకోశ  కేన్సర్‌ను  క్షయవ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. అందుకే క్షయ వ్యాధి మందులతోనే చాలా కాలం గడిపేయవచ్చు.  పైగా శ్వాసకోశ వ్యాధికి చాలా వేగంగా పెరిగే లక్షణం ఉంది.  అందుకే ఆలస్యమయ్యే కొద్దీ నాటికి  వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. మొదట్లో  సాధారణ వైద్యచికిత్సలేవో తీసుకున్నా, లక్షణాలు తగ్గకపోవడం, తగ్గినా మళ్లీ మళ్లీ అవే లక్షణాలు  కనిపించినప్పుడు,  అది శ్వాసకోశ  కేన్సరేమోనని అనుమానించి  వెంటనే కేన్సర్‌  వైద్య నిపుణులను సంప్రదించాలంటున్నారు, కేన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌  సిహెచ్‌. మోహన వంశీ. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.....

 
కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.

స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌

శ్వాసకోశ కేన్సర్లు రెండు రకాలు. వాటిలో మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌. ఈ రకం కేన్సర్లు శ్వాసకోశ కేన్సర్లలో 14 శాతం దాకా ఉంటాయి. ఈ కేన్సర్‌ను ఓట్‌ సెల్‌ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఈ కేన్సర్‌కు అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉంది. అలాగే ఇతర శరీర భాగాలకు అంటే లింఫ్‌నోడ్స్‌, ఎముకలు, మెదడు, అడ్రినల్‌ గ్లాండ్స్‌, లివర్‌ భాగాలకు  వ్యాపించే గుణం ఉంది.  ఈ కేన్సర్‌ కారకుల్లో దాదాపు 95 శాతం మందిలో పొగాకు సేవించే అలవాటు ఉన్నవారే. 

నాన్‌-స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌

ఈ కేన్సర్‌ను తిరిగి  మూడు తరగతులుగా  విభజించారు.  అందులో స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా ఒకటి. దాదాపు 30 శాతం మందిలో ఈ కేన్సర్లే కనిపిస్తాయి. ఈ కేన్సర్‌కు కూడా పొగాకు అలవాట్లే కారణం.

అడెనోకార్సినోమా

ఈ కేన్సర్‌ దాదాపు 40 శాతం మందిలో  కనిపిస్తుంది. కాకపోతే ఈ కేన్సర్‌ శ్వాసకోశాలకు ఉపరిభాగంలో కనిపిస్తుంది.

లార్జ్‌సెల్‌ కార్సినోమా

దాదాపు 15 శాతం మందిలో ఈ కేన్సర్లు కనిపిస్తాయి. ఇతర శ్వాసకోశ కేన్సర్లలో కార్సినాయిడ్‌ ట్యూమర్లు, అడినాయిడ్‌ సిస్టిక్‌ కార్సినోమా, హామర్‌టోమాస్‌, లింఫోమా, సార్కోమా కేన్సర్లు కూడా ప్రధానంగా కనిపిస్తాయి, కేన్సర్‌ ఇప్పుడు వైద్యానికి లొంగని  వ్యాధేమీ కాదు.  కాకపోతే,  వ్యాధిని  తొలిదశలోనే గుర్తించగలిగితేనే, వైద్య ప్రయోజనాలు, సంపూర్ణంగా ఉంటాయి. కానీ, ఎక్కువ మంది విషయంలో ఈ ఆలస్యమే జరుగుతోంది. భారతీయులు నేడు  అత్యధికంగా గురిఅవుతున్న సమస్య క్షయ.  ఇది కేవలం శ్వాసకోశాల్లోనే కాకుందా శరీరంలోని  ఏ భాగంలోనైనా వచ్చే వ్యాధి. వ్యాధి పరీక్షలు పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో  చాలా లక్షణాలను క్షయ సంబంఽధితమనే  అనుకునే వారు. ముఖ్యంగా, ఎడతెగని దగ్గు, తెమడలో రక్తం కనిపించడం, ఎక్స్‌రేలో కాస్త  నీడలా కనిపించడం ఇవి కనిపిస్తే చాలు, క్షయే అనుకుని,  వైద్యం  ప్రారంభించేవారు. వారి నిర్ధారణ 99 శాతం నిజమే అయ్యేది.  నూటికి ఒకరి విషయంలోనే  అయినా ఆ నిర్ధారణ తప్పయిపోయి,  వారు శ్వాసకోశ  కేన్సర్‌ కారణంగా వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయేవి. ప్రస్తుత పరిస్థితి వేరు. శ్వాసకోశ  కేన్సర్‌ వ్యాఽధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ చాలా వేగంగా పెరుగుతోంది.  వివిధ కారణాల చేత ఈ  క్యాన్సర్‌  నగరవాసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. 

ఏమిటా లక్షణాలు? 

శ్వాసకోశ క్యాన్సర్‌ లక్షణాల్లో ప్రధానంగా   ఎడతెగని దగ్గు, ఉమ్మిలో రక్తం కనిపించడం, గొంతు బొంగురుపోవడం, ఛాతీలో నొప్పి రావడం,జ్వరం, నిస్సత్తువ, ఆకలి మందగించడం, ఆహారం రుచించకపోవడం,  బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. అయితే  ఈ లక్షణాలు క్ష య  వ్యాఽధిలోనూ, క్యాన్సర్‌ వ్యాఽధిలోనూ  కనిపిస్తాయి. కొన్ని  కీలక పరీక్షలు చేయిస్తే  అవి క్యాన్సర్‌ లక్షణాలో, క్షయ లక్షణాలో తెలిసిపోతుంది. కానీ, ఆర్థికమైన ఇబ్బందుల వల్ల కానీ, వేరే  కారణాల వల్ల గానీ, ఆ  ఇతర పరీక్షలేవీ చే యించరు. సాధారణ పరీక్షల రిపోర్టుల ఆధారంగా డాక్టర్‌ కూడా అది  క్షయ వ్యాధేనన్న నిర్ధారణకు వచ్చేసి, వైద్య  పరీక్షలు ప్రారంభిస్తారు. ఒకవేళ ఆ మందులు వాడిన నెలరోజుల తరువాత  కూడా ఆ లక్షణాలేవీ తగ్గకపోతే,  అది క్ష య కాకుండా మరే వ్యాధైనా ఉందేమోనని  వెంటనే అనుమానించవలసి ఉంటుంది. వ్యాధిని గుర్తించకుండా క్షయ వ్యాఽధి మందులనే కొనసాగిస్తూ పోవడం వల్ల అసలు వ్యాధి తీవ్రం కాపచ్చు.  క్షయవ్యాధిని గుర్తించే ఆధునిక పరీక్షలెన్నో ఇప్పుడు అందుబాటులోకి  వచ్చాయి.  ఆ పరీక్షల్లో  అది క్షయేనని రుజువైతే  తప్ప, పైపైనే పరిశీలించి  అది క్షయేనని అనుకుంటూ ఉండిపోకూడదు.  పూర్తి నిర్ధారణ లేకుండా క్ష య వ్యాధికి  వైద్య చికిత్సలు చేస్తూ  వెళితే,  కొన్ని సార్లు ఎప్పుడో బాగా  ముదిరిపోయిన శ్వాసకోశ క్యాన్సర్‌గా బయటపడవచ్చు. 

ఒక్క పరీక్షతో అయిపోదు

అతిగా పొగతాగే వారిలో  క్షయ, క్రానిక్‌  బ్రాంకైటిస్‌,  క్యాన్సర్‌ ఈ మూడు సమస్యలూ   చాలా ఎక్కువగానే కనిపిస్తాయి.  కనిపించే సమస్యలు.  దీర్ఘకాలికంగా పొగతాగే వ్యక్తికి  బాగా దగ్గు,  తెమడలో రక్తం కనిపించడం వంటివి కనిపిస్తే డాక్టర్‌ వద్దకు వెళతారు. డాక్టర్‌ వైద్యపరీక్షలన్నీ చేయించి  ఇతర రిపోర్టులు నార్మల్‌ అని వస్తే,  ఇది పొగతాగడం వల్ల వచ్చిన బ్రాంకైటిస్‌ అని చెప్పి  మందులేవో  రాసి పంపించివేస్తారు. మందులు వేసుకోగానే కాస్త తగ్గినట్లే అనిపిస్తుంది. కానీ, అవే లక్షణాలు ఆరుమాసాలకో  ఏడాదికో మళ్లీ కనిపిస్తాయి.  ఇంతకు ముందు డాక్టర్‌, అన్ని పరీక్షలూ  చేయించి  బ్రాంకైటిస్‌ అన్నారు కాబట్టి,  ఇప్పుడు కూడా అదే సమస్య అయి ఉంటుందిలే  అనుకుని, అప్పుడు రాసిన మందులే మళ్లీ వేసుకుంటూ ఉండిపోతారు. కానీ, ఆరుమాసాల క్రితమో, ఏడాది క్రితమో  కేన్సర్‌ లేకపోయి ఉండవచ్చు. ఆ తరువాత వ చ్చి ఉండవచ్చు.  వేరు వేరు వ్యాధుల్లో ఒకేరకం లక్షణాలు  ఉంటున్నప్పుడు, అది ఏ వ్యాధో మళ్లీ కొత్తగా పరీక్షించుకోవలసిందే. ముఖ్యంగా ఆ లక్షణాలు మళ్లీ మళ్లీ వస్తున్నప్పుడు  అశ్రద్ద చేయకుండా ఉండడం చాలా అవసరం. ముందు ఇచ్చిన మందులతో తగ్గకపోతే , మళ్లీ వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లడం  తప్పనిసరి.  ముందు తీసిన స్కాన్‌లో  కేన్సర్‌ లేనట్లు నిర్ధారణ  అయినా, ఓ రెండు,మూడు మాసాల తరువాత తీసిన స్కాన్‌లో  కేన్సర్‌ ఉన్నట్లు కనిపించవచ్చు. అంతకు ముందు ఏమీ లేదన్నారు కదా? ఇంతలోనే ఎలా వస్తుంది? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. 

అత్యంత సూక్ష్మాలు

కేన్సర్‌ కణాలు సూక్ష్మస్థాయిలో ఉన్నప్పుడు వాటి లక్షణాలేమీ కనిపించవు.  కానీ, ఆ కణాల్లో తీవ్రత ఉంటే చాలా  వేగంగా శరీరమంతా  విస్తరిస్తాయి. సాధారణంగా శ్వాసకోశ  కేన్సర్‌, ఆ కణితి ఉన్న ఆ ఒక్క శ్వాసకోశానికే పరిమితం కాకుండా, ఆ రెండవ శ్వాసకోశానికి  ఆ రెండింటిలోని వివిధ భాగాలకూ  కణాలు పాకుతాయి. అలాగే, మెడ భాగంలోని  నోడ్‌లలోకి కాలేయానికి,  అడ్రినల్‌ గ్రంధికి, ఎముకలకు, మెదడుకు  కూడా పాకుతాయి. అందువల్ల  కేన్సర్‌  కణాలు  శరీరంలో ఏ విభాగాలకు పాకిందో  నిశితంగా  పరిశీలించవలసి ఉంటుంది.  

నిర్ధారణ

ఏ కేన్సర్‌ విషయంలో అయినా,  వ్యాధి నిర్ధారణ, అది ఏ దశలోఉందో తెలుసుకోవడం, ఆ తరువాత చికిత్స ఇలా మూడు దశలు ఉంటాయి. శ్వాస కోశ  కేన్సర్‌ కణితి ఒకవేళ  ఉపరి భాగంలోనే ఉంటే, నీడిల్‌ పరీక్ష, లేదా బయాప్సీ పరీక్ష ల  ద్వారా వ్యాధి ఉన్న విషయాన్ని  నిర్ధారిస్తాం. ఒక వేళ కణితి శ్వాసకోశానికి మధ్యలో ఉంటే బ్రాంకోస్కోపి చే సి ఆ తరువాత బయాప్సి చేస్తాం. వీటితో పాటు ట్మూమర్‌ మార్కర్‌  (సిఈ) పరీక్షలూ  ఉంటాయి.  వ్యాధి నిర్ధారణ అయ్యాక  వ్యాధి  ఏ దశలో ఉందో నిర్ధారించుకోవలసి ఉంటుంది.  పెట్‌స్కాన్‌ ద్వారా  మెదడుతో  సహా శరీర భాగాలన్నిటినీ పరీక్షించడం  సాద్యమవుతోంది. అలాగే  కేన్సర్‌ శరీరంలోని  ఎన్ని భాగాలకు  విస్తరించిందో,  వ్యాఽధి ఏ దశలో ఉందో స్పష్టంగా  తెలిసిపోతుంది.  కొన్ని రకాల బోన్‌ మెటాస్టేసిస్‌లు, బ్రెయిన్‌ మెటాస్టేసిస్‌లు పెట్‌స్కాన్‌లోనూ కనిపించకపోవచ్చు. ఏదైనా  అనుమానం ఉన్నప్పుడు బోన్‌ స్కాన్‌,  ఎంఆర్‌ఐ  స్కాన్‌  కూదా చేయించవలసి  ఉంటుంది. నిజానికి, క్యాన్సర్‌ దశ నిర్ధారణ మీదే  కేన్సర్‌ చికిత్స ఆధారపడి ఉంటుంది. 

దశలను అనుసరించి...

ఒకవేళ  కేన్సర్‌ బాగా ముదిరిపోయిన  నాలుగో దశలో గుర్తిస్తే,  కీమో  థెరపీతో పాటు మోనోక్లోనల్‌  యాంటీబాడీస్‌  ఇవ్వడం ద్వారా వారి జీవిత కాలాన్ని పొడిగించవచ్చు. ఈ మధ్య బయాప్సి ముక్కను  ఈజిఎఫ్‌ఆర్‌ అనే  కొన్ని ప్రత్యేక పరీక్షలకు పంపుతున్నాం. ఆ రిపోర్టులో పాజిటివ్‌ అని వస్తే, కొన్ని రకాల మాత్రల ద్వారా కూడా  ఈ నాలుగో దశలో ఉన్న  కేన్సర్‌ ను నియంత్రించే వీలు ఉంటుంది.  ఒకవేళ కేన్సర్‌ మూడవ దశలో  (3-ఎ) ఉన్నప్పుడే గుర్తిస్తే, చాలాసార్లు కీమోథెరపీ, రేడియోథెరపీలను సంయుక్తంగా ఇస్తాం. కొన్నిసార్లు కీమో థె రపీతో వ్యాధిని కాస్త అదుపులోకి తెచ్చి  ఆ తరువాత  శస్త్ర చికిత్స కూడా చేస్తాం. అదే 3-బి దశలో ఉంటే, కీమో థెరపీ, రేడియో థెరపీ సంయుక్తంగా  గాని, ఒక దాని తరువాత ఒకటిగా  గానీ ఇస్తాం. కేన్సర్‌ను రెండవ దశలో గుర్తిస్తే, శస్త్ర చికిత్సతో పాటు  అవసరమైతే కీమోథెరపీ కూడా  ఇస్తాం. ఒకవేళ  కేన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే, కేవలం శస్త్ర చికిత్స ద్వారానే పూర్తిగా నయం చేయవచ్చు. నిజానికి  శ్వాసకోశ  కేన్సర్‌కు సిసలైన  వైద్యం, శస్త్ర చికి త్స మాత్రమే. మొదటి దశలోనే కణితిని గుర్తించగలిగితే, కీ -హోల్‌ సర్జరీ  ద్వారా తొలగించవచ్చు. కేన్సర్‌ బాగా ముదరపెట్టుకుని బాధపడే కన్నా, ఆధునిక వైద్య పరీక్షల ద్వారా ముందే గుర్తిస్తే, శ్వాసకోశ కేన్సర్‌ నుంచి  సంపూర్ణ విముక్తి పొందడం సాధ్యమవుతుంది 

డాక్టర్‌ సి హెచ్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, 
ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
ఫోన్స్‌: 9848011421