చికిత్స ఉంది! భయం లేదు!

ఆంధ్రజ్యోతి, 02-10-2018: కేన్సర్‌ వస్తే... రొమ్మును తొలగించవలసిందేనా? కీమో థెరపీ, రేడియేషన్‌లను భరించక తప్పదా? వంశపారంపర్యంగా సంక్రమించే వీలుంటే ఏం చేయాలి? అసలు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేమా? మహిళల్లో.... రొమ్ము కేన్సర్‌ గురించి ఇలాంటి అనుమానాలెన్నో! నిజానికి.... చికిత్సకు మించి అవగాహనతోనే ఈ వ్యాధిని జయించవచ్చు!

 
రొమ్ములో ఏ చిన్న గడ్డ చేతికి తగిలినా మహిళల గుండె ఝల్లుమంటోంది. వైద్య పరీక్షల్లో కేన్సర్‌ అని నిర్ధారణ జరిగితే ఇక అంతే సంగతులు! అంతటితో జీవితం అంతమైపోయింది అన్నంతగా కుంగిపోతున్నారు. అంతలా రొమ్ము కేన్సర్‌ మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తోంది. కానీ కేన్సర్‌ కూడా అన్ని వ్యాధుల్లాంటిదే! వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకుని, ప్రారంభంలోనే గుర్తించే మెలకువలను అలవరుచుకుంటే అంతలా భయపడవలసిన అవసరమే ఉండదు. మన అమ్మమ్మల కాలంతో పోల్చుకుంటే ఇటీవల రొమ్ము కేన్సర్‌ ఎక్కువగా ప్రబలుతున్న మాట వాస్తవమే! అయితే పాశ్యాత్య దేశాల్లో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము కేన్సర్‌ బారిన పడుతుంటే, మన దేశంలో ప్రతి 40 మందిలో ఒకరికి వ్యాధి నిర్ధారణ అవుతోంది.
 
జీవనశైలితో లింక్‌ ఉంది!
రొమ్ము కేన్సర్‌ కేసులు పెరగడానికి అన్నిటికంటే ప్రధానమైన కారణం... క్రమం తప్పిన ఆహార, జీవనశైలులు. అలాగే, వంశంలో ఎవరికైనా కేన్సర్‌ ఉన్నా, వారి సంతానం అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల కూడా రొమ్ము కేన్సర్‌ శాతం పెరుగుతోంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉండడం, శారీరక వ్యాయామం లోపించడం, మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు, ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేసే ఉద్యోగాలు... ఇవన్నీ కేన్సర్‌ కారకాలే! మరీ ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు పెరగడం వల్ల అదనపు కొవ్వులు శరీరంలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా కొవ్వులతో సంబంధం కలిగి ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లు రెండూ ప్రభావితమవుతున్నాయి. ఈ రెండు హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపించడం మూలంగా ఆ ప్రభావం మొదట రొమ్ముల మీద పడుతుంది. పర్యవసానంగా రొమ్ము కేన్సర్‌ తలెత్తుతుంది.
 
వంశపారంపర్యంగా వస్తుందా?
ఈ అవకాశం 20ు ఉంది. అయితే ఈ వ్యాధి తల్లి, తండ్రి... ఎవరి వైపు బంధువులకు ఉంది? దూరపు బంధుత్వమా? వారికి ఎలాంటి కేన్సర్‌ ఉంది? వంశపారంపర్యంగా కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఇలా ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటాయి. బంధువులను ఫస్ట్‌ డిగ్రీ, సెకండ్‌ డిగ్రీ... ఇలా బంధుత్వ దూరాన్ని బట్టి వర్గీకరిస్తే.... తల్లి, చెల్లి, కూతురు దగ్గరి రక్త సంబంధీకులు ఫస్ట్‌ డిగ్రీ కోవలోకి వస్తారు. ఈ కోవకు చెందిన మహిళలకు కేన్సర్‌ వచ్చే అవకాశాలు మిగతావారి కంటే ఎక్కువ. మేనత్తలు, కజిన్స్‌ (వాళ్ల పిల్లలు)... సెకండ్‌ డిగ్రీకి చెందిన బంధుత్వం కలిగిన మహిళలకు వంశపారంపర్యంగా కేన్సర్‌ వచ్చే అవకాశాలు కొంత తగ్గుతాయి. కాబట్టి కుటుంబ చరిత్రను బట్టి ప్రమాద అవకాశాలను లెక్కించవలసి ఉంటుంది. రొమ్ము కేన్సర్‌లో ట్రిపుల్‌ నెగిటివ్‌ రకానికి వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు మరీ ఎక్కువ. కాబట్టి ఈ రకమైన కేన్సర్‌ వంశంలో ఉంటే రెట్టింపు అప్రమత్తత అవసరం.
 
రొమ్ము తొలగించవలసిందేనా?

చికిత్సలో భాగంగా రొమ్ములోని కేన్సర్‌ గడ్డ మేరకు తొలగించినా, రొమ్ము మొత్తాన్ని తొలగించినా ఒకే రకమైన ఫలితం పొందవచ్చని క్లినికల్‌ ట్రయల్స్‌లో నిరూపణ అయింది. కాబట్టి కేన్సర్‌కు గురయినంత మాత్రాన రొమ్ము మొత్తాన్నీ తొలగించవలసిన అవసరం లేదు.

గడ్డ పరిమాణం, గడ్డల సంఖ్య, తత్వం, తీవ్రత, లింఫ్‌ గ్రంథులకు ఏ మేరకు పాకింది అనే అంశాల ఆధారంగా రొమ్ము ఉంచాలా, తీసేయాలా అనేది నిర్ణయించాలి.

ప్రధాన లింఫ్‌ గ్రంథికి సోకిందో లేదో తెలుసుకోవడం కోసం సర్జరీ సమయంలోనే లింఫ్‌ గ్రంథిలోని కొంత భాగాన్ని ‘సెంటినల్‌ లింఫ్‌ నోడ్‌ బయాప్సీ’ పరీక్ష చేసి, దానికి పాకిందీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఆ ఫలితాన్ని బట్టి ఆ ఒక్క లింఫ్‌ గ్రంథిని మాత్రమే తొలగించి, కీమోథెరపీతో చికిత్స చేయవచ్చు.

కేన్సర్‌ ముదిరిపోయి, రొమ్ములో రెండు మూడు చోట్ట గడ్డలు ఉన్నా, ఒకే పెద్ద గడ్డ ఉన్నా, గడ్డ కారణంగా రొమ్ము పుండు పడి, పాడైపోయినా రొమ్మును పూర్తిగా తొలగించక తప్పదు. ఇలా తొలగించినా అప్పటికప్పుడు, లేదంటే కేన్సర్‌ చికిత్స పూర్తయిన తర్వాత రొమ్మును పునర్నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో ఆధునిక చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

జీన్‌ టెస్ట్‌ అత్యవసరం
వంశపారంపర్యంగా రొమ్ము కేన్సర్‌ సంక్రమించే వీలున్న మహిళలకు ‘బ్రాకా టెస్ట్‌ (బిఆర్‌సిఎ) ఓ వరం లాంటిది. రొమ్ము కేన్సర్‌కు కారణమయ్యే 1 మరియు 2 జన్యువులను గుర్తించే పరీక్ష ఇది. 25 నుంచి 30 వేల రూపాయల ఖరీదు ఉండే ఈ పరీక్షతో వ్యాధి వచ్చే అవకాశాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంది. ఫలితాన్ని బట్టి, ఎంతో ముందుగానే నివారణ చికిత్సలను మొదలు పెట్టి వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అయితే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమించే వీలున్న మహిళలు ముందుగా కేన్సర్‌ వైద్య నిపుణుల్ని సంప్రతించి, వ్యాధి సంక్రమించే రిస్క్‌ ఉందనీ, పరీక్ష అవసరమనీ చెబితేనే ఈ పరీక్ష చేయించుకోవాలి.
 
భయం కాదు... అవగాహన ఉండాలి!
ఈ వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాలి. ‘నాకొస్తుందేమో?’ అని భయపడుతూ ఉండడం కంటే ‘నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరికి వారు ఆలోచించుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో పోల్చుకుంటే మన దేశంలో చిన్న వయసులోనే రొమ్ము కేన్సర్‌ తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఆ దేశాల్లో 60 ఏళ్లు దాటిన మహిళలు కేన్సర్‌కు గురైతే, మన దేశంలో 25 ఏళ్లకే వ్యాధి బారిన పడుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ప్రతి మహిళా టీనేజీ వయసు నుంచే ‘సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ జీవితంలో భాగం చేసుకోవాలి.

స్నానం చేస్తున్నప్పుడు, లేదా పడుకున్నప్పుడు కనీసం నెలలో ఒక్కసారైనా చేతితో రొమ్ములను పరీక్షించుకోవాలి. ఇందుకోసం ఒక నిమిషం కేటాయించుకోవాలి.
ఈ పరీక్షకు అనుకూలమైన సమయం నెలసరి ముగిసిన మూడు రోజుల తర్వాత. నెలసరికి కొన్ని రోజుల ముందు నుంచి రొమ్ములు గట్టిపడతాయి కాబట్టి ఆ సమయంలో పరీక్షించుకుంటే గడ్డలు ఉన్నాయేమో అనే అనుమానం రావొచ్చు. కాబట్టి నెలసరి ఆగిన తర్వాత స్వీయ పరీక్ష చేసుకోవాలి.
 
ఫలితం పాజిటివ్‌గా వస్తే...
మూడు రకాల చికిత్సా పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది
మొదటిది.... సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌, ప్రతి 6 నెలలకు స్ర్కీనింగ్‌ (మామోగ్రఫీ, అలా్ట్రసౌండ్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌), క్రమం తప్పకుండా వైద్యులను సంప్రతించడం.
రెండోది... రొమ్ము కేన్సర్‌ నుంచి రక్షణ కల్పించే ‘నోటి మాత్ర’! ఈ మాత్రలను వైద్యుల సూచన మేరకు వాడవలసి ఉంటుంది.
మూడో చికిత్సా పద్ధతి కేన్సర్‌ వచ్చే వీలున్న అవయవాన్ని తొలగించడం. ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ అనుసరించిన పద్ధతి ఇదే! వీళ్లలో రొమ్ము కేన్సర్‌ సంక్రమించే జన్యువులు ఉంటాయి. కాబట్టి వీళ్లకు లాగా ఎప్పటికైనా వ్యాధి వచ్చే అవకాశాలు 80 శాతానికి మించి ఉంటే, రొమ్ములు తొలగించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు.
 
ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు!
రొమ్ము ఆకారంలో స్పష్టమైన మార్పు కనిపించినా...
అకారణంగా సైజు పెరిగినా..
రొమ్ము పైచర్మం నారింజ, ఎరుపు రంగుల్లోకి మారినా...
స్రావం కనిపించినా...
రొమ్ములో గడ్డ నొప్పి పెట్టినా, పెట్టకపోయినా....
 
 

డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ దాదిరెడ్డి,
కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,
కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌,
హైదరాబాద్‌