స్ర్కీనింగ్‌ పరీక్షలతో కేన్సర్‌ను ఓడిద్దాం

02-01-13

కేన్సర్‌ను ఆదిలోనే గుర్తించడం కన్నా గొప్ప ప్రయోజనం మరొకటి లేదు. ఒకప్పుడైతే, అలా ముందే గుర్తించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకే కేన్సర్‌ బారిన పడిన ఎంతో మంది అర్థాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు . అయితే, కేన్సర్‌ను తొలిదశలోనే అంటే లక్షణాలు కనిపించిన వె ంటేనే పరీక్షించే డైగ్నాసిస్‌ విధానాలు, లక్షణాలు కనిపించకముందే ఆ పరిస్థితుల్ని ముందే గుర్తించే స్ర్కీనింగ్‌ విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటినీ వినియోగించుకుంటే కేన్సర్‌ను జయించడం నిజంగా ఎంతో సులువంటున్నారు, కేన్సర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ సిహ్‌ మోహన వంశీ....
 
కేన్సర్‌ను జయించాలంటే కేన్సర్‌ను చాలా ముందుగా గుర్తించాలి. అలా ముందుగా గుర్తించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో కేన్సర్‌ మొదలైన తొలిదశలోనే గుర్తించే డైగ్నాసిస్‌ విధానాలు. రెండవది కేన్సర్‌ రాకముందే పరీక్షలు చేసే స్ర్కీనింగ్‌ విధానాలు.ఇందులో భాగంగా కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన ముందస్తు హెచ్చరికల గురించిన అవగాహన పెంచుకోవడం, ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. ముందు ఫ్యామిలీ ఫిజిషియన్‌ను సంప్రదించి, అది కేన్సర్‌ అవునో కాదో ఒక నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం. లక్షణాలు పదే పదే కనిపిస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇదంతా డైగ్నాసిస్‌ లోకి వస్తుంది. ఇక రెండవది స్ర్కీనింగ్‌. ఈ రెండు విషయాల్లో అవగాహన పెరిగితే, కేన్సర్‌ను జయించడం తేలికవుతుంది. కొన్ని రకాల కేన్సర్‌లు ఏ విధమైన లక్షణాలు కనిపించకుండానే శరీరమంతా పాకుతుంది. అండాశయ కేన్సర్‌ ఈ కోవలోకి వస్తుంది. అరుదుగా ఇలాంటి కొన్ని రకాల కేన్సర్లను ముందుగా గుర్తించలేం కానీ, మిగతా చాలా రకాల కేన్సర్లను ముందే గుర్తించే వీలుంది. 

వ్యాధి లక్షణాలు కొన్ని...

ఎక్కువ రోజులుగా మానకుండా ఉండిపోయిన పుండు, శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా పెరుగుతూ వెళుతున్న కణుతులు, జననాంగం నుంచి గానీ, స్తనాలనుంచి గానీ, మలమూత్రాల ద్వారా గానీ, లేదా నోటి ద్వారా గానీ రక్తస్రావం కావడం, అజీర్తిగా ఉండడం, కడుపు ఉబ్బరం, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, వాంతులు కావడం, తగ్గకుండా కొనసాగే దగ్గు, గొంతు బొంగురుబోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే మల మూత్ర విసర్జనలో తేడాలు రావడం అంటే విసర్జన సంఖ్య పెరగడం గానీ, తగ్గడం గానీ, జరగడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తక్కువ గ్రేడ్‌లో జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

స్ర్కీనింగ్‌ విధానం

శరీరంలో కేన్సర్‌ తాలూకు ఏ లక్షణాలూ కనిపించకున్నా ముందు జాగ్రత్తగా కొన్ని పరీక్షలు చేసుకోవడం ఈ స్ర్కీనింగ్‌ విధానం. ఎందువల్ల అంటే కొందరిలో ఏ వ్యాధి లక్షణాలు కనిపించకుండానే కేన్సర్‌ పెరుగుతూ ఉండవచ్చు. డైగ్రాసిస్‌, స్ర్కీనింగ్‌ విధానాలు రెండూ అనుసరిస్తే, కేన్సర్‌నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి ఎక్కువ ఆవకాశాలు ఉంటాయి. స్ర్కీనింగ్‌ అనేది ఆరోగ్యవంతులుగా ఉన్నవారిని కూడా పరీక్షించడం. ఇందుకు కొన్ని సామాన్య పరీక్షలు చేయవలసి ఉంటుంది. అలా అని ప్రతి ఒక్కరూ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని కూడా కాదు.

స్ర్కీనింగ్‌ ఎవరికి? 

పొగాకు ఉత్పత్తులు వాడేవారు, అతిగా మద్యం సేవించేవారు, మద్యం, పొగాకు ఉత్పత్తులు ఈ రెండూ తీసుకునే వారు, చాలా కాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారు, వీళ్లకు కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. శారీరీక వ్యాయామం చేయని వారు, స్థూలకాయులు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అతిగా తినేవారు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారు, రసాయనాల్ని ఎక్కువగా వినియోగించే పరిశ్రమల్లో పనిచేసేవారు, వీళ్లంతా స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. కుటుంబ పూర్వీకుల్లో కేన్సర్‌ ఉన్నవారు, వయసు పైబడిన వారు కూడా స్ర్కీనింగ్‌ చేయించుకోవడం అవసరం. 

రొమ్ము కేన్సర్‌ నిర్ధారణకు 

వయసు పెరిగే కొద్దీ రొమ్ము కేన్సర్లు వచ్చే వీలుంది కాబట్టి, తరుచూ స్ర్కీనింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రేయస్కరం. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలు విధిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే సంతానం లేని వారు, 30 ఏళ్లు దాటాక తొలిసారిగా గర్భధరించిన స్త్రీలు, కుటుంబంలో కేన్సర్‌ చరిత్ర ఉన్న వారు, రాత్రిళ్లు ఎక్కువగా పనిచేసేవారు, పొగతాగే వారు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వారు ఈ స్త్రీలంతా స్ర్కీనింగ్‌ చేయించుకోవడం చాలా అవసరం. స్ర్కీనింగ్‌ స్వీయ పరీక్ష, శిక్షణ పొందిన వారితో పరీక్షించుకోవడం, మ్యామోగ్రఫీ.

స్వీయపరీక్ష

20 ఏళ్లు దాటిన ప్రతి స్త్రీ తమకు తాముగా రొమ్ము పరీక్ష చేసుకోవాలి. బహిష్టు అయిన వారం తరువాత. సబ్బు చేతులతో పరీక్షించడం సులువవుతుంది కాబట్టి స్నానం చేస్తున్న సమయంలో అరచేతితో పరీక్షించుకోవాలి. కుడి రొమ్మును, ఎడమ అరచేతితో, ఎడమ రొమ్మును కుడి అరచేతితో ఆయా భాగంలో తాకి చూడటం ద్వారా ఏదైనా మార్పు వచ్చి ఉంటే గమనించవచ్చు. స్నానం తరువాత అద్దం ముందు నిలుచుని రొమ్ముల పరిమాణంలో ఏమైనా తేడా వచ్చిందో గమనించాలి. చనుమొనలు ఒకే పరిమాణంలో ఒకే వరుసలో ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. అలాగే రక్తస్రావం ఏమైనా అవుతోందేమో కూడా చూసుకోవాలి.ఆ తరువాత మంచం మీద పడుకుని, భుజం కింద దిండు పెట్టుకుని మరోసారి అరచేతితో తడుముతూ పరీక్షించుకోవాలి. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు కూడా ప్రతి నెలా ఒక తేదీ అనుకుని ఆరోజున రొమ్ము పరీక్ష చేసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతినెలా ఈ పరీక్షలు చేసుకుంటూ ఉండిపోతే డాక్టర్‌ కన్నా ముందే వారే తమ సమస్యను గుర్తించగలుగుతారు. 

సుశిక్షితులతో పరీక్షలు

స్వీయ పరీక్షతో పాటు 20 నుంచి 40 ఏళ్ల లోపున్న స్త్రీలు ప్రతి మూడేళ్లకు ఒకసారి, తమ డాక్టర్‌తో గానీ, ఒక శిక్షణ పొందిన నర్స్‌తో పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన స్త్రీలు ఏటా ఒకసారి డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవాలి.

మ్యామోగ్రఫీ పరీక్ష

మొదటి సారిగా ఈ పరీక్షను 30వ ఏట, ఆ తరువాత 35వ ఏట, ఆ తరువాత 40వ ఏట మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వారు 50 ఏళ్లు వచ్చేదాకా ప్రతి రెండు నెలలకు ఒకసారి కేన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటాక ఏటా ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. కేన్సర్‌ చరిత్ర గల కుటుంబం వారు, పొగాకు, మద్యం అలవాటు ఉన్నవారు మాత్రం 40 ఏళ్ల నుంచే ఏటా ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. అయితే ఇప్పుడు డిజిటల్‌ మేమోగ్రఫీ కూడా అందుబాటులో ఉంది. దీనిద్వారా పరీక్ష చేయించుకుంటే రేడి యేషన్‌ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు జన్యుమూలాలను గుర్తించే పరీక్షలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 

గర్భాశయ ముఖద్వార( సర్వైకల్‌) కేన్సర్‌

20 ఏళ్లు వచ్చి, వివాహితలైన స్త్రీలందరూ, ఏటా ఒకసారి పాప్స్‌మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. అలా మూడుసార్లు పాప్స్‌మియర్‌ పరీక్ష రిపోర్టులు నార్మల్‌గా వస్తే, ఆ తరువాత రెండేళ్లకు ఒకసారి గానీ, మూడేళ్లకు ఒకసారి గానీ పాప్స్‌మియర్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. లిక్విడ్‌ బేస్డ్‌ పాప్‌స్మియర్‌ పరీక్షా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వ చ్చాయి. వీటిద్వారా మరింత స్పష్టంగా రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ అనుమానంగా ఉంటే హెచ్‌పివి- డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవచ్చు, అలాగే హెచ్‌ఐవి ఉన్నవాళ్లు, ఏవైనా పుట్టుకతో వచ్చిన వ్యాధులు ఉన్నవారు, అవయవమార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ చేయించుకున్నవారు ఎక్కువ కాలం స్టెరాయిడ్స్‌ తీసుకున్న వాళ్లు, ఎక్కువ మంది సంతానం ఉన్నవారు, అపరిశుభ్రమైన వాతావరణంలో జీవించేవారు, ఏటా ఒకసారి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. 
గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ రావడానికి హెచ్‌పివి వైరస్‌ కారణమని తేలిపోయాక టీకాలు వచ్చాయి. ఈ టీకాలు తీసుకోవడం ద్వారా ఈ కేన్సర్‌ రాకుండా నివారించే అవకాశం ఉంది. ఈ టీకాలను 10 నుంచి 12 ఏళ్ల లోపు వయసులో తీసుకోవడం ఉత్తమం. పెళ్లి కాని అమ్మాయిలంతా ఈ టీకాలు తీసుకోవాలి. అప్పటికే పెళ్లి అయిపోయేనాటికీ ఇంకా ఈ టీకాలు తీసుకోకపోతే, ఒక కేన్సర్‌ సోకలేదని నిర్ధారించుకుని ఈ టీకాలు తీసుకోవచ్చు. చిన్న వయసులో తీసుకోవడం ఉత్తమమే అయినా 46 ఏళ్ల వయసుదాకా ఈ టీకాలు తీసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణంగానైనా అప్పటికే గర్భాశయాన్ని తీసివేసి ఉంటే, వారు అంత క్రమంగా పాప్స్‌మియర్‌ పరీక్ష చేయించుకోవలసిన అవసరం లేదు. ఈ సర్వైకల్‌ కేన్సర్‌ కారణంగానే మనదేశంలో ప్రతి 8 ఎనిమిది నిమిషాలకు ఒక స్త్రీ ప్రాణం కోల్పోతోంది. మొత్తంగా చూస్తే లక్షా 34 వేల మంది ఏటా మనదేశంలో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పాప్సిమిమర్‌ పరీక్ష గురించిన అవగాహన, టీకాల గురించిన అవగాహన పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. 

ఎండోమెట్రియల్‌ కేన్సర్‌

గర్భాశయ వ్యవస్థలో వచ్చే ఈ కేన్సర్‌లు కూడా భారత దేశంలో ఎక్కువవుతున్నాయి. దీనికి స్ర్కీనింగ్‌ పరీక్షలేమీ లేకపోయినా, రుతుక్రమం ఆగిపోయిన వారిలో రక్తస్రావం అయితే, తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. అంతకు ముందే రొమ్ము కేన్సర్‌ వచ్చిన వారిలో అయితే ఈ కేన్సర్‌ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అండాశయ కేన్సర్లు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. 

పురుషులకోసం

50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ వయసు దాటిన వారంతా ఏటా ఒకసారి ప్రొస్టేట్‌ స్పెసిపిక్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను ఈ పరీక్షతో కచ్చితంగా ముందే గుర్తించే వీలుంటుంది. కేవలం రక్తపరీక్షతోనే ఈ వ్యాధినిర్ధారణ అవుతుంది. ఇదే కాకుండా నిపుణలతో డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష కూడా చేయించుకోవాలి. దీనితో వ్యాధిని ముందే గుర్తించే వీలుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రొస్టేట్‌ కేన్సర్‌కు గురై ఉంటే వారు 45 ఏళ్ల నుంచే ఏటా ఒకసారి పరీక్ష చేయించుకోవడం అవసరం. అయితే స్త్ర్కీనింగ్‌ రిపోర్టులు నార్మల్‌ అని వచ్చినా మధ్యలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌రను సంప్రదించడం మంచిది. పెద్ద వయసులో సర్వైకల్‌ కేన్సర్‌ టీకాలు తీసుకున్నవారు , మూడేళ్లకు ఒకసారి పాప్స్‌మిమర్‌ పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమే 
డాక్టర్‌ సి హెచ్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, 
ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
ఫోన్స్‌: 9848011421