వేపతో కేన్సర్‌ పని కట్టు!

‘నింబోలైడ్‌’తో కణితులపై పోరు
రసాయనం పని చేసే విధానాన్ని కనుగొన్న హైదరాబాదీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్‌, జూన్‌ 20: నలభై రకాల వ్యాధుల నివారిణి.. వేప. సమ శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే దీని పుట్టిల్లు. వేప బెరడు, ఆకు, పువ్వు, పండు.. ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి. మనిషికి, వేప చెట్టుకు ఉన్న బంధం ఈ నాటిది కాదు. ‘పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు.’ అని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలోనే వేప గొప్పతనాన్ని చెప్పాడు చరకుడు. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ దాకా వేప ఉండాల్సిందే. అంతేనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని సైతం మట్టుబెట్టే సుగుణవంతురాలు వేప అని హైదరాబాదీ శాస్త్రవేత్తలు తేల్చారు.
 
వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్‌ అనే రసాయనం.. పలు రకాల కేన్సర్‌ కణితులను తుత్తునీయలు చేస్తుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు తెలిపారు. నింబోలైడ్‌కు కేన్సర్‌ను అంతమొందించే లక్షణాలు ఉన్నాయని 2014లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయానాన్ని కేన్సర్‌ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించగా ఫలితం అందలేదని, అదే మందు రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్‌ కణితులు మాయమైనట్లు వివరించారు. దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.