టార్గెటెడ్‌ థెరపీతో లంగ్‌ కేన్సర్‌కు చెక్‌

10-11-13

సరదాగా, ఆధునిక జీవనశైలిగా ప్రారంభమైన స్మోకింగ్‌ జీవితాన్ని నిలువునా కూలుస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. అయితే, లంగ్‌ కేన్సర్‌కు అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే వ్యాధి బాగా ముదిరిన దశలోనే అసుపత్రికి వస్తుంటారు. ఫలితంగా చికిత్స తాలూకు ఫలితాలు కనిపించడం లేదు. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే టార్గెటెడ్‌ థెరపీతో లంగ్‌ కేన్సర్‌ను సమూలంగా నయం చేయవచ్చు. వ్యాధి బాగా ముదిరిన దశలో ఈ చికిత్స తీసుకుంటే జీవితకాలం కొంత పొడిగించే అవకాశం ఉంటుందని అంటున్నారు మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ జి. వంశీకృష్ణారెడ్డి.

 
 
స్త్రీలలో బ్రెస్ట్‌ కేన్సర్‌గా ఎక్కువగా కనిపిస్తుంటే, పురుషులు ఎక్కువగా లంగ్‌ కేన్సర్‌ బారినపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్మోకింగ్‌. గత కొన్నేళ్లుగా మన దేశంలో లంగ్‌ కేన్సర్‌ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రాణాలు హరించే ఈ కేన్సర్‌పై చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.  
 
కారణాలు
లంగ్‌ కేన్సర్‌కు ప్రధాన కారణం స్మోకింగ్‌. అయితే పొగతాగే అలవాటులేని వారిలో 10 నుంచి 15 శాతం మందిలో కూడా లంగ్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కాలుష్యం, ఇతర కాలుష్య కారకాలు కారణమవుతుంటాయి. బొగ్గు ఎక్కువగా కాల్చే ప్రదేశాల్లో పనిచేసే వారిలోనూ లంగ్‌ కేన్సర్‌ కనిపిస్తుంది. 
 
లక్షణాలు ఇలా ఉంటాయి
లంగ్‌ కేన్సర్‌ బారినపడిన వారిలో కనిపించే సాధారణ లక్షణం దగ్గు. ఒక్కోసారి దగ్గుతో పాటు రక్తం పడుతుంది. బరువు తగ్గిపోతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఛాతీనొప్పి ఉంటుంది. ఎముకలలో నొప్పి ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. 
 
నిర్ధారణ సులువు
ఛాతీ ఎక్స్‌రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షలు వ్యాధిని గుర్తించడంలో ఉపయోగపడతాయి. బయాప్సీ పరీక్ష వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుంది. 
 
చికిత్స 
లంగ్‌ కేన్సర్‌ను గుర్తించే సరికి వ్యాధి అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉంటుంది. ఎందుకంటే సాధారణ దగ్గే కదా అని ముందుగా ఏవో మందులు వాడుతూ కాలం గడుపుతుంటారు. ఆ తరువాత దగ్గు ఎంతకూ తగ్గకపోయే సరికి టీబీ అనుకుని, కొంత కాలం టీబీ మందులు వాడతారు. అప్పటికీ తగ్గకపోయేసరికి కేన్సర్‌ వైద్యుల దగ్గరకు వస్తారు. కానీ అప్పటికే వ్యాధి అడ్వాన్స్‌ స్టేజ్‌లోకి వెళుతుంది. సాధారణంగా ఈ వ్యాధికి మూడు రకాల చికిత్స ఉంటుంది. అవి సర్జరీ, రేడియేషన్‌, కీమోథెరపీ.తొలిదశలో ఉన్నప్పుడు వస్తే కేన్సర్‌ ఉన్న భాగాన్ని తొలగించి రేడియేషన్‌ ఇస్తే సరిపోతుంది. కొద్దిగా విస్తరించినా కీమోథెరపీ ఇచ్చి ఆ తరువాత ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇప్పుడు కేన్సర్‌ చికిత్సలో అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగింది టార్గెటెడ్‌ థెరపీ. ఈ చికిత్స నేరుగా కేన్సర్‌ కణాలపై పనిచేస్తుంది. కణాలు అతుక్కుపోయి కేన్సర్‌గా మారడాన్ని నిరోధిస్తుంది. 
 
ఆ భయం వద్దు
కీమోథెరపీ తీసుకుంటే సైడ్‌ఎఫెక్ట్స్‌ చాలా వస్తాయని భయపడిపోతుంటారు. అయితే వాటన్నింటినీ సులభంగా అధిగమించవచ్చు. కీమోథెరపీ చికిత్స ముఖ్యోద్దేశం వేగంగా వృద్ధి చెందుతోన్న కణాలను చంపడం. కేన్సర్‌ కణాలు వేగంగా తయారవుతుంటాయి కాబట్టి వాటిని కీమో చికిత్స చంపుతుంది. దాంతోపాటు జుట్టు పెరగడానికి కారణమయ్యే కణాలు కూడా వేగంగా తయారవుతుంటాయి. అందుకే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆ కణాలను కూడా కీమోథెరపీ చంపుతుంది. కాబట్టి జుట్టు రాలిపోతుంది. నోట్లో కూడా కణాలు వేగంగా తయారవుతాయి. అందుకే నోట్లో పుండ్లు ఏర్పడినా వేగంగా తగ్గిపోతాయి. కీమో చికిత్స వల్ల నోట్లో కణాలు చనిపోయి పూతలాగా తయారవుతుంది. అలాగే రక్తకణాలు కూడా తగ్గిపోతాయి. అయితే వీటన్నింటిని మందులతో అధిగమించవచ్చు. సైడ్‌ఎఫెక్ట్స్‌తో భయపడిపోవాల్సిన అవసరం లేదు. 
 
నివారణ
లంగ్‌ కేన్సర్‌కు ప్రధాన కారణం స్మోకింగ్‌. కాబట్టి స్మోకింగ్‌ అలవాటు ఉంటే కనుక వెంటనే మానేయాలి. పాసివ్‌ స్మోకింగ్‌ కూడా ప్రమాదకరమే. కాబట్టి సిగరెట్లు తాగుతున్న వారికి దూరంగా ఉండాలి. హై రిస్క్‌లో ఉన్న వారు తరచుగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. తొలిదశలో ఉన్నప్పుడే గుర్తిస్తే కేన్సర్‌ను జయించడం సులువవుతుంది. 
 
నాకు కేన్సర్‌ రావచ్చా?
నేను రోజుకు ఒక సిగరెట్‌ మాత్రమే కాలుస్తాను. నాకు లంగ్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందా? అంటే దానికి ఒక్క లెక్కుంది. రోజూ ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ ఒక ఏడాది పాటు తాగితే ఒక ప్యాకియర్‌ అంటారు. అలా 30 ప్యాకియర్‌లు తాగితే హైరిస్క్‌లో ఉన్నట్లు చెప్పవచ్చు. ఫిల్టర్‌ సిగరెట్‌ తాగితే లంగ్‌ కేన్సర్‌ రాదని చాలా మంది భావిస్తుంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. బీడీ తాగినా, ఫిల్టర్‌ సిగరెట్‌ తాగినా లంగ్‌ కేన్సర్‌ రావడం మాత్రం ఖాయం. స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నప్పుడే కేన్సర్‌ దరిచేరకుండా ఉంటుంది. 
 
 
డాక్టర్‌ జి. వంశీకష్ణారెడ్డి
మెడికల్‌ ఆంకాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌
మలక్‌పేట్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 90006 00555