వదలను మహమ్మారీ...

 

ఆంధ్రజ్యోతి (03-11-2019):క్యాన్సర్‌... చాలామందికి శత్రువు. అతను మాత్రం క్యాన్సర్‌కే శత్రువు. ఆ మహమ్మారి మీద యుద్ధం ప్రకటించాడు. ఆ పోరాటానికి వంద ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

‘కిల్‌ ది క్యాన్సర్‌’ నినాదమే, మహాశృంగదాస ఆయుధం!
 
క్యాన్సర్‌... ఎక్కడో చదివిన పేరు. ఎవరినో వేధిస్తున్నట్టో, ఇంకెవర్నో బలితీసుకున్నట్టో విన్నట్టు గుర్తు. అంతేకానీ, ఆ వ్యాధి నేరుగా తన ఇంట్లోకే చొచ్చుకు వచ్చేస్తుందనీ, తన తండ్రినే పొట్టనపెట్టుకుంటుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. గతంలో నాన్న కాల్చిన బీడీలన్నీ కొరివిదెయ్యాలై నాన్ననే కాల్చుకుతిన్నాయని అర్థమైపోయింది. కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారి, ప్రాణాంతకం అవుతాయని... ప్రపంచానికి దండోరా వేసి చెప్పాలనిపించింది. 
 
కానీ, వయసు చాల్లేదు. ధైర్యం సరిపోలేదు. దానికితోడు, నాన్న మరణంతో నెత్తినపడిన బాధ్యతలు. కుటుంబాన్ని పోషించడానికి చదువుకుంటూనే... ట్యూషన్లు చెప్పాడు, చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు. అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు. జీవితంలో స్థిరపడ్డాడు. క్రమంగా అడుగులు ఆధ్యాత్మికతవైపు పడ్డాయి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ (ఇస్కాన్‌) అమితంగా ప్రభావితం చేసింది. ఆ బంధం మరింత బలపడింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఇస్కాన్‌ శాఖకు అధిపతి అయ్యారు మహాశృంగదాస. 
 
క్యాన్సర్‌ మరణాల గురించి విన్న ప్రతిసారీ... ఎవరో కొరడా ఝళిపిస్తున్న శబ్దం. ‘ఆహారపు అలవాట్ల గురించీ, ఆరోగ్య స్పృహ గురించీ ఎవరో ఒకరు ఆ వ్యక్తికి చెప్పి ఉంటే... తను మారేవాడేమో, బతికేవాడేమో’ అని ఎన్నిసార్లు అనుకుంటారో! ‘మన వంతుగా ఏమీ చేయలేమా?’ అంటూ తన ప్రతిపాదనను ఇస్కాన్‌ అధినాయకత్వం ముందుంచారు. ‘ఇది మీ ఆలోచన. మీరే ముందుకు తీసుకెళ్లండి’ అన్న సమాధానం వచ్చింది. ‘నిజమే... నేనే ఎందుకు చేయకూడదు? ఇస్కాన్‌ కూడా ఒక వ్యక్తితోనే... ప్రభుపాదులతోనే ప్రారంభమై మహాసంస్థగా విస్తరించిందిగా’ అనిపించింది. 
 
యువతే లక్ష్యంగా..
క్యాన్సర్‌ గురించి... పసిపిల్లలు అర్థం చేసుకోలేరు. వృద్ధులకేమో చెప్పినా ఉపయోగం లేదు. భవిష్యత్తు అంతా యువతదే. భారత్‌లో యువతరం జనాభా అపారం. అందులోనూ, ఎంతోకొంత ఆలోచించే తరం కాలేజీలలోనే ఉంది. కాబట్టి, ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లను లక్ష్యం చేసుకున్నారు. ఓ పెద్ద ఆడిటోరియంలో కుక్కేసినట్టు కూర్చోబెట్టి... గంటలకు గంటలు ఉపన్యాసం ఇస్తే వినే ఓపిక ఎవరికి మాత్రం ఉంటుంది? క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించాల్సిన పద్ధతి అది కాదు. యువతే మాట్లాడేలా ప్రోత్సహించాలి. మాట్లాడాలంటే, ఆలోచించాలి. ఆ ఆలోచనలో భాగంగా అధ్యయనం చేయాలి. అధ్యయనంతో అవగాహన పెరుగుతుంది. అవగాహనతో మాట్లాడేమాట... మెదడులోనూ రిజిస్టర్‌ అయిపోతుంది. ఇక, ఓ పట్టాన మరచిపోలేరు. ఉపన్యాస పోటీలే ఇందుకు మార్గం. మహాశృంగదాస... హైదరాబాద్‌ పరిసరాల్లోని కాలేజీలను లక్ష్యం చేసుకున్నారు. దాదాపుగా అన్ని విద్యాసంస్థలూ నగర శివార్లలోనే ఉన్నాయి. రోజూ ఉదయాన్నే బయలుదేరడం. ట్రాఫిక్‌ను ఛేదించుకుని... ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి... ఏదో ఓ కాలేజీకి వెళ్లడం. మీ విద్యార్థులకు ‘కిల్‌ ద క్యాన్సర్‌’ అనే విషయం మీద ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామని యాజమాన్యానికి వివరించడం... అదంతా జీవితంలో ఓ భాగమైపోయింది. నిజానికి అదే జీవితమై పోయింది. కొందరు అవుననేవారు. కొందరు కాదనేవారు. మరికొందరు అవునూకాదూ అనకుండా తప్పించుకునేవారు. కానీ, ఏదో ఒకరోజు మహాశృంగదాస పట్టుదలకు తలవంచేవారు. అలా, గత ఏడాది.. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి సంపాదించి మరీ నూటరెండు ఇంజినీరింగ్‌ కాలేజీలలో పోటీలు నిర్వహించారు. త్వరలోనే గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుంది. పోటీలు, సర్టిఫికెట్లు, బహుమతులు.. అంటే మాటలు కాదు. చాలా ఖర్చే ఉంటుంది. సాయం కోసం టాటా ట్రస్ట్‌ లాంటి ధార్మిక సంస్థల సాయం తీసుకుంటున్నారు.
 
మారిన జీవితాలు
‘కిల్‌ ద క్యాన్సర్‌’ ఉద్యమం చాలా జీవితాల్నే మార్చేసింది. ‘ఉపన్యాస పోటీలు జరుగుతున్నాయంటే పేరు ఇచ్చాను. ఓ ఐదు నిమిషాలు మాట్లాడాలంటే ఎంతోకొంత సమాచారం ఉండాలిగా! ఇంటర్నెట్‌లో శోధించాను. పుస్తకాలు చదివాను. మా నాన్నకు కిరాణా దుకాణం ఉంది. క్యాన్సర్‌ గురించి తెలిశాక... మా దుకాణంలో సిగరెట్లూ బీడీలూ విక్రయించకుండా నాన్న నుంచి మాట తీసుకున్నాను’ అని చెబుతుందో ఇంజినీరింగ్‌ విద్యార్థిని. ‘మా అమ్మకు ఛాతీ క్యాన్సర్‌ ఉందనీ, ఆ విషయం చెప్పడానికి సంకోచిస్తోందనీ... క్యాన్సర్‌ పట్ల అవగాహన వచ్చాకే నాకు అర్థమైంది. సకాలంలో తనని ఆసుపత్రికి తీసుకెళ్లాను. బతికించుకోగలిగాను’ అంటూ తన జీవితానుభవాన్ని వివరిస్తాడో విద్యార్థి. ‘పదో తరగతి నుంచీ సిగరెట్‌ అలవాటు ఉండేది. వేదిక మీద గొప్పగా మాట్లాడి, క్యాంటీన్‌లో సిగరెట్‌ వెలిగిస్తే ఫ్రెండ్స్‌ నవ్వరూ! అందుకే, నోస్మోకింగ్‌ నిర్ణయం తీసుకున్నా’ మనసువిప్పి వివరించాడో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ కుర్రాడు. ఇలాంటి పశ్చాత్తాపాలు ప్రతి క్యాంపస్‌లోనూ వినిపిస్తాయి, మహాశృంగదాస ఇమెయిల్‌ ఇన్‌బాక్స్‌లోనూ కనిపిస్తాయి. 
 
‘కిల్‌ ద క్యాన్సర్‌’ ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి... మొదటి స్థానాల్లో నిలిస్తే మంచి బహుమతి అందుతుంది. అలా విజేత అవుతారు. రెండు... చివరి స్థానంలో నిలిచినా సరే, అవగాహన వస్తుంది. ఇలా కూడా విజేత అవుతారు. ‘అంతిమంగా క్యాన్సర్‌ను మాత్రం గెలవనివ్వకూడదు’ మహాశృంగదాస (ఫోన్‌: 96526 75974) మహాస్థిరంగా చెబుతారు.