ఆంధ్రజ్యోతి,23/01/13
ఆధునిక సాంకేతిక విప్లవం ఫలితంగా చేతిలో మొబైల్ వుంటే చాలు ఏ సమాచారమైనా చిటికెలో మన ముందుంటోంది. కాని వైద్యరంగాన్ని సాంకేతిక రంగంతో అనుసంధానం చేయటంలో ప్రపంచం ఇంకా వెనకబడే ఉంది అంటున్నారు డల్లాస్‌లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాధురి కోగంటి. ముఖ్యంగా బ్రెయిన్‌స్ర్టోక్ కారణంగా శాశ్వత వైకల్యం పొందుతున్న వారికి ఆధునిక పరిజ్ఞానం సాయంతో సత్వర వైద్యం అందించటం ఎలా అని ఆమె ఆలోచించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తన సోదరుడు బాలు కిరణ్ కడియాలతో కలిసి బ్రెయిన్ స్ర్టోక్ చికిత్స కోసం ‘బ్రెయిన్ ఎటాక్ అనే నేటివ్ ఐ-ఫోన్’ అప్లికేషన్‌ను తయారుచేశారు. బ్రెయిన్‌స్ర్టోక్ బారిన పడుతున్న వారికి వరంగా మారిన ఈ ఆప్ రూపకర్తలైన అక్కాతమ్ముళ్లను కలుద్దాం రండి.
అవగాహన లేకపోవటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కారణంగా బ్రెయిన్ స్ర్టోక్‌కు గురయిన వారు శాశ్వతంగా వైకల్యం బారిన పడుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులో వుందనుకునే అమెరికాలోనే ఇలాంటి కేసులు కోకొల్లలు. ‘‘బ్రెయిన్ స్ర్టోక్కి గురయిన మూడు, నాలుగు గంటల్లోపు టిపిఎ డ్రగ్ ఇస్తే, పక్షవాతం వల్ల శాశ్వత వైకల్యానికి గురికాకుండా చూడవచ్చు. అయితే ఈ మెడిసిన్ గురించి కానీ, దాన్ని సత్వరం రోగికి అందించే మార్గం కానీ లేకపోవటంతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారిలో ఎక్కువమంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. సంవత్సరానికి 40 శాతం మందికి అందాల్సిన టిపిఎ 3-8 శాతానికి మాత్రమే అందుతోంది. అంటే 75 శాతానికి పైగా రోగులు సకాలంలో టిపిఎ అందక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించాం అనుకుంటున్న తరుణంలో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్న వారు ఇలా వైకల్యానికి గురికావటం బాధాకరం. అందుకే ఈ సమస్య గురించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ఉపయోగపడేలా సాంకేతికంగా ఏదైనా చేద్దామనిపించింది. టెక్నాలజీలో మంచి అనుభవం వున్న నా సోదరుడు బాలు కిరణ్ కడియాల సహకారం తీసుకుని వైద్యాన్ని - సాంకేతిక పరిజ్ఞానంతో జోడించే ప్రయత్నాలు ప్రారంభించాను. అందులో భాగంగా మొదట స్ర్టోక్ను గుర్తించడం, టిపిఎ డ్రగ్ ఇవ్వడంలాంటి వివరాలతో ఠీఠీఠీ.ుఽ్ఛఠటౌఛ్చిట్ఛ్ట్ఛఛిజి.ఛిౌఝ వెబ్‌సైట్‌ను రూపొందించాం. వెబ్సైట్ అయితే ఉపయోగకరంగానే ఉంది కానీ బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన వారి విషయంలో ప్రతి సెకను ఎంతో అమూల్యం కాబట్టి టిపిఎ డ్రగ్ గురించి మొబైల్ అప్లికేషన్ తయారుచేయడం మంచిదని చాలామంది డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అలా రూపొందిందే ఈ మొబైల్ అప్లికేషన్’’ అని చెప్పారు డాక్టర్ మాధురి కోగంటి, బాలు కిరణ్ కడియాల.
తొలి క్లినికల్ అప్లికేషన్
‘‘స్ర్టోక్ వచ్చాక మూడు నాలుగు గంటల్లోపు అయితేనే టిపిఎ మందు పనిచేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే ఈ మందు పనిచేయదు. చాలా సందర్భాల్లో అవగాహనారాహిత్యం వల్ల పేషెంట్లు శాశ్వత వైకల్యాన్ని పొందుతున్నారు. అందుకే బ్రెయిన్ స్ర్టోక్ వచ్చిన వ్యక్తిని పరీక్షించే ఏ డాక్టర్‌కి అయినా ఉపయోగపడేలా ఈ మొబైల్ అప్లికేషన్ తయారు చేశాం. డాక్టర్లే కాకుండా నర్సులు కూడా ఈ అప్లికేషన్ సాయంతో అత్యవసర చికిత్స అందించొచ్చు. అయితే స్ర్టోక్ వచ్చిన వాళ్లందరికీ ఈ మందు పనిచేయదు. బ్రెయిన్లో రక్తస్రావం అవుతున్నా, నాలుగున్నర గంటలు దాటినా, రక్తపీడనం, చక్కెర, రక్తకణాల్లో తేడాలు ఉన్నా ఇది పనిచేయదు. వీటన్నింటినీ గమనించుకున్న తరువాతే మందుని వాడాలి. ఈ అంశాలన్నిటినీ మేము తయారుచేసిన అప్లికేషన్ వాడి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఇటువంటి క్లినికల్ అప్లికేషన్ ఎవరూ తయారు చేయలేదు.
బ్రెయిన్ స్ర్టోక్ ఆప్‌ను ఉపయోగించి మూడు నుంచి ఐదు నిమిషాల్లో టిపిఎకి రోగి అర్హుడా కాదా అని వైద్యుడు అంచనాకు రావచ్చు. ఈ ఆప్‌ను ఇంక్లూజన్, ఎక్స్‌క్లూజన్ విభాగాలుగా విభజించాం. ఇందులో నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ స్ర్టోక్ స్కేల్ కూడా ఉంది’’ అన్నారు డాక్టర్ మాధురి.
ఉపయోగించటం సులభం
‘‘నేటివ్ ఐ-ఫోన్’ను ఐ-ట్యూన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించటం కూడా చాలా సులభం. ధర కూడా తక్కువే. డాలర్లలో అయితే 5.99 సెంట్స్. అంటే సుమారు 300 రూపాయలు. ఇందులో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. రెండో ప్రశ్నలోనే రోగి టిపిఎ డ్రగ్ తీసుకునేందుకు అర్హుడా కాదా అనేది తెలిసిపోతుంది. రోగి టిపిఎకి అర్హుడయితే ఆకుపచ్చ రంగులో, అర్హులు కాకపోతే ఎరుపు రంగులో ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ రెండూ కానప్పుడు పసుపు రంగు వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా డాక్టర్లు చికిత్స చేయడం సులభమవుతుంది. ఈ అప్లికేషన్లో ఉన్న మరో సౌకర్యం ఏమిటంటే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత వాటిని ఫోన్ నుంచే ఇ-మెయిల్ చేసుకోవచ్చు. ఆ సమాచారం కేస్ హిస్టరీగా పనికొస్తుంది. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అమెరికాలో కంటే యూరప్ దేశాల్లో ఈ అప్లికేషన్‌ను ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్‌ని రోజుకి రెండు వందల మంది చూస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐ- ప్యాడ్ వెర్షన్లలో కూడా వాడేందుకు వీలుగా ఈ అప్లికేషన్ తయారుచేస్తున్నాం’’ అన్నారు బాలుకిరణ్ కడియాల.
డౌన్లోడ్కే ఇంటర్నెట్
అక్క చెప్పగానే ఈ విషయం గురించి నెట్లో రీసెర్చి చేశాను. స్ర్టోక్కి సంబంధించిన అప్లికేషన్లేవీ కనిపించలేదు. కాని స్ర్టోక్ ట్రాక్ అనే ఆప్ ఒకటి కనిపించింది. అయితే అది వాడేందుకు వీలుగా లేదు. బాగా పరిశోధించి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు, నర్సులు వాడేలా డిజైన్ చేశాం. దీని తయారీకి ఏడాదిన్నర కాలం పట్టింది. పోయిన ఏడాది డిసెంబర్ 21న ఐ-ట్యూన్స్ ద్వారా దీన్ని విడుదల చేశాం. ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం కావాలి. ఉపయోగించేందుకు అవసరం లేదు.
-బాలుకిరణ్ కడియాల
సాఫ్ట్వేర్ ఇంజనీర్, పిహెచ్ఐ కన్సల్టింగ్ ఇంక్, చికాగొ
ఎక్కువ మందికి చేరువగా...
అమెరికాలో సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది బ్రెయిన్‌స్ర్టోక్ బారిన పడుతున్నారు. అయినా స్ర్టోక్ గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంది. మేం తయారుచేసిన ఈ అప్లికేషన్ ద్వారా తగినంత డేటాను సేకరించి, విస్తృతంగా పరిశోధన చేయాలని నా సంకల్పం. ప్రస్తుతానికి ఎంతమంది స్ర్టోక్ పేషెంట్లు వస్తున్నారు? వాళ్లలో ఎందరు టిపిఎ చికిత్స తీసుకుంటున్నారు? ఆసుపత్రుల్లో ఉన్న సర్వీసులు ఏమిటి? వంటి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. ఎక్కువమంది ఈ అప్లికేషన్ ఉపయోగించాలనేదే నా ప్రయత్నం.
- డాక్టర్ మాధురి కోగంటి, న్యూరాలజిస్ట్, డల్లాస్
కిరణ్మయి