సైబర్‌ నైఫ్‌తో కేన్సర్‌ రేడియేషన్‌ ఇక 5 రోజులే

09-07-13

కేన్సర్‌ అనగానే మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని   అది కూడా మిగతా వ్యాధుల్లాంటిదేననే అవగాహన ఇటీవలి కాలంలోచాలా మందిలో పెరిగింది. అయినా   నెలరోజులకు పైగా సాగే వైద్య చికిత్సలంటేనే చాలా మందికి బెరుకుగానూ, దిగులుగానూ ఉంటూ వచ్చేది. ప్రత్యేకించి  30 నుంచి 45 రోజుల దాకా  సాగే రేడియేషన్‌ అంటే చాలా మందిలోఒక భయాందోళన మొదలయ్యేది. వాటన్నిటికీ విరుగుడుగా ఇప్పుడు సైబర్‌నైఫ్‌ రేడియేషన్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. రోబో సహాయంతో ఇచ్చే ఈ రేడియేషన్‌ కేవలం 5రోజుల్లోనే పూర్తవుతుంది. మరికొందరికైతే అంతకన్నా  తక్కువ రోజులే సరిపోతుంది. కేన్సర్‌ వైద్య చికిత్సలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అంటున్నారు, కేన్సర్‌ వ్యాధినిపుణులు డాక్టర్‌  సిహెచ్‌ మోహన వంశీ....

 

కేన్సర్‌ నుంచి కూడా పూర్తిగా విముక్తినిచ్చే దశకు వైద్య శాస్త్రం చేరుకుంది. కానీ, ఆ చికిత్సలే చాలా మందికి బెంబేలెత్తిస్తుంటాయి. దానికి కారణం కీమో థెరపీ గానీ, రేడియేషన్‌ థెరపీ గానీ, నెలకు పైగా కొనసాగడమే. ఎవరికైనా ఒక వ్యాధి మొదలవగానే అతని దైనందిన జీవితపు బాధ్యతలన్నీ పక్కకు తొలగిపోవు కదా! ఏదో నాలుగైదు రోజులంటే ఎలాగోలా సర్దుకుపోవచ్చు. పక్కవారైనా సహకరించడానికి ముందుకు వస్తారు. అలా కాకుండా ఏకంగా నెల రోజులకు పైగా హాస్పిటల్‌లోనే మకాం వేస్తే ఎంత ఆత్మీయులైనా ఎలా అండగా నిలబడతారు? కొత్తగా వచ్చిన సైబర్‌ నైఫ్‌ రేడియేషన్‌ కేవలం 5 రోజుల్లోనే పూర్తి కావడం కేన్సర్‌ బారిన పడిన వారి పాలిటి ఒక గొప్ప శుభవార్త.
చికిత్సా కాలం తగ్గడమే కాకుండా రేడియేషన్‌ దుష్పరిణామాలు కూడా గణనీయంగా తగ్గడం మరో ప్రయోజనం. ఒకప్పటి రేడియేషన్‌ విధానంలో కేన్సర్‌ కణాలే కాకుండా కణితి పక్కనే ఉన్న సామాన్య కణాలు కూడా పెద్ద మొత్తంలోనే చనిపోయేవి. దీని వల్ల పలురకాల దుష్పరిణామాలు తలెత్తేవి. రోగి కోలుకోవడానికి కూడా ఎక్కువ కాలం పట్టేది. ఈ సైబర్‌నైఫ్‌తో ఆ సమస్య లేదు. సూటిగా, కచ్ఛితంగా కేన్సర్‌ కణాలే లక్ష్యంగా ఈ రేడియేషన్‌ సాగడం వల్ల ఆ దుష్పరిణామాలు గణనీయంగా బాగా తగ్గిపోయాయి. 

అన్ని దిశల్లోంచి...

కేన్సర్‌ చికిత్సలో అనేక రకాలైన రేడియేషన్‌ చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బయటినుంచి ఇచ్చే ఎక్స్‌టర్నల్‌ రేడియో థెరపీ, లోపలనుంచి ఇచ్చే ఇంట్రా కేవిటీ రేడియో థెరపీ, కణితిలోనే రేడియేషన్‌ సోర్స్‌ను అమర్చి ఇచ్చే ఇంటెస్టీషనల్‌ రేడియో థెరపీ ఇలా ఎన్నో వచ్చాయి. ఇప్పటికదాకా వచ్చిన అన్ని రేడియో థెరపీల లక్ష్యం ఏమిటంటే, రేడియేషన్‌ను పూర్తిగా కణితికే పరిమితం అయ్యేలా చేస్తూ, ఆ కణితి పక్కనున్న సాధారణ కణజాలానికి హాని కలగకుండా ఉండేలా చూడటం. సాధారణంగా ఇప్పటిదాకా వినయోగిస్తూ వచ్చిన రేడియో థెరపీల్లో ఆ పక్కనున్న సాధారణ కణజాలం కూడా దె బ్బతింటూ వ చ్చాయి. ఒక దాని తరువాత ఒకటిగా వస్తున్న కొత్త రేడియేషన్‌ విధానాలన్నీ ఇతర కణజాలం దెబ్బతినే నష్టాన్ని బాగా తగ్గిస్తూ రావడమే లక్ష్యంగా ఉంటోంది. కణితి మీదే ఎక్కువ మొత్తంలో రేడియేషన్‌ ఇస్తూ, కణితి పక్కనున్న సాధారణ కణజాలం మీద అతి తక్కువ ప్రభావం పడేలా చూడటం వీటి వెనుక ఒక పరమార్థంగా ఉంటోంది. 

ఈ క్రమంలో ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ సైబర్‌ నైఫ్‌ రేడియేషన్‌ థెరపీ.ఈ రేడియేషన్‌ కిరణాలు సూటిగా కచ్ఛితంగా ఆ కణితిమీదికే వెళుతున్న కారణంగా నైఫ్‌ అన్న పేరు పెట్టారే గానీ, అందులో కత్తి ఏదీ ఉండదు. అందువల్ల కత్తితో కోసే ప్రక్రియ ఏదీ ఇందులో ఉండదు.

రోబో సహకారంతో

మిగతా రేడియేషన్‌ యంత్రాలన్నీ ఒక స్టాండ్‌ కు బిగించబడి ఉంటాయి. ఆ స్టాండ్‌ కేంద్రంగా రోగి చుట్టూ తిరుగుతూ రేడియేషన్‌ ఇస్తూ ఉంటాయి. అయితే సైబర్‌ నైఫ్‌ రేడియేషన్‌ మిగతా వాటికన్నా చాలా భిన్నమైనది. ప్రత్యేకించి దీనికి 6 -ఎం.ఇ. .వి ఎనర్జీ లీనర్‌ యాక్జిలేటర్‌ ఉంటుంది. దీనికి మెగా ఓల్టేజ్‌తో రేడియేషన్‌ ఇచ్చే శక్తి ఉంటుంది. ఈ సైబర్‌ నైఫ్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఒక స్టాండ్‌కు కాకుండా ఒక సన్నని పెన్సిల్‌ లాంటి పరికరానికి బిగించబడి ఉంటుంది. రోబో సహాయంతో పనిచేస్తుంది. అందువల్ల ఏ వైపునకైనా అత్యంత సులువుగా వంగుతుంది. దీని ద్వారా మెదడు, స్పైన్‌, శ్వాసకోశాలు, లివర్‌, క్లోమగ్రంధి, ప్రోస్టేట్‌ ఇలా ఏ భాగంలోనైనా క చ్చితంగా ఆ కణితికే తాకేలా రేడియేషన్‌ ఇవ్వవచ్చు. ఇది ఇమేజ్‌ గైడెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమవుతోంది. దీంట్లో 6 డైమెన్షనల్‌ ఇమేజ్‌ ఉంటుంది. శరీరంలోని ఏ భాగాన్నయినా కచ్ఛితంగా గుర్తిస్తూ, రోబో వెళ్లి ఆ కణితిని లక్ష్యంగా చేసుకుని పసిచేస్తుంది. అత్యధిక ఓల్టేజ్‌ను ఒకే ఒక్క దఫాగా ఇస్తుంది. రోబో సహాయంగా వెళ్లే ఈ రేడియేషన్‌ ఫలానా వైపు వెళ్లదనే ప్రసక్తే లేకుండా అన్నికోణాల్లోంచి వెళుతుంది. అంత ఎక్కువ ఓల్టేజ్‌లో రేడియేషన్‌ ఇస్తూ కూడా పక్కనున్న సామాన్య కణజాలం మీద దాని ప్రభావం పడకుండా చేయడం ఈ సైబర్‌ నైఫ్‌ విశేషం. లీనియర్‌ యాక్సిలేటర్‌ను రోబోటిక్‌ మ్యానిపులేటర్‌ మీద దీన్ని ఉంచి చేస్తారు కణుతుల్ని, కేన్సర్‌ కణాల్ని కచ్ఛితంగా గుర్తించే డిటెక్టర్లు కూడా ఈ సైబర్‌ నైఫ్‌కు బిగించబడి ఉంటాయి. రోగికి సంబంధించి ఆ సరియైన సమయాన్ని కంప్యూటర్లు నిరంతరంగా గమనిస్తూ, వాటి ని ఇమేజ్‌ చేస్తూ రేడియేషన్‌ ఇస్తుంది. రోగి కదిలితే ఈ రోబో కూడా అతనితో పాటే ఆయా అవయవాన్ని వెంటాడుతూనే కదులుతుంది. కాబట్టి ఒకప్పటిలా రోగిని బిగదీసి పట్టి ఉంచాల్సిన అవసరం లేకుండా పోయింది. 

రోబోటిక్‌ ట్రీట్‌మెంట్‌ కౌచ్‌

రోగికి దగ్గరగా వెళ్లి ఏ కోణం లోంచి కావాలనుకుంటే ఆ కోణంలోంచి కదులుతూ అన్ని కోణాల్లోంచి కదులుతూ అనుకున్నఆ కచ్ఛితమైన సమయంలో కచ్ఛితమైన చోట రేడియేషన్‌ ఇవ్వగలగడం ఇందులో విశేషంగా ఉంటుంది. రోగి సహజంగానే భయం వల్లగానీ, అసహనం వల్లగానీ, తనకు ఉన్న ఇబ్బందుల వల్ల గానీ, అటూ ఇటూ కదులుతూ ఉంటాడు. అయితే అతడు ఎన్ని వైపులకు కదిలినా ఇబ్బంది లేకుండా కణితినుంచి ఏమాత్రం పక్కకు జరగకుండా రేడియేషన్‌ ఇవ్వడం ఈ సైబర్‌ నైఫ్‌ద్వారా సాధ్యమవుతోంది. 

ట్రాకింగ్‌ సిస్టమ్‌

ఇది అత్యంత సూక్ష్మము సున్నిత భాగాల్లోకి కూడా సూటిగా చొచ్చుకుపోయి రేడియేషన్‌ ఇస్తుంది. ఉదాహరణకు మెదడులోని పిట్యూటరీ గ్రంధిలోనే కణితి ఉంటే కఫాలంలో ఇతర కణజాలానికి ఏమాత్రం నష్టం జరగకుండా ఆ గ్రంధికే రేడియేషన్‌ ఇచ్చే ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఈ సైబర్‌ నైఫ్‌లో ఉంది. ఇలాంటివే పలురకాల ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ ఈ విధానంలో ఉన్నాయి.

ఇవీ తేడాలు

ఇప్పటిదాకా ఉన్న కన్వెన్షనల్‌ చికిత్సలకు, ఈ సైబర్‌ నైఫ్‌ చికిత్సలకూ మఽధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. కన్వెన్షనల్‌ రేడియేషన్‌లో 30 నుంచి 40 ఫ్రాక్షన్లలో 6 నుంచి 8 వారాల్లో ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. అదే సైబర్‌నైఫ్‌ ద్వారా ఇచ్చే రేడియేషన్‌ 1 నుంచి 5 రోజుల్లోనే పూర్తవుతుంది. పక్కనున్న కణజాలం ఏదీ దెబ్బ తినకపోవడం ఇతర చికిత్సల కాలం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఏ దూరప్రాంతం నుంచి వచ్చిన వారైనా రేడియేషన్‌ తీసుకుని గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. మొత్తం పూర్తి కావడం కూడా ఐదు రోజుల్లోనే. కొందరికైతే రెండు మూడు రోజులే సరిపోతుంది. వారిలో కొందరికి ఒక్కరోజు రేడియేషన్‌ కూడా సరిపోతుంది. 30 రోజుల రేడియేషన్‌ కాలం ఇలా 5 రోజులకు తగ్గిపోవడం నిజంగా కేన్సర్‌ వైద్య చరిత్రలో ఒక విప్లవాత్మకమైన పరిణామమే.
సైబర్‌ నైఫ్‌ను విఎస్‌ఐ అంటారు. విఎస్‌ఐ అంటే వెర్సటైల్‌-సింపుల్‌- ఇంటెలిజెంట్‌ అని అర్థం. ఈ రేడియేషన్‌ చాలా సామాన్యంగానూ, ఎంతో తెలివిగానూ, బహుముఖంగానూ ఇచ్చే విధానం కావడం వల్ల సైబర్‌నైఫ్‌కు ఆ ట్యాగ్‌ను జతచేశారు.

శరీరంలో ఏ భాగంలోనైనా...

శరీరంలోని ఏ భాగంలోని కేన్సర్‌ కణితికైనా సైబర్‌నైఫ్‌ ద్వారా చికిత్స చే యవచ్చు. ఉదాహరణకు బ్రెయిన్‌ ట్యూమర్‌, స్పైన్‌, శ్వాసకోశ, ప్రొస్టేట్‌, క్లోమగ్రంధి, ఇలా శరీరంలోని ఏ బాగంలోని కేన్సర్‌ కణితికైనా రేడియేథెరపీ ఇచ్చే అద్భుతమైన యంత్రం ఇప్పుడు మానవాళికి అందుబాటులో ఉంది. ఇది కేన్సర్‌ వైద్య చికిత్సలో ఒక పెద్ద ముందడుగే మరి. వరుసగా 30 రోజుల పాటు రేడియేషన్‌ ఉంటుందనగానే చాలా మంది రోగులు బెంబేలెత్తిపోయేవారు. ఆ కాలంలో తమ దైనందిన జీవితపు విధులకు దూరం కూడా వారికి ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు అలా లేదు కేవలం 5 రోజుల్లోనే రేడియేషన్‌ పూర్తవుతుంది తిరిగి తన ఇంటికి వెళ్లడానికి ఆనందంగా ఆత్మీయుల మధ్య జీవించడానికి ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది. 
డాక్టర్‌ సి హెచ్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, 
ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
ఫోన్స్‌: 9848011421