మెదడుకు శక్తి ఇలా..!

22-08-2017: మొబైల్‌ ఫోన్‌నీ, పర్సనల్‌ డైరీనీ అలా వదిలేసి వెళ్లిపోవడం, బీరువా తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాక తలపట్టుకు కూర్చోవడం ఇవేమైనా మామూలు కష్టాలా? అలా అని ప్రతిదానికీ వార్థాక్యాన్నే తిట్టుకుంటే ఎలా? చాలా సార్లు ఈ మరిచిపోవడం వెనుక పోషకాహార లోపాలే కార ణం. ఈ లోపాలు ఆలోచనల అస్పష్టతకు కారణమవుతాయి. ఏకాగ్రతా స్థాయిని, వివేకాన్నీ, స్పందించే వేగాన్నీ తగ్గిస్తాయి. వాస్తవానికి మెదడు చక్కగా పనిచేసేలా చే యడంలో ఇనుము పాత్ర చాలా కీలకం. మెదడుతో సహా ధాతువుల న్నింటికీ ఆక్సిజన్‌ను కొనిపోయేది ఇనుమే.

 
ఒకవేళ ఈ ఇనుమే సరిపడా అందకపోతే ధాతువులన్నీ ఆక్సిజన్‌ కోసం విలవిల్లాడతాయి. ఈ క్రమంలో నీరసం, మతిమరుపు, ఏకాగ్రతా లోపాలు, చైతన్యం తగ్గిపోవడం, ఏ విషయం మీదా ఎక్కువ సేపు మనసు నిలపలేకపోవడం దేని మీదా శ్రద్ద లేకపోవడం, చంచలంగా ఉండడం, కార్యదక్షత తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఇనుము ఎక్కువగా లభించే ఆకుకూరల, ఎండు కర్జూర వంటివి తరుచూ తీసుకోవడం చాలా అవసరం. ఇనుప పాత్రల్లో వంట చేయడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. సి- విటమిన్‌ ఎక్కువగా ఉండే నిమ్మ, కమల, బత్తాయి, ద్రాక్షపండ్లను ప్రతిరోజూ తినడం కూడా చాలా అవసరం. వీటితో పాటు పాల ఉత్పత్తులు, అరటి పండ్లు కూడా తరుచూ తీసుకోవాలి.