టూత్‌పేస్టుతో పేగు కేన్సర్‌

వాటిలో ఉండే ‘ట్రైక్లోసన్‌’ వల్లే

వాషింగ్టన్‌, మే 31: వేప పుళ్ల పాయే.. బొగ్గు పాయే.. టూత్‌పేస్టు చేతికి వచ్చే! పళ్లు శుభ్రం చేసుకోవాలంటే చేతిలో బ్రష్‌.. దానికింత పేస్టు ఉండాల్సిందే. లేకపోతే నోరు కడిగిన సంతృప్తి కూడా ఉండదు. అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా.. పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్స్ట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ‘ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేరు. వాడితే మనిషికి ప్రమాదమే’ అని తెలిపారు. ఎలుకలకు ట్రైక్లోసన్‌ తినిపించి పరిశోధనలు చేయగా వాటి లో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) చనిపోయినట్లు తేలిందన్నారు. అమెరికాలో కొన్ని ఉత్పత్తులపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో ఈ రసాయనంపై ఎక్కడా నిషేధం లేదని వివరించారు. ఇప్పటికే ఈ రసాయనం ప్రపంచం నలువైపులా సబ్బులు, టూత్‌పే్‌స్టల రూపంలో వ్యాపించిందని, దీనివల్ల మరింత నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
 
ట్రైక్లోసన్‌ ముఖ్యాంశాలు, దాని వల్ల నష్టాలు
సబ్బులు, శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు వాడే ఇతర సాధనాల కంటే వేడి నీళ్లే నయం అని ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు తెలిపారు. ట్రైక్లోసన్‌తో గట్‌ బ్యాక్టీరియా చనిపోతుందని హెచ్చరించారు.
 
అయినా, ఇప్పటికీ దాదాపు 2వేల ఉత్పత్తుల్లో ట్రైక్లోసన్‌ వాడుతున్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల్లోనూ ఈ రసాయనం ఉంది.
 
ఈ రసాయనం హర్మోన్‌ వ్యవస్థను దెబ్బతీస్తుందని జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలింది. ఆడ ఎలుకల్లో గర్భ విచ్ఛిత్తికీ కారణమైంది.
భూతాపం కంటే ప్రమాదం.. ట్రైక్లోసన్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు.